General Anxiety: మానసిక ఆందోళన మితిమీరిపోయిందా? అయితే అది జబ్బే
మానసిక ఆందోళన మితిమీరిపోతే దాన్ని జబ్బు గానే భావించాలని చెబుతున్నారు వైద్యులు.
భయం, ఆందోళన అనేది చాలా సహజంగా వస్తూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో అందరూ ఆందోళన పడుతూనే ఉంటారు. అయితే ఆ ఆందోళన సాధారణంగా వస్తుందా? లేక జబ్బుగా మారిపోయిందా? అనేది మాత్రం గమనిస్తూ ఉండాలి. జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్... ఇది ఇప్పుడు ఎక్కువ మందిని వెంటాడుతున్న సమస్య. దీన్ని తేలిగ్గా తీసుకోవడం కుదరదు. కచ్చితంగా మందులు వాడాల్సిందే. లేకపోతే దీర్ఘకాలంగా మనిషిని వెంటాడి శారీరకంగా, వృత్తిగతంగా అన్ని రకాలుగా జీవితాన్ని కుంగదీస్తేస్తుంది.
ఏమిటి ఈ డిజార్డర్?
జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్‌ను GAD అని పిలుచుకుంటారు మానసిక వైద్యులు. మితిమీరిన మానసిక ఆందోళన దీని లక్షణం. అలా ఆందోళన పడుతున్నప్పుడు గుండె వేగం పెరుగుతుంది. రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. శ్వాస వేగంగా తీసుకుంటారు. చాలా ఆందోళన పడుతుంటారు. భయపడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే అతిగా ఆలోచిస్తారు. కొందరు ఊపిరి తీసుకోలేకపోవడం, ఛాతీ నొప్పి రావడం, ఛాతీపై బరువు పెట్టినట్టు అనిపించడం, పదేపదే బాత్రూంకి వెళ్లి రావడం, వణుకు రావడం, గుండెపోటుతో చనిపోతామేమో అన్నంతగా భయపడడం ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా యాంగ్జయిటీ డిజార్డర్ లక్షణాలే.
ఈ డిజార్డర్ యుక్తవయసులో లేదా 30 ఏళ్లు దాటాక వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. ఆడవారిలోనే ఈ జబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇది వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం. ఈ ఆందోళన రావడానికి ప్రత్యేక కారణాలు ఇప్పటికీ తెలియదు. మెదడులో అమిగ్ధల అనే భాగం ఉంటుంది. అదే మన భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుంది. ఇది గాబా ఎర్జిక్ నాడీ కణాలను ఇది ప్రేరేపిస్తుంది. ఈ కణాలు మనలో కలిగిన ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. ఎప్పుడైతే ఈ గాబా ఎర్జిక్ కణాల సంఖ్య తగ్గిపోతుందో అప్పుడు ఆందోళన,భయం వంటివి పెరిగిపోతాయి.
చాలా మంది మానసిక ఆందోళనను చిన్న సమస్యగా భావిస్తారు. ఒత్తిడి అనుకుంటారు. ఒత్తిడి కలిగినా త్వరగా పోతుంది. కానీ మానసిక ఆందోళన అలా పోదు. చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి కచ్చితంగా మందులు వాడాలి. వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఈ యాంగ్జయిటీ డిజార్డర్ వల్ల నీరసంగా అనిపిస్తుంది. నిస్సత్తువగా ఉంటుంది. చెమటలు పట్టేయచ్చు. నిద్ర సరిగా పట్టదు. ఏకాగ్రత తగ్గిపోతుంది. కాబట్టి కచ్చితంగా చికిత్స తీసుకోవాల్సిందే. చికిత్స తీసుకుంటూనే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే త్వరగా కోలుకుంటారు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చు.
Also read: డయాబెటిస్ ఉంటే మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుందట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.