ప్రజల్లో పెరిగిపోతున్న అయోడిన్ లోపం, ఉప్పు కాకుండా అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే
అయోడిన్ లోపం ప్రపంచంలో ఎంతో మందిని వేధిస్తోంది.
పోషకాహార లోపం అనగానే అందరూ ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తినడానికే చూస్తారు. పోషకాహార లోపం అంటే అందులో అయోడిన్ లోపం కూడా ఉంది. అయోడిన్ అనగానే అందరూ ఉప్పు తినాలని అనుకుంటారు. అదే పెద్ద తప్పు. అయోడైజ్డ్ ఉప్పు తెచ్చుకుని కూరల్లో ఎక్కువెక్కువ వేసుకుని తింటే అధిక రక్తపోటు రావచ్చు. ఉప్పులో అధికంగా ఉండేది సోడియం, దానికి అయోడిన్ కలిపి అమ్ముతారు. కాబట్టి అయోడిన్ కోసం ఉప్పు మీద ఆధారపడకండి. ప్రస్తుతం అయోడిన్ లోపం చాప కింద నీరులా పాకుతోంది. ప్రపంచంలో 35 శాతం మందికి అయోడిన్ లోపం ఉన్నట్టు చెబుతున్నాయి నివేదికలు.
అయోడిన్ ఎందుకు?.
అయోడిన్ అనేది ఒక ఖనిజం. మన శరీరానికి అత్యవసరమైనది. అయితే మన శరీరం దాన్ని స్వయంగా తయారుచేసుకోలేదు. సప్లిమెంట్లు, తినే ఆహారం ద్వారానే శరీరానికి చేరుతుంది. అయోడిన్ వల్లే ధైరాయిడ్ హార్లోన్లు అయిన T3, T4లు సక్రమంగా పనిచేస్తాయి. గర్భిణీ స్త్రీలు, శిశువులలో జీవక్రియ,ఎముకలు, మెదడు అభివృద్ధిని నియంత్రించే ఈ థైరాయిడ్ హార్మోన్లే. వీటి తయారీకి అయోడిన్ అవసరం. అయోడిన్ లోపం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి, కాలేయం, మెదడు పనితీరు, కండరాల పనితీరు నెమ్మదిస్తుంది.
ఏ ఆహారం తినాలి?
అయోడిన్ సముద్రపు ఆహారంలో పుష్కలంగా లభిస్తుంది. సముద్రంలోని సీవీడ్, రొయ్యలు, కొన్ని రకాల ఉప్పు చేపలు, అలాగే పాల ఉత్పత్తుల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. ఇక శాకాహారుల కోసం సప్లిమెంట్లు బయట లభిస్తున్నాయి. అయోడైజ్డ్ ఉప్పును అధికంగా తినే బదులు ఆహారం, సప్లిమెంట్లును తీసుకోవడం ఉత్తమం.
అయోడిన్ లోపం లక్షణాలు
అయోడిన్ లోపించిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
1. జుట్టు రాలిపోవడం
2. తీవ్రంగా అలిసిపోవడం
3. గర్భధారణలో సమస్యలు రావడం
4. బలహీనంగా అనిపించడం
5. చలి అధికంగా వేయడం
6. బరువు హఠాత్తుగా పెరగడం
7. మతిమరుపు రావడం
8. త్వరగా విషయాలు అర్థంకాకపోవడం
9. చర్మం పొడిబారడం
10. హృదయ స్పందన రేటు తగ్గడం
11. మెడ దగ్గర ఉబ్బడం
12. మహిళల్లో పీరియడ్స్ క్రమం తప్పడం
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే తప్పకుండా అయోడిన్ లోపమేమో చెక్ చేయించుకోవాలి. ఈ లక్షణాలలో చాలా వాటిని తేలికగా తీసుకుంటారు కొంతమంది. సమస్య పెరిగి థైరాయిడ్ గా మారాక రోజూ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడడం ఉత్తమం.
Also read: ఒక్క సిగరెట్ చాలు మహిళల్లో అలాంటి లక్షణాలు పెరగడానికి, జాగ్రత్తపడక తప్పదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.