Y Break: ఆఫీసుల్లో టీ బ్రేక్, లంచ్ బ్రేక్ లాగే ‘Y బ్రేక్’ కూడా త్వరలో వచ్చేస్తుంది, ఇంతకీ వైబ్రేక్ అంటే?
ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వై బ్రేక్ అన్ని ఆఫీసుల్లో వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగులకు కాసేపు రిఫ్రెష్ అవ్వడానికి టీ బ్రేక్ ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కోసం లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇకపై నుంచి Y బ్రేక్ కూడా వచ్చే అవకాశం ఉంది. వై బ్రేక్ అంటే యోగా బ్రేక్. ఆ సమయంలో కాసేపు యోగా చేసుకోవాలి. ఉద్యోగులు ఒత్తిడి తగ్గించుకోవడం కోసం వై బ్రేక్‌ని వినియోగించుకోవాలి.
మనదేశంలో లక్షల మంది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడితో పని చేస్తున్నారు. ఉద్యోగంలో ఒత్తిడిని, కుటుంబంలోని ఒత్తిడిని తట్టుకోలేక ఎంతోమంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఎన్నో సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. ఈ సర్వేలను సీరియస్‌గా తీసుకుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఈ శాఖ అధికారులు Y బ్రేక్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
వై బ్రేకులో ఉద్యోగులు ఆఫీసులో కాసేపు యోగా చేసుకోవచ్చు. దీని వల్ల పని ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇది వారి ఆరోగ్యానికి అత్యవసరమైనదని చెబుతోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఒక పది నిమిషాలు యోగా చేయడం వల్ల ఎన్నో సానుకూల మార్పులు ఉద్యోగుల్లో కలుగుతున్నట్టు తెలుస్తోంది. రోజుకు పది నిమిషాలు ఉద్యోగుల కోసం వై బ్రేకును ఇవ్వడంలో సంస్థలకు ఎలాంటి సమస్య ఉండదని చెబుతోంది ఆయుష్ మంత్ర శాఖ. ఇప్పటికే హ్యూమన్ ఎడ్జ్ అనే సంస్థ ఈ విధానాన్ని స్వాగతించింది. తమ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేందుకు ఈ వైబ్రేక్ ఉపయోగపడుతుందని చెబుతోంది. వై బ్రేక్ సమయంలో బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తూ, ఏకాగ్రతను పెంచే యోగాసనాలను వేస్తూ ఎంతో మంది ఉద్యోగులు భావోద్వేగాలను తట్టుకునే శక్తిని పొందుతున్నట్టు ఆ సంస్థ చెబుతోంది. ఇలా వై బ్రేక్‌లో యోగాను చేయడం వల్ల లేదా బ్రీతింగ్ వ్యాయామాలు పాటించడం వల్ల లోతుగా ఆలోచించగల శక్తి ఉద్యోగుల్లో పెరుగుతుంది. అలాగే ఉద్యోగుల్లో హార్మోన్ విడుదలపై కూడా ఈ బ్రేక్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్త పోటును నియంత్రించి వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వై బ్రేక్ అన్ని కార్యాలయాల్లోనూ ప్రస్తుతం లేదు. కొన్ని సంస్థలు ఈ వై బ్రేక్ అవసరాన్ని గుర్తించి తమ ఉద్యోగులకు ఇస్తోంది. ఇలా వై బ్రేక్ ఉండడం వల్ల వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారని, వారు సెలువులు పెట్టే శాతం కూడా తగ్గిపోయిందని చెబుతున్నాయి కొన్ని సంస్థలు. ఆరోగ్య నిపుణులు కూడా ఈ వై బ్రేకును సమర్థిస్తున్నారు. వైబ్రేక్‌లో చేసే యోగా, ఒత్తిడిని తగ్గించి... శారీరకంగా, మానసికంగా ఉద్యోగులను శక్తివంతంగా మారుస్తుందని చెబుతున్నారు. ఇది అన్ని కార్యాలయాల్లో వచ్చేలా చూసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ.
Also read: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.