Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
అమ్మాయిల అందం జుట్టులోనే ఉంటుంది. ఎంత పొడవాటి జడ ఉంటే వాళ్ళ అందం అంతగా రెట్టింపు అవుతుందంట.
కొంతమందికి జుట్టు చాలా పల్చగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సన్నగా పీసులాగా కనిపిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించి, మందంగా మార్చుకునేందుకు బయట దొరికే వాటి కోసం వెతుకులాట ఎందుకు. చక్కగా మీ కిచెన్ లో దొరికే వాటితోనే జుట్టు మందంగా మార్చుకోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించుకునేందుకు ఈ వంటగది చిట్కాలు ట్రై చేసి చూడండి. మెరుగైన ఫలితాలు పొందుతారు.
ఎగ్ మాస్క్: ప్రోటీన్లు పుష్కలంగా ఉండే వాటిలో గుడ్లు ఒకటి. ఇది జుట్టు పెరుగుదలకు, బలానికి అవసరం. ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకుని బాగా గిలకొట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల, జుట్టుకి అప్లై చేసుకోవాలి. దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటిలాగానే షాంపూ చేసుకోవాలి. వారానికి ఒక సారి ఈ మాస్క్ ఉపయోగిస్తే మంచిది. గుడ్డు సహజంగానే నీసు వాసన వస్తుంది కాబట్టి అది పోయే విధంగా తలస్నానం చేయాలి.
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. జుట్టు పెరుగుదల, మందాన్ని మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయను మిక్సీ చేయడం లేదా తురుము వేయడం వల్ల రసం వస్తుంది. దాన్ని వడకట్టుకుని ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచాలి. కాస్త ఘాటైన వాసన కలిగి ఉండటం వల్ల దాన్ని వదిలించుకోవడానికి బాగా కడిగి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమిడీ వారానికి రెండు సార్లు రిపీట్ చేయండి.
కలబంద: కలబంద జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ఆకుల నుంచి జెల్ తీసి తలకు నేరుగా అప్లై చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగే ముందు 30 నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచాలి. ఇది వారానికి 2-3 సార్లు పునరావృతం చేస్తే మంచిది.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో తేమ లక్షణాలు ఉన్నాయి. దీనితో రెగ్యులర్ గా స్కాల్ఫ్ మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్కాల్ఫ్ ని బలంగా మారుస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసి తలపై వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. తలస్నానం చేయడానికి 30 నిమిషాల ముందు రాసుకుని మసాజ్ చేస్తే జుట్టు కుదుళ్లు బలపడతాయి.
గ్రీన్ టీ: గ్రీన్ టీ జుట్టు ఆరోగ్యంపై అనేక ప్రయోజనాలు చూపిస్తుంది. ఒక కప్పు గ్రీన్ టీ చేసుకుని దాన్ని చల్లబరచాలి. దాన్ని తలకి పట్టించి కాసేపు ఉంచుకోవాలి. షాంపూ చేసి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియ వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే మంచిది.
ఇవే కాదు సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం కూడా జుట్టు సంరక్షణ పద్ధతులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. జుట్టు చివర్ల మాత్రమే కాకుండా అప్పుడప్పుడు హెయిర్ కటింగ్ చేయిస్తూ ఉండటం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!