Income Tax: తండ్రి తన కొడుక్కి ఎంత ఆస్తిని బహుమతిగా ఇవ్వచ్చు? చట్టం ఏం చెబుతోంది?
తండ్రి తన స్వార్జితమైన ఆస్తిని కొడుక్కి బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఎంత పరిమితి మేరకు ఇవ్వచ్చో, నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.
తండ్రి నుంచి వచ్చే ఆస్తి రెండు రకాలు. పిత్రార్జితం, స్వార్జితం. అంటే తండ్రికి తన తాత, ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని పిత్రార్జితం అంటారు. అదే తండ్రి స్వయంగా సంపాదించినదైతే స్వార్జితం అంటారు. పిత్రార్జిత ఆస్తిపై కొడుకు, కూతురు ఇద్దరికీ హక్కు ఉంటుంది. కానీ స్వార్జిత ఆస్తితోనే సమస్య. తండ్రి తాను స్వయంగా సంపాదించిన ఆస్తిని తనకు నచ్చిన వారికి రాసిచ్చే హక్కు ఉంది. తాను సంపాదించిన ఆస్తిని ఎవరికైనా ధారాదత్తం చేసే సర్వహక్కులు ఆయనకు ఉన్నాయి. అయితే తండ్రి తన కొడుక్కి ఆస్తినంతా బహుమతి రూపంలో ఇవ్వాలనుకుంటే... దానికి పరిమితులు ఉన్నాయా అనే అంశంపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి.
లివ్ మింట్ కథనం ఆధారంగా... ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం తండ్రికే కాదు ఏ వ్యక్తికైనా బహుమతి రూపంలో తన స్వార్జిత ఆస్తిని ఎవరికైనా ఇచ్చేందుకు ఎలాంటి పరిమితి లేదు. తండ్రి స్వార్జితమైన యావదాస్తిని కొడుక్కి గిఫ్ట్ రూపంలో ఇచ్చేయచ్చు. అయితే, కొన్ని పరిస్థితులలో బహుమతిగా అందుకున్న ఆస్తి నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించి మాత్రం క్లబ్బింగ్ నిబంధనలు వర్తిస్తాయి. అంటే కొడుకు లేదా కోడలికి ఆస్తిని గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు, ఆ బదిలీ చేయబడిన ఆస్తి కారణంగా వచ్చే ఆదాయాన్ని బహుమతిగా ఇచ్చిన వ్యక్తితో క్లబ్ చేయాల్సి ఉంటుంది.
మనదేశంలో ఉన్న పన్ను చట్టాల ప్రకారం ఒక వ్యక్తి బహుమతిగా అందుకున్న ఆస్తి విలువ యాభైవేల రూపాయల కన్నా తక్కువుంటే అతనికి ఎలాంటి పన్ను పడదు. కానీ అంతకుమించి విలువైనదైతే మాత్రం దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తండ్రి తన కొడుక్కి ఆస్తిని బదిలీ చేస్తున్నప్పుడు ‘స్పెసిఫైడ్ రిలేటివ్స్’ కేటగిరీలో కవర్ అవుతారు. కనుక ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. కాబట్టి తండ్రి ఎలాంటి సమస్యా లేకుండా తన కొడుక్కి ఎంత విలువైన ఆస్తినైనా బహుమతిగా ఇవ్వవచ్చు.
మరొక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి... ఒక వ్యక్తి రెండు లక్షల రూపాయలకు మించి క్యాష్ రూపంలో బహుమతిని తీసుకుంటే, దానికి తగ్గట్టు జరిమానా పడొచ్చు. కాబట్టి క్యాష్ రూపంలో బహుమతులు తీసుకుంటే రెండు లక్షల రూపాయల కన్నా తక్కువే స్వీకరించండి.
Also read: అమ్మ అవ్వాలనుకుంటే... మీరు, మీ శరీరం సిద్ధమవ్వండిలా
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి