Chewing Gum Benefits: చూయింగ్ గమ్ నమిలితే బరువు తగ్గుతారా? అపోహలు - వాస్తవాలు ఇవే!
ఖాళీగా ఉండి ఏమి ఊసుపోనప్పుడు చాలా మంది చూయింగ్ గమ్ నములుతూ బుడగలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. దీన్ని నమలడం వల్ల బరువు తగ్గుతారని అంటారు.. అయితే అది నిజమేనా.. దీనిపై నిపుణులు ఏమంటున్నారు.
చాలా మంది బోరింగ్‌గా అనిపించినప్పుడు సరదాగా చూయింగ్ గమ్ నములుతారు. చిన్న పిల్లలైతే చూయింగ్ గమ్ నమిలి వాటితో బుడగలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మరి కొంతమంది మాత్రం దీన్ని తింటే నోటికి మంచిది కాదని, దంతాలు పాడైపోతాయని అంటారు. కొందరు చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయని అనుకుంటారు. ఇంకొందరు ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే వీటిలో ఏది నిజం? చూయింగ్ గమ్ నమలడం నిజంగానే ఆరోగ్యానికి హానికరమా? లేదా మేలు జరుగుతుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
నిజంగానే కేలరీలు బర్న్ అవుతాయా?
చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చువుతాయనేది నిజమనేట. అది కేవలం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ వల్ల మాత్రమే సాధ్యమట. షుగర్ ఫ్రీ చూయింగమ్ నమిలితే.. గంటకు 11 కేలరీలు ఖర్చవుతాయని తేలింది. అయితే, బరువు తగ్గడానికి ఈ మోతాడు సరిపోదు. 2018లో జర్నల్ ఆఫ్ ఫిజికల్ థెరపీ సైన్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. వర్కవుట్స్ చేస్తూ చూయింగ్ గమ్ నమలడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. వారి హృదయ స్పందన రేటు కూడా వేగంగా ఉంటుంది. 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు నడుస్తూ.. చూయింగ్ గమ్ నమలడం వల్ల చాలా ప్రయోజనాలను పొందినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
గమ్ మింగితే నిజంగానే పేగులకి చుట్టుకుంటుందా?
చూయింగ్ గమ్ నమిలి మింగేస్తే పేగులకి చుట్టుకుపోతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే అది నిజం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరం చూయింగ్ గమ్‌ను జీర్ణించుకోలేదు. దాన్ని మింగడం వల్ల పేగులకు ఎటువంటి సమస్య రాదని న్యూయార్క్‌కు చెందిన డెంటిస్ట్ డేవిడ్ చెన్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. అయితే, చూయింగ్ గమ్‌లను నమిలి ఊసేయకుండా పదే పదే మింగేస్తుంటే.. అవి పేగుల్లో అడ్డంకులు కలిగిస్తాయని, ముఖ్యంగా చిన్నారుల్లో ఇలాంటి సమస్యను గుర్తించామని చెప్పారు. ఎక్కువ చూయింగ్ గమ్‌లు ఒక్క చోటే పేరుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయన్నారు.
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ దంతాలకు మంచిదేనా?
చక్కెరతో చేసిన చూయింగ్ గమ్ దంతాలకి చెడ్డది. ఎందుకంటే ఇది కావిటీలకు కారణమవుతుంది. కానీ షుగర్ ఫ్రీ గమ్ మాత్రం మంచిదని అంటున్నారు డాక్టర్ చెన్ అన్నారు. ఇది నోటిలో ఎక్కువ లాలాజలాన్ని సృష్టిస్తుంది. ఇది దంతాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. దీన్ని నమిలితే దవడలు బలోపేతం అవుతాయి.
అపోహ- వాస్తవం
చూయింగ్ గమ్ నమలడం మంచిదా, చెడ్డదా? అనే సందేహం అందరిలోను ఉంటుంది. అయితే ఇది కొంతవరకు మేలు చేస్తే.. మరికొంత మాత్రం చెడు చేస్తుంది. షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ తినడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయనేది వాస్తవమే. అది కొద్ది పరిమాణంలో మాత్రమే. ఇది మీ దంతాలను శుభ్రం చేస్తుంది. దవడలకు మంచి వ్యాయామం కూడా. కానీ, దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే చూయింగ్ గమ్ నమిలే సమయంలో నోటి ద్వారా గాలి ఎక్కువగా లోపలికి వెళ్తుంది. దాని వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి కడుపులో సమస్యగా మారుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: జుట్టు చివర్ల కత్తిరిస్తే నిజంగానే పెరుగుతుందా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Also Read: బొజ్జ తగ్గాలా? పరగడుపున ఇది తాగితే బెల్లి ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది, ఇలా తయారు చేయండి