November 2025 Car Sales: గత నెలలో జనం ఎక్కువగా కొన్న కార్లు - మారుతి ఫస్ట్, రెండు-మూడు స్థానాల్లో మహీంద్రా-టాటా
November 2025 Car Sales: ఫెస్టివ్ సీజన్ తర్వాత సేల్స్ తగ్గినా, నవంబర్ 2025లో అన్ని కారు కంపెనీలు YoY గ్రోత్ నమోదు చేశాయి. మహీంద్రా తిరిగి రెండో స్థానానికి చేరగా, టాటా మూడో స్థానానికి జారింది.

Car Sales November 2025 India: ఫెస్టివ్ సీజన్ ముగిసిన తరువాత భారత కార్ల మార్కెట్‌లో సహజంగానే డిమాండ్ కొద్దిగా తగ్గింది. దీంతో, అన్ని కార్ తయారీ కంపెనీలు, అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్ 2025లో మంత్లీ సేల్స్ (MoM) లో తగ్గుదల నమోదు చేశాయి. అయినప్పటికీ, ఏడాది ప్రాతిపదికన (YoY) చూస్తే ప్రతీ కంపెనీ కూడా వృద్ధి నమోదు చేయడం విశేషం.
ఎప్పటిలాగే, నవంబర్‌లో కూడా మారుతి సుజుకి టాప్ పొజిషన్ దక్కించుకుని ముందంజలో నిలిచింది. టాటా మోటార్స్‌ను అధిగమిస్తూ మహీంద్రా మళ్లీ రెండో స్థానాన్ని ఆక్రమించడం కీలక హైలైట్‌గా నిలిచింది.
మారుతి సుజుకి – నిరంతరం మొదటి స్థానంలోనే
నవంబర్ 2025లో 1,55,317 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకి లీడర్‌గా కొనసాగింది. ఇది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే (YoY) 19% గ్రోత్. అయితే అక్టోబర్‌తో పోలిస్తే సేల్స్ 35% తగ్గాయి. అయినా మారుతి అక్టోబర్‌లో నమోదు చేసిన ఆల్ టైమ్ హై సేల్స్ దృష్ట్యా, ఈ తగ్గుదల సహజమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
మహీంద్రా – తిరిగి రెండో స్థానానికి రీఎంట్రీ
నవంబర్ 2025లో 54,005 యూనిట్లు అమ్మిన మహీంద్రా, టాటా కంటే కాస్త ఎక్కువ సేల్స్ నమోదు చేసి మళ్లీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. YoY గ్రోత్ 20%గా ఉండగా, నెలవారీ (MoM) తగ్గుదల 24%. స్కార్పియో, థార్ రాక్స్, థార్ 3-డోర్ మోడళ్ల డిమాండ్ మహీంద్రాకు ఈ నెల బలాన్నిచ్చాయి.
టాటా మోటార్స్ – మూడో స్థానంలోకి జారినా 50k పైగా సేల్స్
టాటా మోటార్స్ 51,672 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఏళ్ల తరబడి నెలకు 50 వేల యూనిట్లను నమోదు చేయడం టాటాకు పాజిటివ్‌గా మారింది. YoY గ్రోత్ 22%గా ఉంది.
హ్యుందాయ్ – నాలుగో స్థానంలో స్టేబుల్ పెర్ఫార్మెన్స్
హ్యుందాయ్ 49,295 యూనిట్ల సేల్స్‌తో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. YoY గ్రోత్ 9%. క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్, ఆరా మోడళ్లు ప్రధాన బలం.
టయోటా – డబుల్ డిజిట్ గ్రోత్
టయోటా గత నెలలో 27,660 యూనిట్ల అమ్మకాలు సాధించింది. YoYలో 27% వృద్ధి నమోదు కాగా, MoM మాత్రం 25% తగ్గింది. నవంబర్ అమ్మకాల్లో ఇన్నోవా హైక్రాస్, క్రిస్టా, హైరైడర్ మోడళ్లు కీలక పాత్ర పోషించాయి.
కియా – మళ్లీ 20k మార్క్ దాటింది
కియా 23,675 యూనిట్లు అమ్ముతూ YoY 24% పెరుగుదల నమోదు చేసింది. సోనెట్, క్యారెన్స్, సెల్టోస్ ప్రధాన సేల్స్ డ్రైవర్లు.
స్కోడా – ఈ నెలలో అత్యధిక YoY గ్రోత్
స్కోడా 5,941 యూనిట్లతో 90% వృద్ధి నమోదు చేసింది. కొత్త ఆక్టావియా RS, కుషాక్, స్లావియా, కొడియాక్ మోడళ్లు ఈ కంపెనీకి బలం.
MG, హోండా, రెనో – స్థిరమైన వృద్ధి
నవంబర్ నెలలో.. MG 5,754 యూనిట్లు, హోండా 5,204 యూనిట్లు, రెనో 3,662 యూనిట్లు అమ్మి మంచి పెర్ఫార్మెన్స్ చూపించాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















