Healthy Heart: ఈ పది చిట్కాలు పాటించండి చాలు, మీ గుండెకు కొండంత బలం
గుండెపోటు లేదా గుండె జబ్బులు ఎవరికి ఎప్పుడు వస్తాయో అంచనా వేయలేని పరిస్థితి.
పిడికెడంత గుండె కొట్టుకుంటేనే మనిషి ప్రాణం నిలిచేది. అందుకే గుండె బలంగా ఉండాలని చెబుతుంటారు. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని పంపు చేసే గుండె ఎంత శక్తివంతంగా ఉంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మారిన కాలంలో కేవలం 20 ఏళ్ళ వయసుకే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే గుండె సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. అనారోగ్య జీవనశైలి కారణంగా పాతికేళ్లలోపు కార్డియాక్ అరెస్టు, గుండెపోటు వంటి వాటితో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే గుండెను కాపాడుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. కార్టిసోల్ హార్మోను ఒత్తిడి అధికంగా కలిగినప్పుడు శరీరంలో విడుదలవుతుంది. ఈ హార్మోను గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి హార్మోన్లు ఉత్పత్తి కాకుండా చూసుకోవలసిన అవసరం ఉంది. ప్రశాంతమైన మనసుతో పాటు రోజు వ్యాయామం చేసే వారిలో కార్టిసోల్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.
2. కార్లు, బైకులు వచ్చాక వాకింగ్, సైకిల్ తొక్కడం వంటివి పూర్తిగా తగ్గిపోయాయి. కానీ రోజూ గంట సైకిల్ తొక్కినా లేక గంటపాటు నడిచినా గుండెకు ఎంతో బలం. లిఫ్టులు వాడడం మాని మెట్లు ఎక్కడం, దిగడం చేస్తూ ఉంటే గుండె బలంగా మారుతుంది.
3. ఆధునిక కాలంలో నిద్రలేమి ఎక్కువ మందిని వేధిస్తోంది. నిద్రలేమి సమస్య వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బుకు దారితీస్తుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవడం చాలా ముఖ్యం. ఉదయం పూట నిద్ర గుండెకు అంత శక్తిని ఇవ్వదు. కానీ రాత్రిపూట కచ్చితంగా మంచి నిద్ర పోవాలి.
4. ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రోజులో కనీసం 20 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. లేకుంటే గుండె వైఫల్యం చెందే ప్రమాదం పెరుగుతుంది.
5. గుండెకు అవసరమయ్యే ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలి. గుండెకు ప్రోటీన్లు నిండిన ఆహారం అవసరం. చిక్కుళ్ళు, బఠానీలు, చేపలు, బాదం, పిస్తా వంటివి అధికంగా తినేలా చూసుకోవాలి.
6. ప్రతిరోజూ మనసారా నవ్వడం నేర్చుకోండి. నవ్వడం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. రక్త ప్రసరణ సజావుగా సాగి రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి నవ్వించే సినిమాలు, నవ్వించే స్నేహితులతో ఎక్కువ సేపు గడపండి.
7. అధిక బరువు శరీరంలోని మొదట ప్రభావం చూపేది గుండెపైనే. కాబట్టి బరువు పెరగకుండా ముందు నుంచే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.
8. శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. రోజూ మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగండి. నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. దీనివల్ల గుండె సమస్యలు ఎక్కువవుతాయి.
9. ఎప్పుడూ ఇల్లు, ఆఫీసు మాత్రమే అనుకుంటే జీవితం బోర్ కొట్టేస్తుంది. శరీరం కూడా అలసిపోతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి అప్పుడప్పుడు టూర్లకి వెళ్లడం మంచిది. ముఖ్యంగా శరీరానికి విటమిన్ డి లభించేలా చూసుకోండి.
10. మధుమేహం వస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. మధుమేహానికి, గుండె జబ్బుకు ఉన్న లింక్ గురించి ఇంతకు ముందే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కాబట్టి మధుమేహం రాకుండా చూసుకోండి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి.
Also read: కొత్తిమీరను రుచి, వాసన కోసమే వాడుతారనుకుంటే పొరపాటే - ఇది చేసే మేలు ఎంతో
Also read: భోజనం చేశాక వెంటనే చేయకూడని పనులు ఇవే, లేకుంటే ఈ సమస్యలు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.