Largest Egg: అయ్య బాబోయ్, ఎంత పెద్ద కోడి గుడ్డో! ఏకంగా రికార్డుల్లోకి ఎక్కింది!
మహారాష్ట్రలో ఓ కోడి పెట్టిన గుడ్డు అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే అత్యంత పెద్ద గుడ్డుగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
కోడి సాధారణంగా ఎంత బరువున్న గుడ్డు పెడుతుందంటే ఏం చెప్తాం? సుమారు 50 గ్రాములు ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దది అయితే 75 గ్రాములు ఉంటుంది. కానీ, మహారాష్ట్రలో ఓ కోడి పెట్టిన గుడ్డును చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ కోడిగుడ్డు ఏకంగా 210 గ్రామలు బరువున్నది. దేశంలోనే అత్యంత పెద్ద గుడ్డుగా రికార్డుల్లోకి ఎక్కింది.
అరుదైన గుడ్డుపెట్టిన హై-లైన్- డబ్ల్యూ-80 జాతి కోడి
మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో ఈ అశ్చర్యకర ఘటన జరిగింది. తల్సండే గ్రామంలోని పౌల్ట్రీ ఫారానికి చెందినది కోడి ఈ గుడ్డును పెట్టింది. హై-లైన్- డబ్ల్యూ-80 జాతికి చెందిన కోడి పెట్టిన ఈ గుడ్డు లోపల మూడు నుంచి నాలుగు సొనలు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 16 నాడు ఈ పౌల్ట్రీ ఫామ్ యజమాని దిలీప్ చవాన్ ఈ గుడ్డును గుర్తించాడు. గతంలో ఎన్నడూ లేనంత పెద్ద గుడ్డును చూసి అవాక్కయ్యాడు. చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో జనాలు భారీగా తరలివచ్చి ఈ గుడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు.
कोल्हापुरातील कोंबडीने दिले देशातील सर्वात मोठे अंडं..#कोंबडी #kolhapur pic.twitter.com/tk8k3x6w0M
— Nikita Jangale (@NikitaJangale2) October 18, 2022
210 గ్రాముల కోడిగుడ్డు
చవాన్ 4 దశాబ్దాలకు పైగా కోళ్ల పెంపకం వ్యాపారంలో కొనసాగుతున్నాడు. అయినా, తన కెరీర్‌లో ఇంత పెద్ద గుడ్డును ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. తాజాగా గుడ్డు బరువును కొలిచారు. తొలిసారి 200 గ్రాములు ఉండగా, మళ్లీ ఒకసారి జోకగా 210 గ్రాములుగా తేలింది. మూడు సార్లు కొలిచి చివరకు 210 గ్రాములుగా నిర్ధారణ చేశారు. ఈ సందర్భంగా ఫౌల్ట్రీ ఫామ్ యజమాని చవాన్ మాట్లాడుతూ “ఆదివారం రాత్రి నా పౌల్ట్రీలో ఈ పెద్ద గుడ్డును చూశాను. చాలా ఆశ్చర్యపోయాను. నేను గత 40 ఏళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నాను. ఇంత పెద్ద గుడ్డు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నేను ఈ గుడ్డును తూకం వేసి చూశాను. 210 గ్రాములుగా తేలింది” అని చెప్పాడు.
Read Also: అందాల పోటీల్లో గెలిస్తే ఎన్నారైతో పెళ్లంట - విషయం తెలిసి ఖాకీలే పెళ్లి చేశారు!
పంజాబ్ కోడి రికార్డు బ్రేక్
ప్రస్తుతం, మన దేశంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన అతిపెద్ద గుడ్డు రికార్డు పంజాబ్ లోని కోడిపై ఉంది. ఇది 10 సెంటీమీటర్ల పొడవుతో పాటు 5 సెంటీ మీటర్ల వ్యాసం కలిగిన 162 గ్రాముల బరువున్న గుడ్డును పెట్టింది. ప్రస్తుతం ఆ రికార్డును మహారాష్ట్ర కోడి బద్దలు కొట్టింది. అటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత బరువైన గుడ్డు 1956లో USAలో కోడి పెట్టింది. డబుల్ పచ్చసొన ఉన్న అతిపెద్ద గుడ్డు దాదాపు 454 గ్రాముల బరువుగా ఉంది.