Kunda Biryani: కుండ కొనండి, ఇంట్లోనే ఇలా కుండ బిర్యానీ చేయండి, ఇదిగో సింపుల్ రెసిపీ
కుండ బిర్యానీని చాలా మంది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు, కానీ దీన్ని వండడం చాలా సులువు.
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు చూడండి, కుండ బిర్యానీకి, మామూలు బిర్యానీకి ధరలో చాలా తేడా ఉంటుంది. కుండ బిర్యానీ ఎందుకు ఎక్కువ ధర ఉంటుందంటే, కుండలో వండే బిర్యానీకి పోషక విలువలు ఎక్కువ. అల్యూమినియం పాత్ర లేదా స్టీలు పాత్ర కన్నా మట్టి పాత్రలో వండే ఆహారంలో పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. అందులోనూ కుండల్లో వండడం ఎప్పుడో అంతరించిపోయింది. ఇప్పుడు మళ్లీ పాతరోజులు వస్తున్నాయి. కుండ బిర్యానీ కొనుక్కునే కన్నా సులువుగా మీరే ఇంట్లో వండుకోవచ్చు. ఒక్కసారి కుండ కొనుక్కుంటే చాలు, తినాలనిపించినప్పుడల్లా బిర్యానీ చేసుకోవచ్చు. ఆ రుచే వేరు.
కావాల్సిన పదార్థాలు
చికెన్ మారినేషన్ కోసం...
చికెన్ - అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు
పచ్చిమిర్చి - రెండు
ఉల్లిపాయ తరుగు - అరకప్పు
పెరుగు - అరకప్పు
కారం - రెండు టీ స్పూనులు
జీలకర్ర పొడి - పావు టీస్పూను
పసుపు - అర టీస్పూను
నిమ్మరసం - రెండు స్పూనుల
కొత్తిమీర తరుగు - పావు కప్పు
బిర్యానీ ఆకు - రెండు
గరం మసాలా - రెండు స్పూనులు
మిరియాల పొడి - అర స్పూను
నెయ్యి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వంటకు తగినంత
బిర్యానీ రైస్ వండేందుకు...
బాస్మతి బియ్యం – అరకిలో
ఉప్పు - రుచికి సరిపడా
లవంగాలు - ఆరు
దాల్చిన చెక్కలు - రెండు ముక్కలు
యాలకులు - అయిదు
కొత్తిమీర తరుగు - అరకప్పు
పుదీనా తరుగు - అరకప్పు
షాజీరా - ఒక స్పూను
అనాస పువ్వు - రెండు
జాజికాయ - చిన్న ముక్క
మరాఠీ మొగ్గ - రెండు
తయారీ ఇలా
1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగి ఓ అరగంట పాటూ నానబెట్టుకోవాలి.
2. చికెన్ ఓ గిన్నెలో వేసుకుని అందులో పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి మారినేషన్ చేయాలి. దాదాపు అరగంట పాటూ పక్కన వదిలేయాలి.
3. మరో పక్క బిర్యానీ రైస్ వండేందుకు రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి బాస్మతి రైస్ తప్ప మిగతా పదార్థాలన్నీ (బిర్యానీ రైస్ వండేందుకు పైన చెప్పిన పదార్థాలు) వేసి ఉడికించాలి.
4. నీళ్లు సలసల కాగుతున్నప్పుడు బాస్మతి బియ్యాన్ని వేయాలి. బియ్యం సగం ఉడికాక స్టవ్ కట్టేయాలి. నీళ్లు ఉండే వడకట్టేయాలి.
5. ఇప్పుడు కుండను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మారినేషన్ చేసిన చికెన్ ను వేయాలి.
6. చికెన్ దాదాపు 80 శాతం ఉడికేశాక, ముందుగా వండి పెట్టుకున్న బిర్యానీ రైస్ ను చికెన్ పై వేసుకోవాలి.
7. పైన కాస్త నెయ్యి వేసి, కొత్తిమీర చల్లి, వేయించిన ఉల్లిపాయలను (మీకు నచ్చితే వేసుకోవచ్చు) చల్లి మూత పెట్టేయాలి. గాలి పోకుండా పైన బరువు పెట్టాలి.
8. మంట మాత్రం చాలా చిన్నగా పెట్టుకోవాలి. అలా చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికిస్తే చాలు బిర్యానీ ఘుమఘుమలాడుతూ రెడీ అయిపోతుంది.
9. కుండలో వండిన ఫ్లేవర్ ముక్కు పుటాలను తాకుతుంటే నోరూరిపోతుంది.
Also read: తెలంగాణాలో జికా వైరస్, తేల్చిన ఆరోగ్య సంస్థ, ఇదెలా సోకుతుంది? లక్షణాలేంటి?
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? అందుకే ఇది తింటే అన్ని రోగాలు