Navy Day 2025 : ఇండియన్ నేవీ డే స్పెషల్.. NAVY అంటే తెలుసా? భారత నౌకాదళం ప్రధాన విధులు ఇవే
Indian Navy Day : భారత నౌకాదళం దినోత్సవం సందర్భంగా NAVY అంటే అర్థమేంటి? ఈ దళం నిర్వహించే ప్రధాన విధులు ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

Indian Navy Day 2025 : భారతదేశంపై సముద్రం నుంచి జరిగే ఎటువంటి దాడిని అయినా అడ్డుకునే బాధ్యతను భారత నౌకాదళం తీసుకుంటుంది. ఇండియాపై దాడి చేయడానికి ప్రయత్నించే ఇతర దేశాల నౌకలను, జలాంతర్గాములను భారత నౌకాదళం ఎన్నోసార్లు తిప్పికొట్టింది. అలాంటివాటిలో 1971లో చేసిన యుద్ధమే ఓ గ్రేట్ ఎగ్జాంపుల్. పాకిస్తాన్తో చేసిన ఆ యుద్ధానికి గుర్తుగానే ఇండియాలో ఇండియన్ నేవీ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా.. నేవీ అర్థం ఏమిటి? విధులు, దేశానికి ఈ దళం అందిస్తోన్న సేవలు ఏంటో చూసేద్దాం.
నేవీ అర్థం..
భారత నావికాదళం సముద్ర సరిహద్దుల ద్వారా దేశాన్ని రక్షిస్తుంది. నేవీ ఏ దేశానికైనా చాలా ముఖ్యమైన దళం. రాజుల కాలం నుంచి నేవీని అత్యుత్తమ దళంగా పరిగణిస్తారు. భారత నావికాదళం గురించి మాట్లాడితే.. ఇది ప్రపంచంలోని టాప్ ఫోర్స్‌లలో ఒకటిగా నిలిచింది. సముద్ర మార్గం ద్వారా ఎవరూ భారతదేశం వైపు కన్నెత్తి చూడలేరని భారత నావికాదళం చాలాసార్లు నిరూపించింది. ఈ అద్భుతమైన, ధైర్యవంతులైన NAVY దళం పూర్తి రూపం గురించి ఎక్కువమందికి తెలియదు. NAVY పూర్తి అర్థం Nautical Army of Volunteer Yeomen. అంటే NAVY లోని ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. కానీ అంతా కలిపి ఒకే పదంగా పిలుస్తాము.
భారత నావికాదళం భారతదేశ సాయుధ దళాలలో కీలకమైన భాగం. ఇది భారతదేశ సముద్ర సరిహద్దులను రక్షించడంలో మరియు భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ నేవీ డే సందర్భంగా.. ఇండియన్ నేవీ ప్రతి సంవత్సరం ఓ థీమ్ ఫాలో అవుతుంది. మన దేశ రక్షణ పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్పెషల్ డే రోజున వివిధ భారత నావికాదళ స్థావరాలు, నౌకలలో వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భారత నావికాదళ సిబ్బందిని సత్కరిస్తారు.
నౌకాదళ ప్రధాన విధులు
- భారతదేశ సముద్ర సరిహద్దులను రక్షించడం.
- భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం.
- విపత్తు సహాయ, రక్షణ కార్యకలాపాలలో పాల్గొనడం.
- అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం
నేవీ డే ప్రాముఖ్యత
ఈ రోజు దేశానికి సేవ చేసిన లేదా సేవ చేస్తున్న ధైర్యవంతులైన నావికులను స్మరించుకోవడానికి అంకితం చేశారు. ఇది మన దేశాన్ని రక్షించిన వీరులను గుర్తుచేసుకునే సందర్భం కూడా. సెలబ్రేషన్స్లో భాగంగా భారత నావికాదళం అద్భుతమైన నావికా కవాతును నిర్వహిస్తుంది. అప్ డేట్ అయిన నావికా సాంకేతికతను ప్రదర్శిస్తుంది. ఇది సముద్ర భద్రత, ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ప్రపంచంలోని టాప్ 10 నావికాదళాలలో భారత నావికాదళం ఏడవ స్థానంలో ఉంది. ఇది దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన నావికాదళంగా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రధాన భారత సాయుధ దళాలు
భారత సైన్యం (ఇండియన్ ఆర్మీ), వైమానిక దళం, నావికాదళం అనేవి భారత సాయుధ దళాలలో మూడు విభాగాలు. భారత సైన్యం భూ రక్షణను అందిస్తుంది. సముద్రం నుంచి వచ్చే దాడుల నుంచి నావికాదళం రక్షిస్తుంది. వైమానిక దళం వైమానిక దాడుల నుంచి దేశాన్ని రక్షిస్తుంది. ప్రతి దళం ప్రత్యేకమైన ప్రాముఖ్యతలు కలిగి ఉన్నా.. అన్ని చేసిది దేశ రక్షణే.






















