Electric Shock: కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు, వెంటనే ఇలా చేయాలి
కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని కాపాడేందుకు మన వంతు ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే బాధితుడిని ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు.
అప్పటి వరకు రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి తోటి ఉద్యోగితో మాట్లాడుతున్న ఆ టికెట్ ఎగ్జామినర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే రైలు పట్టాల మీద పడిపోయాడు. అందుకు కారణం.. అక్కడే ఉన్న ఒక కరెంట్ వైరు. అది తెగి అతని తలపై పడటంతో విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా కాలిన గాయాలతో అతను హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరెంట్ షాక్ తగిలినప్పుడు ఏం చెయ్యాలనే విషయం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఎవరో ఒకరు హాస్పిటల్‌కు తీసుకెళ్ళే వరకు చికిత్స ఏమి ఉండదు. కానీ ఈలోపే ప్రమాదానికి గురైన బాధితుడు పరిస్థితి దిగజారవచ్చు. అందుకే కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా ప్రాథమిక చికిత్స చెయ్యాలని అనేది తెలుసుకోవాలి.
కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా స్పందించాలి?
మన శరీరాలు విద్యుత్ వాహకాలు. కరెంట్ పోల్ లేదా వైర్ పట్టుకున్నప్పుడు షాక్ కొడితే వాటి నుంచి బాధిత వ్యక్తిని విడిపించకుండా పట్టుకోకూడదు. అలా వ్యక్తిని పట్టుకుంటే అతని ద్వారా మరొకరిలోకి విద్యుత్ ప్రవహిస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ వల్ల తీవ్రమైన కాలిన గాయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి ప్రమాదం తీవ్రంగా ఉంటే ప్రాణాపాయం లేదా కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది.
ఎప్పుడు అత్యవసర చికిత్స చేయాలి?
⦿ కరెంట్ షాక్ వల్ల కాలిన గాయాలైనప్పుడు
⦿ ఊపిరి ఆడకపోవడం
⦿ హార్ట్ బీట్ లో తేడా
⦿ కార్డియాక్ అరెస్ట్ లేదా గుండె పోటు
⦿ మూర్చలు రావడం
⦿ స్పృహ కోల్పోవడం
షాక్ కొట్టినపుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్స
☀ తడి చేతులు, కాళ్లతో ఎప్పుడు విద్యుత్ మూలాన్ని తాకకూడదు. అలా చేస్తే మీరు కూడా విద్యుదాఘాతానికి గురవుతారు.
☀ విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అది సాధ్యం కాకపోతే చెక్క లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్ తో బాధిత వ్యక్తిని విద్యుత్ ప్రసరించే వస్తువు నుంచి దూరంగా వచ్చేలా కొట్టాలి.
☀ బాధిత వ్యక్తి శ్వాస తీసుకుంటున్నారా, వారి పల్స్ ఎలా ఉందనేది చెక్ చెయ్యాలి. షాక్ కు గురైన వ్యక్తిని ఎప్పుడు కదిలించకూడదు.
☀ షాక్ కొట్టిన వ్యక్తిని పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళని పైకి లేపి తలని కొద్దిగా కిందకి ఉంచాలి.
☀ కండరాల నొప్పి లేదా తిమ్మిరి, గుండె కొట్టుకునే విధానంలో మార్పు గమనిస్తే వెంటనే వైద్య అత్యవసర సేవలకి ఫోన్ చెయ్యాలి.
☀ బాధితుడు శ్వాస తీసుకోవడం, దగ్గు లేదా కదలిక లేకుండా ఉంటే వెంటనే సీపీఆర్ చెయ్యాలి.
☀ కాలిన ప్రదేశాల మీద శుభ్రమైన గుడ్డతో కప్పి ఉంచాలి. దుప్పటి లేదా టవల్ ఉపయోగించొద్దు. అవి వాటి దారాలు కాలిన గాయాలకి అంటుకుని ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనట్టే