Asthma: ఆస్థమా వారసత్వంగా వస్తుందా? ఒక్కసారి వస్తే శాశ్వతంగా ఉండిపోతుందా?
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మందిని వేధిస్తున్న సమస్య ఆస్థమా.
ఆస్థమా... నిజానికి ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాదు. కానీ అలసత్వం కారణంగా కొన్ని సార్లు ప్రాణాలు పోతున్నాయి. ఈ జబ్బు పట్ల ప్రజల్లో ఉన్న అవగాహన చాలా తక్కువే. ఆస్థమాను తక్కువ అంచనా వేసి చాలా మంది చికిత్స తీసుకోరు, మందులు వాడరు. దీని వల్లే అది తీవ్రంగా మారి ఊపిరి తీసేంత స్థాయికి చేరుకుంటోంది. మనదేశంలో దాదాపు మూడు కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. వీరిలో లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఊబకాయం ఉన్న వారిలో ఆస్థమా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అలాగే విటమిన్ డి లోపం ఉన్న వారిలోనూ త్వరగా దాడి చేస్తుంది.
అసలేంటి ఆస్థమా?
ఇది ఒక శ్వాసకోశ సమస్య. ఒక్కసారి వచ్చిందా దీర్ఘకాలంగా కొనసాగుతుంది. ఊపిరితిత్తుల్లోని గాలి గొట్టాలకు సంబంధించినది ఇది. ఆస్థమా వ్యాధిగ్రస్తుల్లో ముక్కు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే గాలి సక్రమంగా వెళ్లలేదు. కాస్త దుమ్మూ ధూళి తాకిన అలెర్జీ కలిగి గాలిగొట్టాల్లో వాపు మొదలవుతుంది. దీని వల్ల గాలి గొట్టాల్లోని మార్గం సన్నబడుతుంది. అలాగే ఆ గొట్టాల్లో జిగురుగా ఉండే ద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల గాలి ప్రవాహానికి ఆటంకం కలిగి ఊపిరి సరిగా అందదు.దీనినే ఆస్థమా అంటారు.
వారసత్వంగా వస్తుందా?
ఆస్థమా వారసత్వంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. తల్లిదండ్రులకు ఈ రోగం ఉండే పుట్టే బిడ్డకు వచ్చే అవకాశం 70 శాతం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికే ఆస్థమా ఉంటే బిడ్డలకు వచ్చే అవకాశం 30 శాతానికి తగ్గుతుంది. ఏదేమైనా ఇది వారసత్వం వచ్చే రోగమే.
పిల్లల్లో...
చిన్న పిల్లల్లో వచ్చిన ఆస్థమా వారు పెద్దయ్యాక తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ అది అవాస్తవం. అలెర్జీ కారకాలు చుట్టూ లేకపోతే ఆస్థమా తగ్గినట్టు అనిపిస్తుంది, అలెర్జీ కారకాలు ఎటాక్ చేయగానే మళ్లీ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఆస్థమాతో బాధపడే పిల్లల్ని చాలా మంది బయట ఆడనీయరు. కానీ అది మంచి పద్ధతి కాదు. దుమ్మూ ధూళి శరీరంలో చేరుతుందనుకుంటే నోటికి, ముక్కుకు మాస్క్ పెట్టి పిల్లల్ని ఆడనివ్వాలి. వారికి శారీరక వ్యాయామం చాలా అవసరం. దీని వల్ల ఆస్థమా ఇంకా తగ్గుముఖం పడుతుంది.ఆస్థమా ఉన్న మహిళలు గర్భం ధరిస్తే మందులు వాడడం మానేస్తారు. అలా చేయడం వల్ల ఆస్థమా నియంత్రణలో ఉండదు. ఫలితంగా గర్భస్రావం, నెలలు నిండకుండా ప్రసవించడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఆస్థమా మందులు ఎప్పటికప్పుడు తీసుకుంటూ, జాగ్రత్తలు పాటించి నియంత్రణలో ఉంచుకోవాలి.
Also read: ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వీటిని తింటే ఇట్టే తగ్గిపోతాయి
Also read: ఆల్కహాల్ అతిగా తాగుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ డామేజ్ అయినట్టే