Relationships: ఆమె వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి?
తన భర్త స్నేహితురాలి కారణంగా తమ వైవాహిక జీవితం దెబ్బతింటుందని చెబుతున్నా ఒక భార్య జీవితం ఇది.
ప్రశ్న: మా ఇద్దరికీ పెళ్లయి ఆరేళ్లు దాటింది. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ ఒక మహిళ కారణంగా మేము తరచూ గొడవ పడుతున్నాము. ఆమె నా భర్త స్నేహితురాలు. వారిద్దరూ తమ మొదటి ఉద్యోగాన్ని కలిసి పనిచేశారు. అప్పటినుంచి వారి స్నేహం కొనసాగుతోంది. వారి సాన్నిహిత్యం నాకు ఏమాత్రం నచ్చడం లేదు . ఇదే విషయం నా భర్తతో మాట్లాడితే తాము చాలా కాలం నుంచి మంచి స్నేహితులమని, అంతకుమించి ఏం లేదని, అనుమానం పడొద్దని చెబుతున్నారు. కానీ వాళ్ళిద్దరి స్నేహం నాకు మింగుడు పడడం లేదు. ఆమె ఒక్క కాల్ చేసినా చాలు ఏ సమయంలోనైనా నా భర్త ఆమెను కలవడానికి వారి ఇంటికే వెళ్తాడు. ఆమెకు కూడా పెళ్లయింది. ఆ మహిళ భర్త వీరిద్దరినీ చూసి ఏమనుకుంటున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయనతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మా వైవాహిక జీవితంలో ఆమె భాగం కావడం నాకు ఇష్టం లేదు. ఆమెను నా భర్త జీవితం నుంచి దూరం పెట్టడం ఎలా? నాకు కూడా స్నేహితులు ఉన్నారు, కానీ ఇంతలా జీవితంలో భాగమై పోయిన స్నేహితులు మాత్రం లేరు. మా వైవాహిక బంధం కంటే ఆమెకే ఎక్కువ విలువ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇది నా అపోహ లేక నిజమా అర్థం కావడం లేదు. ఏం చేయాలో మీరే చెప్పండి.
జవాబు: పెళ్లి రెండు విభిన్న నేపథ్యాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న గతాలు కలిగిన ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేస్తుంది. ఆ పెళ్లిని నిలుపుకునే బాధ్యత భార్యాభర్తలదే. ఒకరిపై ఒకరు నమ్మకం, ఒకరి గురించి ఒకరు అవగాహన పెంచుకోవడం ద్వారా తమ కుటుంబాన్ని కాపాడుకుంటూ రావాలి. కొన్నిసార్లు చిన్న చిన్నవిభేదాలు రావడం సహజం. చిన్న గాయాలు మానిపోయినట్టే ఆ విభేదాలు కూడా పోతాయి. అయితే మీరు చెప్పిన ప్రకారం చూస్తే సమస్య మీలోనే ఉందేమో అనిపిస్తుంది. అది నిజమైన స్నేహమే అని అనుకోవచ్చు కదా, ఆమె మహిళ కాబట్టి మీరు ఇంతగా అనుమానిస్తున్నారు. అదే పురుషుడై ఉంటే పెద్దగా పట్టించుకోకపోయేవారు. అంటే ఇక్కడ కూడా లింగ వివక్ష కనిపిస్తుంది. మీకు అత్యంత ఆప్తులైన స్నేహితులు లేని కారణంగా మీ భర్తకు కూడా ఉండకూడదనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఆమెకు కూడా పెళ్లయిందని చెబుతున్నారు. మీ భర్త ఏ సమయంలో వారి ఇంటికి వెళ్లినా కూడా ఆమె భర్త అనుమతిస్తున్నాడంటే, వారిద్దరి స్నేహాన్ని అతను నమ్ముతున్నాడు. పెళ్లికి ముందు నుంచే వారిద్దరికీ పరిచయం ఉంది. నిజంగా వారి మధ్య ఇతరత్రా ఆలోచనలు ఉండి ఉంటే మీ భర్త మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవసరం ఉండదు. ఆ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్,టి ఇంట్లో వారిని ఎదిరించైనా పెళ్లి చేసుకునేవారు. కానీ వారికి అలాంటి ఆలోచనలు లేవని అర్థమవుతుంది. చిన్నప్పటినుంచి కొనసాగే స్నేహం పెద్దయ్యాక కూడా ఆత్మీయమైన బంధంగా మారుతుంది. ఆ బంధంలో లోపాలను వెతకవద్దు. వారిద్దరితో మీరూ కలిసి పోవడానికి ప్రయత్నించండి. అప్పుడు వారిద్దరి స్నేహంలోని గాఢత మీకు అర్థమవుతుంది. ఆమె తన కుటుంబంతో సంతోషంగా ఉంది అంటే అర్థం మీ భర్తతో ఆమెది కేవలం ఆత్మీయమైన స్నేహమని అతను నమ్ముతున్నాడు.
ఈ విషయాన్ని మీరు నేరుగా మీ భర్తతో మాట్లాడండి. అది కూడా గొంతు పెంచి మాట్లాడకండి. గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఆమెతో ఉన్నది కేవలం స్నేహమేనని మీ భర్త చెబితే అది నమ్మండి. అయితే మీకు నచ్చని విషయం... ఆమె పిలిచిన ప్రతిసారి ఆమెను కలవడానికి మీ భర్త వెళ్లడం. ఆ విషయాన్ని ఆయనకి నేరుగా తెలపండి. అలా వెళ్లడం మీకు అసౌకర్యంగా ఉందని, అభద్రతా భావం పెరుగుతోందని చెప్పండి. అలాగే మీ భర్త మీ జీవితంలో ఎంత ముఖ్యమో కూడా వివరించండి. అతని స్నేహాన్ని మీరూ స్నేహంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.
ఆమెను చూడగానే మీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెబుతున్నారు, కానీ ఆమెకు మిమ్మల్ని చూడగానే అలాంటి వైబ్స్ ఏమీ రావడం లేదు. అంటే అర్థం మీలోనే సమస్య ఉన్నట్టు. కాబట్టి నెగిటివ్ వైబ్స్‌ని, పాజిటివ్ గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు అన్నీ సానుకూలంగానే కనిపిస్తాయి. అలాగే వారిద్దరి స్నేహం కూడా మీకు కేవలం స్నేహంగానే కనిపిస్తుంది. మీరు ఇలా వారి గురించి ఆలోచిస్తూ, వారు ఏదో తప్పు చేస్తున్నారని ఊహించుకోవడం వల్ల మీకు మనశ్శాంతి కరువవుతుంది. ఈ విషయంలో మరింత సహాయం కావాలనుకుంటే మానసిక వైద్యులను కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి.
Also read: రొమ్ము క్యాన్సర్ వస్తే కనిపించే సైలెంట్ లక్షణాలు ఇవే