రోజూ పనీర్ తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?
వెజిటేరియన్లకు పనీర్ ఎంతో ఇష్టమైన పదార్థం.
మాంసాహార ప్రియులకు రోజూ ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ ఉండాల్సిందే. అలాగే కొంతమంది శాఖాహార ప్రియులకు పనీర్ వంటకాలు కూడా రోజూ ఉండాల్సిందే. భారతీయ వంటకాల్లో పనీర్ వంటకాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. పనీర్ బిర్యాని, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్, పనీర్ టిక్కా... ఇవన్నీ కూడా భారతీయుల మనసు దోచిన ఆహారాలు. అయితే కొంతమంది ప్రతిరోజూ పనీర్ తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే సందేహాలు కూడా వారిలో ఉన్నాయి.
ఈ ఆహారమైనా ప్రతిరోజు మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. కానీ అతిగా తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. పనీర్ శాఖాహారులకు ఎంతో మంచి ఎంపిక. పనీర్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పనీర్ తింటే 18 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. అంటే 100 గ్రాముల చికెన్‌లో ఉండే ప్రోటీన్ 100 గ్రాముల పనీర్‌లో ఉంటుందన్నమాట. అందుకే శాఖాహారులు ప్రోటీన్ లోపం రాకుండా పనీర్ ఎంచుకుంటారు. అలాగే పనీర్ తిన్నాక ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారాలు ఏవి తినాలన్న కోరిక కూడా పుట్టదు. కాబట్టి పనీర్ తినడం అన్ని విధాలా ఆరోగ్యకరమే.
దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి. బోలు ఎముకలకు వ్యాధి రాకుండా అడ్డుకోవడంలో పనీర్ ముందుంటుంది. ఆర్థరైటిస్ వంటి రోగాల బారిన పడినవారు పనీర్‌ను ప్రతి రెండు రోజులకు ఒకసారి తినడం చాలా ముఖ్యం. పనీర్‌లో ప్రోటీన్లు అధికంగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ రోగులు కూడా పనీర్‌ను తినవచ్చు. ఇది జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా పని ఒక ఉత్తమమైన ఎంపిక. తరచూ పనీర్ తినే వారిలో రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తికి జింక్ చాలా అవసరం. దాన్ని అందించే శక్తి పనీర్ కు ఉంది. కాబట్టి పనీర్‌ను పిల్లలు, పెద్దలు తినాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి కొవ్వులను పెంచడంలో కూడా సహాయపడుతుంది. గుండెజబ్బుల ప్రమాదం రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు పెరగడం వంటి సమస్యలు ఉండవు. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
పనీర్ రోజూ తినవచ్చా అంటే నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ 50 గ్రాములకు మించకుండా తింటేనే మంచిది. ప్రతిరోజు తినేవారు వంద గ్రాముల పనీర్ తినాల్సిన అవసరం లేదు. దీనివల్ల బరువు త్వరగా పెరిగిపోతారు. రోజుకు 50 గ్రాముల పనీర్‌ను తింటే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి.