Bamboo Salt: వెదురుతో ఉప్పు, పావు కిలో రూ.7,600 - దీని ప్రత్యేకత తెలిస్తే ఔరా అంటారు!
బాంబూ చికెన్ గురించి మీరు వినే ఉంటారు. మరి, ఈ బాంబూ సాల్ట్ ఏమిటనేగా మీ సందేహం. అయితే, దీని ప్రత్యేకతల గురించి తెలుసుకోవల్సిందే.
Bamboo Salt: మీరు బాంబూ చికెన్ గురించి వినే ఉంటారు. మరి, ఇదేంటీ కొత్తగా బాంబూ సాల్ట్ అనేగా అనుకుంటున్నారు. అయితే, మీరు తప్పకుండా దీని గురించి తెలుసుకోవల్సిందే. పింక్ హిమాలయన్ రాక్ సాల్ట్ తర్వాత అత్యంత డిమాండ్ కలిగిన ఉప్పు ఇదే. మార్కెట్లో ఎన్నో రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నప్పుడు ఈ ఉప్పుకే ఎందుకు డిమాండ్ పెరుగుతుందనేగా మీ సందేహం? అయితే, తప్పకుండా తెలుసుకోవల్సిందే.
ప్రపంచంలో పింక్ హిమాలయన్ సాల్ట్‌తోపాటు సోయా సాల్ట్, పిచ్-బాక్ కిలౌయా ఒనిక్స్ సాల్ట్‌లను లగ్జరీ సాల్ట్స్‌గా పేర్కొంటారు. అయితే, వీటికంటే మరింత ఖరీదైన ఉప్పు ‘అమెథిస్ట్ బాంబూ సాల్ట్’. ఇది కొరియా సాంప్రదాయపు ఉప్పు. 240 గ్రాముల ఉప్పు ధర సుమారు 100 డాలర్లు (రూ.7,594). వామ్మో, అంత ధరా? అని ఆశ్చర్యపోతున్నారా? ఇందుకు కారణం దాని తయారీ విధానమే.
ఎలా తయారు చేస్తారు: వెదురు కర్రలను అడ్డంగా కత్తిరించి, వాటి మధ్యలో సముద్రపు ఉప్పును నింపుతారు. ఆ తర్వాత వాటిని కొలిమిలో పెట్టి బాగా కాల్చుతారు. ఇలా సుమారు తొమ్మిది సార్లు అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య ఉప్పుతో నిండిన వెదురు కర్రలను కాల్చుతారు. ఆ తర్వాత గడ్డల్లా మారిన ఉప్పును చేతులతో మాత్రమే స్పటికలుగా మార్చుతారు.
వందల ఏళ్ల చరిత్ర: వెదురు ఉప్పు.. కొరియాలో వందల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉంది. ఇది వారి సంస్కృతిలో భాగం. అప్పట్లో ఉప్పును వెదరు బొంగుల్లో వేసి కేవలం రెండు లేదా మూడు సార్లు మాత్రమే కాల్చేవారు. అయితే, వెదురును ఎక్కువగా కాల్చడం ద్వారా దానిలోని సారాన్ని ఉప్పులోకి చొప్పించడం సాధ్యమవుతుందని భావించారు. అప్పటి నుంచి వెదురు ఉప్పును 9 సార్లు కాల్చడం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ వల్ల ఆ ఉప్పులోని మలినాలు కూడా చనిపోయి నాణ్యత మరింత పెరుగుతుంది.
ఈ బాంబూ సాల్ట్ తయారీ కోసం మూడేళ్లపాటు బాగా పెరిగిన వెదురు బొంగులను వాడతారు. వాటిని కట్ చేయడం ద్వారా వచ్చే ఖాళీల్లో దక్షిణ కొరియాలోని పశ్చిమ తీరం నుంచి సేకరించిన సముద్రపు ఉప్పును నేరుగా ఆ బొంగుల్లో వేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక సిరామిక్ మట్టితో దాని పై భాగాన్ని మూసివేస్తారు. ఆ బొంగులను బట్టీలో ఉంచి కేవలం కలప మంట పైనే కాల్చుతారు. సుమారు 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉప్పు ద్రవీభవన స్థానానికి చేరుతుంది. వెదురు బొంగుల నుంచి ఉత్పత్తయ్యే రసంలో కలుస్తుంది. ఇది వెంట వెంటనే పూర్తయ్యే ప్రక్రియ కాదు. దీని తయారీకి సుమారు 50 రోజుల సమయం పడుతుందట.
Also Read: తిక్క జంట - ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ ఒక్కటై పెళ్లి, ఇంటి పేరే తంట!
ప్రయోజనాలేమిటీ?: ఈ ఉప్పులో అత్యధిక ఖనిజాలు ఉంటాయి. అయితే, ఈ బాంబూ సాల్ట్ ఉప్పగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఇది గుడ్డులోని పచ్చ సొన తరహా రుచిలో ఉంటుంది. వెదురు నుంచి వచ్చే నూనిని గ్రహించడం వల్ల ఆ రుచి వస్తుంది. బాంబూ సాల్ట్‌లో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయని కొరియన్లు చెబుతున్నారు. అయితే, దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రత్యేకంగా పరిశోధనలేవీ జరగలేదు. అయితే, ఈ ఉప్పు ఉత్పత్తిదారులు మాత్రం ఈ ఉప్పు జీర్ణక్రియ, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పలువురు వెల్లడించారు. అందుకే, ఈ ఉప్పుకు అంత డిమాండ్ అని అంటున్నారు.
Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..
బాంబూ సాల్ట్ తయారీ విధానాన్ని ఈ కింది వీడియోలో చూడండి: