Heart Health : ఈ జ్యూస్ రోజూ ఓ గ్లాసు తాగితే గుండె సమస్యలు దూరమవుతాయట.. తాజా అధ్యయనంలోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Healthy Heart : గుండె జబ్బులతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఓ గ్లాసు జ్యూస్ తాగితే ఈ సమస్యలు దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Healthy Food for Heart : ప్రతి సంవత్సరం ఇండియాలో లక్షలాది మంది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యకు జీవనశైలి ప్రధానకారణంగా చెప్తున్నారు నిపుణులు. సరైన జీవనశైలి లేకపోతే హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. జీవనశైలితోపాటు 'దానిమ్మ రసం'(Pomegranate Juice Benefits)ను డైట్లో చేర్చుకోమంటున్నారు. ఎందుకంటే ఓ నివేదిక ప్రకారం దానిమ్మ రసం గుండెను రక్షించడానికి సహజ ఔషధంగా పని చేస్తుందని చెప్తున్నారు. ప్రతిరోజూ దీనిని ఒక గ్లాసు తాగితే అది గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుందని తాజా అధ్యయనం కూడా తెలిపింది.
అధ్యయనంలో ఏమి తేలిందంటే..
క్లినికల్ ప్రచురణలోని ఓ నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతిరోజూ 1 సంవత్సరంపాటు దానిమ్మ రసం తాగితే.. ధమనులలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవట(Superfoods for heart). ఒకవేళ ధమనుల్లో ఇప్పటికే ఫలకం పేరుకుపోయినా.. అది కూడా దాదాపు 30% వరకు తగ్గుతుందని తేల్చింది ఈ అధ్యయనం.

సమస్యను ఎలా తొలగిస్తుందంటే..
అధ్యయనం ప్రకారం దానిమ్మ రసంలో అధిక-నాణ్యత కలిగిన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ప్యూనికలేజిన్, పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దానిమ్మ రసం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి.. బీపీని కంట్రోల్ (Natural ways to control BP) చేస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు దానిమ్మ రసం తాగితే మంచిదని చెప్తున్నారు నిపుణులు.
దానిమ్మ రసం తాగడం వల్ల శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్) కూడా తగ్గుతుందట. ఇది నాడీ, ధమనులలో వాపు, అడ్డంకులను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే దీనిలోని యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయట. బ్యాడ్ ఫ్యాట్ తగ్గితే గుండెకు మేలు జరుగుతుంది. గుండె సమస్యలతో ఇబ్బంది పడేవారు వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ప్రతిరోజూ దానిమ్మ రసం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.
దానిమ్మ రసంతో కలిగే ఇతర లాభాలు
దానిమ్మ రసంలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. దీనిని రెగ్యులర్‌గా తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు, కీళ్లకు కూడా మంచిది. దానిమ్మ రసం తాగడం వల్ల చర్మ నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
ఎవరు దూరంగా ఉండాలంటే..
దానిమ్మ ఆరోగ్యానికి మంచి ఫలితాలే ఇస్తుంది. అయినా సరే కొన్ని సందర్భాల్లో కొందరు దానికి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఒక వ్యక్తి ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్నా లేదా చికిత్స చేయించుకుంటున్నా దానిమ్మ తినకపోవడమే మంచిదట. అలాగే లో బీపీతో ఇబ్బంది పడేవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. కిడ్నీ లేదా లివర్ వ్యాధి ఉన్న రోగులు కూడా వైద్యుల సలహా తీసుకుని దానిమ్మను డైట్లో చేర్చుకుంటే మంచిది.
దానిమ్మను కేవలం రసం రూపంలోనే కాదు.. నేరుగా కూడా తీసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎవరైనా రోజూ తీసుకోవాలని అనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకుని ప్రారంభించండి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.






















