Milk With Honey: పాలు, తేనె కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమా?
పాలు, తేనె ఆరోగ్యానికి పోషకాలు అందిస్తాయి. మరి ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
పాలు, తేనె ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు అందించడంలో ముందుండే పదార్థాలు. ఇవి రెండు విడివిడిగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే పాలతో కలిపి తేనె తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో పంచదారకి బదులు ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే రుచిగా ఉంటుంది. ఇవి రెండింటిని కలిపి తీసుకుంటే అసంఖ్యాకమైన ప్రయోజనాలు అందిస్తుంది.
పోషకాలు సమృద్ధి
పాలు, తేనె ఆరోగ్యకరమైన కలయిక. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డితో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. తేనె రుచి ఇష్టపడే వాళ్ళు తరచుగా దీన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. శుద్ది చేసిన చక్కెర తీసుకోవడం కంటే స్వచ్చమైన తేనెని తీపి రుచి కోసం ఎంచుకోవడం ఉత్తమం.
ఆరోగ్య ప్రయోజనాలు
☀ పాలు, తేనె కలిపి తీసుకోవడం వల్ల నిద్ర హాయిగా పడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జీర్ణక్రియని ప్రోత్సహిస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.
☀ గోరు వెచ్చని పాలలో తేనె కలిపి నిద్రపోయే ముందు తాగితే నరాలకు శాంతిని ఇస్తుంది. నాడీ వ్యవస్థకి ప్రశాంతతని కలిగించే లక్షణాలు ఇందులో ఉన్నాయి. విశ్రాంతికి సహాయపడుతుంది.
☀ వివిధ సంస్కృతులలో పాలు, తేనె, సుగంధ ద్రవ్యాలు కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి ఇతర వ్యాధులని నయం చేస్తుందని నమ్ముతారు.
సైడ్ ఎఫెక్ట్స్
☀ పాలు, తేనె రెండూ కేలరీలని కలిగి ఉంటాయి. వీటి అద్భుతమైన రుచి కారణంగా వీటిని తీసుకోకుండా ఉండలేరు. కానీ ప్రయోజనాలు ఏ విధంగా ఇస్తుందో దాని వల్ల అదే విధంగా అనార్థాలు కూడా ఉన్నాయి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరగడానికి దారి తీస్తుంది.
☀ తేనె సహజమైన స్వీటేనర్. ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ చక్కెర మూలం ఉన్నట్టే. అధిక చక్కెర వినియోగం దంత సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మిక హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది.
☀ పాలు, తేనె ఆహార కలయిక కొంతమందికి ఫుడ్ అలర్జీని కలిగిస్తుంది.
☀ లాక్టోజ్ అసహనంతో బాధపడే వారికి తేనె, పాలు కలయిక అజీర్ణం సమస్యని కలిగిస్తుంది. అందుకే ఈ సమస్య ఉన్న వాళ్ళు శాఖాహారి పాలు తాగడానికి ఎంచుకోవడం మంచిది.
☀ తేనె నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాలలో తేనె అపరిశుభ్రంగా ఉంటుంది. లేదా కల్తీది ఉంటుంది. అటువంటి దాన్ని పాలతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ హానికరమైన ప్రభావం చూపుతుంది.
☀ సంవత్సరం లోపు శిశువులకి ఎట్టి పరిస్థితిలోనూ తేనె పెట్టకూడదు. బోటులిజం ప్రమాదం ఎదురవుతుంది. వారి జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుకే తేనెలోని క్లోస్ట్రీడియం బోటులిజం సమస్యని కలిగిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మానసిక ఆరోగ్యాన్ని కాపాడే జపాన్ టెక్నిక్ 'జాజెన్'