Golden Honey: ‘గోల్డెన్ హనీ’ రోజుకో స్పూను తాగితే ఆ సమస్యలన్నీ దూరం, దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
తేనె వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. గోల్డెన్ హనీతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
గోల్డెన్ హనీ రోజుకో స్పూను తాగమని సిఫారసు చేస్తారు ఆయుర్వేద వైద్యులు. అలా తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని చబుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగాక గోల్డెన్ హనీ తాగుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. గోల్డెన్ తేనెకు, సాధారణ తేనెకు మధ్య తేడా ఏంటని ఆలోచిస్తున్నారా? చాలా చిన్న తేడా.
గోల్డెన్ హనీ అంటే..
గోల్డెన్ హనీ అంటే సాధారణ తేనెలో పసుపు కలపడమే. అప్పుడు దాని రంగు బంగారు వర్ణంలోకి మారిపోతుంది. అందుకే దీన్ని గోల్డెన్ హనీ అని పిలుస్తున్నారు. దీన్ని తాగితే శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు అందడంతో పాటూ రక్షణ దక్కుతుంది.
జీర్ణక్రియకు
జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు గోల్డెన్ హనీని రోజుకో స్పూను తాగాలి. గోరు వెచ్చని నీళ్లలో ఈ తేనెను కలుపుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, ఉబ్బరం, పొట్టనొప్పి వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మిశ్రమాన్ని ఖాళీ పొట్టతో తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు
ఈ తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. శరీరంలో తీవ్రమైన నొప్పి, ఇతర రకాల వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక చెంచా గోల్డెన్ హనీ తీసుకుంటే శరీరం నొప్పులను తట్టుకునే శక్తిని పొందుతుంది.
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
గోల్డెన్ హనీలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ తేనె శరీరంలో చేరే హానికర బ్యాక్టరియాలు, వైరస్‌లను చంపుతుంది. చికాకును తగ్గిస్తుంది, జలుబు, దగ్గు వంటి వాటిని త్వరగా తగ్గేలా చేస్తుంది.
గోల్డెన్ తేనె లేదా సాధారణ తేనె... ఏది మంచిది?
అధ్యయనాల ప్రకారం రెండూ మంచివే. సాధారణ తేనెను రోజూ ఒక స్పూను తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అలాగే గోల్డెన్ హనీని తినడం వల్ల కాస్త ఎక్కువ మేలు జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే పసుపులో కూడా ఎన్నో సుగుణాలు ఉంటాయి. అవి తేనెకు జోడవుతాయి.టీ, కాఫీలలో చక్కెరకు బదులు తేనెను వేసుకుని తాగడం ప్రారంభించండి. ప్రత్యేకంగా తేనే తాగాల్సిన అవసరం రాదు. చక్కెరను కూడా ఈ విధంగా దూరం పెట్టినట్టు అవుతుంది. కాబట్టి అదనపు ప్రయోజనాలు కావాలంటే సాధారణ తేనె కన్నా గోల్డన్ తేనె తాగడం ఉత్తమం.
Also read: ఎర్ర కందిపప్పుతో టేస్టీ గారెలు, ఒక్కసారి తిని చూడండి
Also read: ఏటా పది లక్షల మరణాలకు కారణం అవుతోన్న దోమ, ఇది ఎన్ని రోగాలను వ్యాపింపజేస్తుందో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.