Dark Chocolates: షాకింగ్, ఈ చాక్లెట్‌లో భారీ లోహాలు - అవి తింటే ప్రమాదకరమా?
డార్క్ చాక్లెట్ ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. కానీ దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?
డార్క్ చాక్లెట్ అందరికీ ఇష్టమైనవి. ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే తాజా నివేదిక కన్జ్యూమర్ రిపోర్ట్ ప్రకారం డార్క్ చాక్లెట్ లో సీసం, కాడ్మియం అనే రెండు లోహాలు ఉన్నట్టు తేలింది. ఇవి పిల్లలు, పెద్దల్లో అనేక ఆరోగ్య సమస్యలతో ముడి పడి ఉన్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు 28 డార్క్ చాక్లెట్ బార్ లని పరీక్షించారు. ప్రతి దానిలో కాడ్మియం, సీసం కనుగొన్నారు. అన్నీ రకాల బ్రాండ్ లో ఈ భారీ లోహాలు ఉన్నాయి. అయితే కొన్నింటిలో మాత్రం వీటి పరిమిత కాస్త మెరుగ్గా ఉన్నట్టు తెలిపారు.
సీసం సైడ్ ఎఫెక్ట్స్
హెర్షేస్, థియో, ట్రేడర్ జోస్ వంటి ఇతర బ్రాండ్‌లు తమ డార్క్ చాక్లెట్ ఉత్పత్తులలో సీసం, కాడ్మియం లేదా రెండింటికి సంబంధించిన స్థాయిలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. తరచుగా సీసం తీసుకోవడం వల్ల పెద్దవారిలో నాడీ వ్యవస్థ సమస్యలు, రక్తపోటు, రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం, మూత్రపిండాలు దెబ్బతినడం, పునరుత్పత్తి సమస్యలు ఏర్పడతాయి. ఇవి పిల్లలు, గర్భిణీలకి చాలా ప్రమాదరకమైనవి. ఇవి వాటిలో సమస్యల్ని మరింత ఎక్కువగా పెంచుతాయి.
కాడ్మియం సైడ్ ఎఫెక్ట్స్
కాడ్మియం ఎక్కువగా తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలకి దారి తీస్తుంది. కిడ్నీలకు కానీ కలిగిస్తుంది. ఇది పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కూడా కాడ్మియంని క్యాన్సర్ కారకంగా పేర్కొంది. డెలావేర్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు దీని గురించి మాట్లాడుతూ డార్క్ చాక్లెట్ లో ఈ లోహాలు ఉండటం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ రెండు భారీ లోహాలు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.
సీసం, కాడ్మియం నేలలో లభించే లోహాలు. ఇవి కాకో మొక్కల మూలాల నుంచి వస్తాయి. అన్నీ నేలలు, రాళ్ళలో కొంత కాడ్మియం ఉంటుంది. మైనింగ్, ఎరువులు, ఇతర పారిశ్రామిక అవసరాల ద్వారా అది విస్తృతంగా వ్యాపించింది. వాతావరణంలోకి విడుదలైన తర్వాత వర్షం ద్వారా మళ్ళీ భూమిలోకి చేరుతుంది. కాడ్మియం చాక్లెట్ లో మాత్రమే కాదు ఇతర ఆహారాల్లో కూడా కనిపిస్తుంది. సీ ఫుడ్, సముద్రపు పాచి, జంతు అవయవాలు, బియ్యం, బంగాళాదుంపలు, ధాన్యాలు వంటి మరికొన్ని ఆహారాల్లోను కనిపిస్తుంది. ఇది చాలా సులభంగా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది.
ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది?
డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమేనని అతిగా తీసుకుంటే సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఒక ఔన్స్ చాక్లెట్ తింటే ఎలాంటి హాని జరగదని కన్జ్యూమర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలా అని ప్రతిరోజూ ఔన్స్ తింటే మరింత ప్రమాదకరం. అప్పుడప్పుడు చాక్లెట్ తినడం ఉత్తమం. మొత్తం మీద ఔన్స్ తీసుకుంటే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ రోజుకో చిన్నముక్క తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!