(Source: ECI/ABP News/ABP Majha)
World Mosquito Day: ఏటా పది లక్షల మరణాలకు కారణం అవుతోన్న దోమ, ఇది ఎన్ని రోగాలను వ్యాపింపజేస్తుందో తెలుసా?
కాలం ఆధునికంగా మారుతున్నకొద్దీ వ్యాపించే రోగాల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువ మందిని చంపేస్తున్నవి దోమలే. కేవలం ఆ చిన్ని ప్రాణులు చెట్టంత మనుషులను కుదేలు చేసి ప్రాణం పోయేలా చేస్తున్నాయి. ఏటా పదిలక్షలకు పైగా ప్రాణాలు పోవడానికి కారణం దోమలే. ఇవే లేకుంటే ప్రపంచంలో సగం రోగాలు ఉండవట. ఎందుకంటే వాటిని వ్యాపింప చేసేది దోమలే కదా. ముందు తమలోకి ఆ వైరస్ ను చేర్చుకుంటాయి. వాటిని మోసుకుంటూ తిరుగుతాయి. మనిషి కుట్టినప్పుడు రక్తంలోకి ఆ వైరస్ చేరుతుంది. ఇంకేముంది ఆ రోగం మనిషికి అంటుకుంటుంది. ఇలా ఏటా 70 కోట్ల మందికి రోగాలను అంటిస్తున్నాయి దోమలు. వారిలో పరిస్థితి చేయిదాటిపోయి పదిలక్షల మందిపైనే మరణిస్తున్నారు.
ఎన్ని రోగాలో...
దోమలు దాదాపు పదిహేనుకి పైగా రోగాలను వ్యాపింప చేస్తాయి. వాటిల్లో ప్రమాదకరమైనవి డెంగ్యూ, జికా వైరస్, ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా, బోదకాలు, మలేరియా, వెస్ట్ నైల్ ఫీవర్ మొదలగునవి. ఇవన్నీ కూడా దోమలు వల్ల మాత్రమే వ్యాప్తి చెందుతాయి. వీటి వల్లే ఎంతోమంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
కుట్టకుండా బతకగలవు...
దోమలకు మనుషుల రక్తమే ఆహారం కాదు. అవి ఎవరినీ కుట్టకుండా బతకగలవు. కానీ మన శరీరం నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ వాటిని ఆకర్షిస్తుంది. అందులోనూ ఆడదోమలు పిల్లల్ని కనాలంటే మన రక్తం అవసరం. రక్తంలోని ఎమైలో ఆమ్లాలు ఉంటేనే ఆ దోమ గుడ్లు పరిపక్వం అవుతాయి. అందుకు మన రక్తం తాగాకే 40 దాకా గుడ్లను ఏ మురికి నీటిలోనే పెడుతుంది. అందుకే మనుషులను కుట్టేది ఆడదోమలే. అందులోనూ రోగాలను మోసుకు తిరిగేవి కూడా అవే. అందుకే ఇంతలా రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. అవి ఒక్కసారి మగ దోమ నుంచి శుక్ర కణాలను స్వీకరించాయంటే దానితోనే దాదాపు 15 సార్లు గుడ్లు పెట్టగలదు. ఒక్కో దోమ 30 రోజులు బతుకుతుంది.
ఈ మొక్కలంటే పడదు
బంతిపూల మొక్కలంటే దోమలకు పడవు. బంతి పూల మొక్కలు ఇంటి ముందు వేసుకుంటే దోమలు రావు. తులసి మొక్కల్ని కూడా అధికంగా పెంచితే దోమల బాధ పోతుంది. రోజ్ మేరీ మొక్కలు కూడా కొన్ని ఇండి గుమ్మం ముందు పెడితే దోమలు ఎంట్రీ ఇవ్వకుండా ఉంటాయి. వెల్లుల్లి వాసన కూడా దోమలకు నచ్చదు. సాంబ్రాణి పొగ వేసి నాలుగు వెల్లుల్లి ముక్కలు దంచి వేస్తే ఆ వాసనకు ఇంట్లోని దోమలు బయటికి పోతాయి.
చెమట అధికంగా పట్టకుండా చూసుకోవాలి. చెమట అధికంగా వచ్చేవారిని కూడా దోమలు అధికంగా కుడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే O బ్లడ్ గ్రూప్ వారిని అధికంగా కుడతాయని చెబుతున్నాయి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు బెడద తగ్గుతుంది. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి . నీరు ఉన్న చోటే దోమలు నివాసం ఉంటాయి.
Also read: మనం తినే ఆహారాల్లో ఉండే ఆరు విష సమ్మేళనాలు ఇవే, వీటిని ఎక్కువ తింటే అంతే సంగతులు
Also read: ఇలాంటి చెట్ల కిందకు వెళ్తే ప్రమాదాన్ని పాకెట్లో పెట్టుకున్నట్టే!