International Womens Day 2023: ప్రతి భారతీయ మహిళా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కులు, చట్టాల జాబితా ఇదిగో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయ మహిళ తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.
భారత రాజ్యాంగం మహిళకు ఎన్నో హక్కులను కల్పించింది, కానీ వాటిపై అవగాహన ఉన్న వారి సంఖ్య చాలా తక్కువ. ప్రపంచ సాంకేతికత పరుగులు పెడుతున్నప్పటికీ... ఎంతో మంది మహిళలు రాజ్యాంగం తమకు ఏ హక్కులు ఇచ్చిందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో చోట్ల స్త్రీలు అసమానతను, వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం మహిళల కోసం ప్రత్యేకంగా చేసిన చట్టాలను, హక్కులను ఇక్కడ వివరిస్తున్నాము. తమ గౌరవానికి, జీవనానికి, మర్యాదకు భంగం కలిగినప్పుడు ప్రతి మహిళ ఈ హక్కులను వినియోగించుకొని తమను తాము రక్షించుకోవచ్చు.
ఉచిత న్యాయ సహాయం
పేద మహిళలకు ఇది వరం లాంటిది. డబ్బులు ఖర్చు పెట్టి న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద మహిళలు కోసం దీన్ని రూపొందించారు. నిరుపేదలు న్యాయ సేవలను అందుకోవడం కోసం తమ దగ్గరలోని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, వారు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించే లాయర్ ను నియమిస్తారు.అలాగే లైంగిక వేధింపులకు గురైన మహిళలకు ఉచిత న్యాయసేవా హక్కులను కూడా భారత రాజ్యాంగం కల్పించింది.
రాత్రిపూట అరెస్టు కాకుండా...
1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 46లోని సబ్ సెక్షన్ (4) ప్రకారం సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు ఒక మహిళను అరెస్టు చేయాలంటే పోలీసులు ముందుగా కోర్టు అనుమతిని తీసుకోవాలి. అలా ఎలాంటి అనుమతి లేకుండా మహిళలను రాత్రిపూట అరెస్టు చేసే అధికారం ఎవరికి ఉండదు.
మాతృత్వపు హక్కులు
ప్రసూతి ప్రయోజనా చట్టం ప్రకారం ప్రసవం తర్వాత ప్రతి మహిళకు ఆరు నెలల పూర్తి సెలవు కేటాయించారు. ఆ ఆరు నెలల్లో పూర్తి జీతాన్ని కూడా అందించేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రసూతి ప్రయోజన చట్టం అనేది ప్రసవానికి ముందు, తరువాత మహిళలు ఎలా ఉపాధి పొందుతున్నారు, అలాగే ప్రసూతి ప్రయోజనాలను ఎలా అందించాలి అనే అంశాలపై పనిచేసే ముఖ్యమైన చట్టం.
వివరాలు గోప్యంగా ఉండేలా...
అత్యాచారం, లైంగిక వేధింపులకు గురైన బాధితుల పేర్లు గాని, వారి గుర్తింపును గాని బయట పెట్టకూడదని చెబుతోంది రాజ్యాంగం. అలాగే అత్యాచారాలకు, వేధింపులకు గురైన మహిళల వాంగ్మూలాలను మహిళా పోలీస్ అధికారి లేదా కానిస్టేబుల్ ఎదుట మాత్రమే రికార్డు చేయాలని కూడా చట్టం చెబుతోంది. బాధితురాలి పేరు, గుర్తింపు, ఫోటోలను బయట ప్రపంచానికి విడుదల చేయకూడదని కూడా హెచ్చరిస్తోంది.
సమాన వేతనం
సమాన వేతన చట్టం కింద మహిళలకు జీతం విషయంలో లింగ వివక్ష చూపించకూడదని చట్టం నిర్దేశించింది. శ్రామిక మహిళలకు, పురుషులతో పోలిస్తే సమాన వేతనాన్ని తీసుకునే హక్కు ఉంది.
గృహహింస
భారత రాజ్యాంగంలోని సెక్షన్ 498 .. భర్త చేతిలో గృహ హింసకు గురైన భార్యా, తల్లి లేదా సోదరికి రక్షణ కల్పించే చట్టం. ఇంట్లో మహిళను ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, లైంగికంగా, మౌఖికంగా ఎలా వేధించినా దాన్ని నేరంగానే పరిగణిస్తారు. నిందితుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది. శిక్ష మూడు సంవత్సరాల వరకు ఉండొచ్చు. గృహహింస నుంచి స్త్రీని కాపాడేందుకే ప్రత్యేకంగా ఈ చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఇప్పుడు ఎక్కువ మంది స్త్రీలు వినియోగించుకుంటున్నారు.
పని ప్రదేశాల్లో...
వర్క్ ప్లేస్ లో మహిళల లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణిస్తుంది లైంగిక వేధింపుల చట్టం. పని ప్రదేశంలో వేధింపులకు గురయ్యే స్త్రీలు ఫిర్యాదు చేసే హక్కును కలిగి ఉన్నారు. ఈ చట్టం ప్రకారం ఆమె మూడు నెలల వ్యాధిలో అంతర్గత ఫిర్యాదుల కమిటీకి రాతపూర్వకంగా తన గోడును వెళ్ళబోసుకోవచ్చు.
Also read: మహిళలూ ప్రతిరోజూ మీరు ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన పోషకాలు ఇవే