Liver Damage: ఆల్కహాల్ అతిగా తాగుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ డామేజ్ అయినట్టే
ఆల్కహాల్ తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా కొంతమంది తాగుతూనే ఉంటారు. అలాంటి వారు లివర్ డ్యామేజ్ అయిందేమో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
కాలేయం పనితీరు బావుంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. శరీరంలో చేరిన ఆల్కహాల్ కాలేయంలోని ఎంజైమ్ లు విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుంది. దీనివల్ల కాలేయం పనితీరు మారిపోతుంది. నిజానికి కాలేయంలోని కణాలు తిరిగి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి, కానీ అతిగా ఆల్కహాల్ తాగడం వల్ల కణజాలం వేగంగా నష్టపోతుంది. అంతే వేగంగా వాటి ఉత్పత్తి జరుగదు. అంతేకాదు పునరుత్పత్తి అయ్యే కణాలు కూడా అనారోగ్యకరంగా ఉంటాయి. ఇలా దీర్ఘకాలంగా సాగితే కాలేయం కీలక విధులను నిర్వహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాలేయం ఇలాంటి స్థితికి చేరడానికి ముందు కొన్ని లక్షణాలు బయటపెడుతుంది. వాటి ద్వారా లివర్ డ్యామేజ్ అవుతున్న సంగతి తెలుసుకుని జాగ్రత్తపడాలి.
ఇవే లక్షణాలు
1. ఆల్కహాల్ వల్ల కాలేయం దెబ్బతినడం మొదలైతే నోరు పొడిబారిపోతుంది.విపరీతంగా దాహం వేస్తుంది. మద్యం తాగడం వల్ల లాలాజలం ఊరడం తగ్గిపోతుంది. దాని వల్లే ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి.
2. తరచుగా వికారంగా అనిపిస్తుంది. విపరీతమైన వాంతులు, అతిసారం లక్షణాలు కనిపిస్తాయి. వికారం తరచూ వస్తుంటే మీ కాలేయం సరిగా పనిచేయడం లేదని అర్థం. శరీరంలోని టాక్సిన్లను తొలగించే ప్రక్రియలో కాలేయం సమర్థంగా పనిచేయలేకపోవడం వల్ల వాంతులు అవుతాయి. అలసటగా ఉండడం, శక్తి హీనంగా అనిపించడం, జ్వరం తరచూ రావడం వంటివి కాలేయ అనారోగ్యాన్ని సూచిస్తాయి.
3. మద్యం అధికంగా తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. దీని వల్ల సరైన పోషకాలు, ఖనిజాలు శరీరానికి అందవు. బరువు హఠాత్తుగా తగ్గినట్టు అనిపించినా అది లివర్ డ్యామేజ్ కారణంగా అనుకోవచ్చు.
4. సిర్రోసిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి కాలేయానికి వస్తుంది. ఇది ఆల్కహాల్ సేవనం వల్లే వస్తుంది. ఈ వ్యాధి వచ్చినా కూడా చాలా బలహీనంగా మారిపోతారు. బరువు తగ్గిపోతారు.
5. ఆల్కహాల్ తాగే వ్యక్తి పొట్ట కుడి ఎగువ భాగంలో నొప్పి రావడం, అసౌకర్యంగా అనిపించడం జరిగితే అది కాలేయం సమస్యగా అర్థం చేసుకోవాలి. ఆల్కహాల్ మితిమీరి తాగడం వల్ల కాలేయం ఉబ్బిపోతుంది.
జాన్ హాప్కిన్స్ మెడిసిన్ చెప్పిన ప్రకారం కాలేయ సిర్రోసిస్ సమస్య ఉన్నవారిలో తరచుగా మూత్రపిండాల సమస్యల బారిన పడతారు. పేగుల్లో రక్తస్రావం, బొడ్డులో ద్రవం కారడం,ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ కారణంగా కాలేయ వ్యాధుల బారిన పడిన వారిలో దాదాపు 30 శాతం మందికి హెపటైటిస్ సి వైరస్ ఉండే అవకాశం ఉంది. మరికొందరికి హెపటైటిస్ బి వైరస్ కూడా ఉండు ఛాన్స్ ఉంది. అలాగే వారిలో యాభై శాతం మందికి పిత్తాశయంలో రాళ్లు కూడా ఏర్పడవచ్చు. కాళ్లు, చీల మండలలో వాపు రావడం, చర్మం దురదగా అనిపించడం, మూత్రం రంగు మారడం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని సూచిస్తాయి.
Also read: ఈ చిట్కాలు పాటిస్తే గురక తగ్గే అవకాశం