Breakfast: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
ఇంతకుముందు బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశె, పూరీయే... కానీ ఇప్పుడు కొత్త కొత్త బ్రేక్‌ఫాస్ట్ లు చెలామణిలోకి వచ్చాయి. అందులో ఒకటి గ్రనోలా.
సూపర్ మార్కెట్లలో మీకు గ్రనోలా కనిపిస్తూనే ఉంటుంది. గ్రనోలా అంటే ఓట్స్, నట్స్, తేనె, కొన్ని ఎండు పండ్లు, అటుకులు, బ్రౌన్ షుగర్... వంటివన్నీ కలిపి చేస్తారు. ఈ మొత్తం మిక్సర్‌నే గ్రనోలా అని చెప్పి ప్యాకేజ్ట్ కంటైనర్లలో అమ్ముతారు. పాలల్లో లేదా పెరుగులో వీటిని వేసుకుని తినడమే. కావాలంటే అరటి పండు, స్ట్రాబెర్రీల ముక్కలు చల్లుకుని తింటారు. ఇది పాశ్చాత్య దేశాల్లో చాలా పాపులర్ బ్రేక్ ఫాస్ట్. ఇప్పుడు మనదగ్గర కూడా గ్రనోలా తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. దానికి కారణం దీనివల్ల బరువు తగ్గుతారనే అభిప్రాయం బాగా ప్రచారంలో ఉండడమే. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ వల్ల గుండెకు హానికలిగే అవకాశం ఉందని ఓ పరిశోధన తేల్చింది.
గ్రనోలాలో సంతృప్త కొవ్వులు, చక్కెర అధికంగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. సంతృప్త కొవ్వులు చెడుకొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ స్థాయులను పెంచుతాయని అంటున్నారు అధ్యయనకర్తలు. అందుకే గ్రనోలా స్థానంలో వేరే ఆరోగ్యకరమైన ఆహారాన్ని భర్తీ చేయాలని సిఫారసు చేస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే రక్తంలో కొవ్వు పేరుకుపోయి కొన్నాళ్లకు శరీరభాగాలకు రక్తప్రసరణకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. గ్రనోలాలో ఉండే హై కొలెస్ట్రాల్ లక్షణాలే దాన్ని చెడు బ్రేక్ ఫాస్ట్ జాబితాలోకి చేరుస్తున్నాయి.
అన్ని గ్రనోలాలు హానికరమేనా?
సూపర్ మార్కెట్లో గ్రనోలా కొంటున్నప్పుడే ఆ ప్యాకెట్ పై ఉన్న వివరాలను చదవండి. ట్రాన్స్ ఫ్యాట్ లేని గ్రనోలాలను ఎంచుకోండి. కృత్రిమ శుద్ధి చేసిన స్వీటెనర్లకు బదులు తేనెను కలుపుకోవడం కాస్త ఉత్తమం. తేనె కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?