Korean Skin Care Tips: కొరియన్ల చర్మ సౌందర్య రహస్యం ఇదే, ఈ 5 టిప్స్ పాటిస్తే అందం మీ సొంతం
కొరియా ప్రజల ముఖాలు భలే స్మూత్‌గా.. ప్రకాశవంతంగా ఉంటాయి. ఇందుకు కారణం.. వారు పాటించే ఈ సౌందర్య విధానాలే.
Korean Beauty Tips | ఓటీటీల వల్ల చాలామందికి కొరియన్ వెబ్ సీరిస్‌లు చూడటం అలవాటైంది. అయితే, వాటిలో నటీనటులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వారు అంత అందంగా ఎలా ఉంటారు. చర్మం అంత స్మూత్‌గా ఒక్క మచ్చ కూడా లేకుండా ఎలా ఉంటుందా అనిపిస్తుంది. బహుశా అది మేకప్ కావచ్చని కూడా అనుకుంటారు. కానీ, నిజంగానే వారి చర్మం కాంతివంతంగా ఉంటుంది. అందంగా మెరిసిపోతుంటుంది. ఇందుకు వారు పాటించే బ్యూటీ టిప్సే కారణం.
తడి బట్టతో..: కొరియన్స్ ఎక్కువగా ‘వాష్‌క్లాత్ ఎక్స్‌ఫోలియేషన్’ విధానంలో తమ అందాన్ని పెంచుకుంటారు. అంటే తడిసిన బట్టతో చర్మాన్ని శుభ్రం చేయడం. కొరియాలో ఇది సాంప్రదాయంగా కొనసాగుతున్న బ్యూటీ ట్రెండ్. చర్మంపై ఉండే మొండి మృత కణాలను తొలగించేందుకు ఇది ప్రభావంతమైన మార్గం. ఈ ప్రక్రియ సమయంలో శరీరంపై పేరుకున్న మురికి, మట్టి తదితరాలు అట్టలట్టలుగా ఊడిపోతాయి. వాష్‌క్లాత్ ఎక్స్‌ఫోలియేషన్ తరహాలోనే కొరియన్లు అనేక రకాల చర్మ సంరక్షణ పద్ధతులు పాటిస్తారు. అందుకే వారి చర్మం మెరిసిపోతుంటుంది.
స్టీమింగ్ షవర్: చర్మానికి మేలు చేసే మరో ఉత్తమ విధానం స్టీమింగ్ షవర్. ఈ ప్రక్రియలో నీటితో కాకుండా కేవలం నీటి ఆవిరితోనే శరీరాన్ని మసాజ్ చేస్తారు. ఈ ప్రక్రియ మిమ్మల్ని ఫ్రెష్‌గా ఉంచడమే కాదు, చర్మానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. కొరియన్లు ఎక్కువగా ముఖానికి ఆవిరి పెడతారు. ఆ తర్వాత కాసేపు ముఖానికి మసాజ్ చేస్తారు. ఆవిరి ముఖంలోని రంధ్రాలను తెరిచేందుకు సహాయపడుతుంది. దాని వల్ల చర్మంలోపల ఏమైనా బ్యాక్టీరియా తదితరాలు ఉన్నా.. శుభ్రమవుతాయి.
ఫేషియల్ ఎక్సర్‌సైజ్: మనలో చాలామంది ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌ను నిర్లక్ష్యం చేస్తారు. అయితే, దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌ల కోసం రోలర్లు, ఫేషియల్ మార్బుల్స్, మసాజర్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొరియన్లు అందం, చర్మ సంరక్షణ కోసం ఎక్కువగా ఇలాంటి ముఖ వ్యాయామాలు చేస్తారు.
‘టీ’ చర్మానికీ మేలు చేస్తుంది: టీలో విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే, ప్రపంచంలో చాలామంది టీని ఇష్టంగా తాగుతారు. ఈ టీ చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందనే సంగతి మీకు తెలుసా? కొరియన్లు ఉపయోగించే ఫేస్ ప్యాక్ తదితరాల్లో తప్పకుండా టీ పొడి లేదా టీ ఆకులను కలుపుతారు. (వీటి వల్ల ఏదైనా అలర్జీలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి.. ముందుగా నిపుణుల సూచనలు తీసుకోవాలి).
స్లోగింగ్: మీకు స్లోగింగ్ గురించి తెలుసా? కొరియా ప్రజలు ఎక్కువగా ఈ ప్రక్రియ పాటిస్తారు. ముఖానికి మందపాటి మాయిశ్చరైజింగ్ ఏజెంట్, పెట్రోలియం జెల్లీను అప్లై చేయడం ఈ విధానం ప్రత్యేకత. అయితే, రాత్రి పూట మాత్రమే చేస్తారు. నిద్రపోవడానికి ముందు వాటిని ముఖానికి మందంగా రాస్తారు. దీనివల్ల చర్మానికి మరింత లోతైన చికిత్స లభిస్తుందనేది వారి నమ్మకం. కొరియన్లు ఎక్కువగా డబుల్ లేయర్ సీరం, మాయిశ్చరైజర్ ఉత్పత్తులను ఎక్కువగా వాడతారు. కొరియన్లు తమ చర్మ సంరక్షణ పద్ధతులను ఎక్కువగా రాత్రివేళల్లోనే పాటిస్తారు. దానివల్ల ఉదయం లేచేసరికి వారి ముఖాలు ఫ్రెష్‌గా ఉంటాయి. మరే లోషన్లతో పనిలేకుండానే రోజంతా వారి ముఖాలు తాజాగా ఉంటాయి.
గమనిక: చర్మం చాలా సున్నితమైనది. కాబట్టి, త్వరగా రియాక్షన్‌కు గురవుతుంది. మీరు పై సూచనల్లో ఏదైనా చేయాలని భావిస్తే.. తప్పకుండా నిపుణులను సంప్రదించాలి. పై వివరాలు వైద్యానికి, నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు. ఈ కథనంలోని అంశాలకు ‘ఏబీపీ దేశం, ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యులు కాదు.