Dementia Risk Factors : వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
Cognitive Decline : వయసు పెరిగితే జ్ఞాపకశక్తి తగ్గుతుంది అనుకుంటాము కానీ.. వినికిడి లోపం, నిద్ర సరిపోకపోయినా కూడా మెమోరీ పవర్ తగ్గుతుందని చెప్తోన్నాయి అధ్యయనాలు. ఏ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదంటే..

- మెదడు ఆరోగ్యంపై వినికిడి లోపం, నిద్ర సమస్యలు, ఒంటరితనం ప్రభావం.
- వినికిడి లోపం మెదడు శ్రమను పెంచి, సామాజిక సంబంధాలను తగ్గిస్తుంది.
- నిద్రలేమి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను దెబ్బతీసి, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది.
- ఒంటరితనం మెదడుకు మానసిక ఉద్దీపన తగ్గించి, కాగ్నిటివ్ క్షీణతకు దారి.
Poor Sleep and Hearing Loss Affect Brain Health : వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంలో మార్పులు వస్తాయి. అయితే వయసు, జన్యుపరమైన కారణాలతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా వినికిడి లోపం, నిద్ర సమస్యలు, ఎక్కువ కాలం ఒంటరిగా ఉండటం వంటి అంశాలు కాగ్నిటివ్ డిక్లైన్‌తో సంబంధం ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇవి ఉంటే డిమెన్షియా కచ్చితంగా వస్తుందని అర్థం కాదు. కానీ సమస్యను తొందరగా గుర్తిస్తే వయసు పెరిగే కొద్దీ ఇబ్బందులు తగ్గించుకోవచ్చని డాక్టర్ KVSSRK శాస్త్రి చెప్తున్నారు. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఎండోస్కోపిక్ ENT సర్జన్‌గా చేస్తోన్న డాక్టర్ KVSSRK శాస్త్రి ఈ అంశాలపై పలు ముఖ్యమైన విషయాలు వివరించారు. కొన్ని లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదని కూడా తెలిపారు. అవేంటో చూసేద్దాం.
Also Redad : అల్జీమర్స్ పేషెంట్లను చూసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. డాక్టర్ సూచనలు ఇవే
వినికిడి లోపం ఉంటే..
చెవులు సరిగ్గా వినిపించకపోతే ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడానికి మెదడు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా చుట్టూ ఎక్కువ శబ్దం ఉన్నప్పుడు సంభాషణను అర్థం చేసుకోవడం మరింత కష్టమవుతుంది. వినికిడి సమస్యల కారణంగా కొందరు ఇతరులతో మాట్లాడటం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా తగ్గించేస్తారు.
వినికిడి తగ్గినప్పుడు సమస్య కేవలం చెవులకు మాత్రమే పరిమితం కాదు. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పేది అర్థం చేసుకోవడానికి ఎక్కువ మానసిక శ్రమ అవసరం కావచ్చు. వినికిడి సమస్య కారణంగా సామాజిక సంబంధాలు కూడా తగ్గితే, మెదడుకు లభించే మానసిక ఉద్దీపన తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే వినికిడి తగ్గుతున్నట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా హియరింగ్ చెకప్ చేయించుకోవడం మంచిది.
Also Read : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి..
* ఎదుటివారు చెప్పిన మాటలను తరచూ మళ్లీ చెప్పమని అడుగుతుంటుంటే..
* టీవీ, మొబైల్ లేదా ఇతర పరికరాల వాల్యూమ్‌ను మునుపటి కంటే ఎక్కువగా పెట్టుకుంటున్నప్పుడు..
* రద్దీగా లేదా శబ్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాటాలు అర్థం చేసుకోవడం కష్టంగా మారినప్పుడు..
* వినికిడి సమస్య కారణంగా ఫంక్షన్లు, సమావేశాలు లేదా ఇతర సామాజిక కార్యక్రమాలకు వెళ్లడం తగ్గించేసినప్పుడు..
వినికిడి లోపం ఉందా లేదా తెలుసుకోవడానికి హియరింగ్ అసెస్‌మెంట్ చేయించుకోవచ్చు. అవసరాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్స లేదా వినికిడి సహాయక పరికరాలను సూచించవచ్చు.
Also Read : తరచూ విషయాలు మర్చిపోతున్నారా? మతిమరుపు ఎక్కువైతే ఈ ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేయండి
నిద్ర సరిగ్గా లేకపోయినా..
నిద్ర శరీరానికి విశ్రాంతి ఇవ్వడంతో పాటు మెదడు పనితీరులో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం వంటి ప్రక్రియలకు నాణ్యమైన నిద్ర అవసరం. తరచూ నిద్ర పట్టకపోవడం, మధ్యలో పదేపదే మెలకువ రావడం లేదా స్లీప్ అప్నియా వంటి సమస్యలు ఉంటే కాగ్నిటివ్ పనితీరుపై ప్రభావం ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
నిద్ర సరిగా లేకపోవడం వల్ల మరుసటి రోజు అలసట మాత్రమే కాదు.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యంపై కూడా ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా నిద్ర సమస్య చాలా కాలంగా కొనసాగుతుంటే దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి.
Also Read : మతిమరుపు ఎక్కువైందా? తరచూ మరచిపోవడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఈ లక్షణాలు లైట్ తీసుకోకండి..
* చాలా రోజులుగా నిద్ర పట్టకపోవడం లేదా రాత్రంతా తరచూ మెలకువ రావడం.
* బాగా గురక పెట్టడం.
* నిద్రలో శ్వాస ఆగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించడం.
* పగటిపూట విపరీతంగా నిద్ర రావడం.
* నిద్ర సరిగా లేకపోయిన తర్వాత ఏకాగ్రత లేదా జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనిపించడం.
గురకతో పాటు నిద్రలో శ్వాస ఆగడం, పగటిపూట ఎక్కువ నిద్ర వంటి లక్షణాలు ఉంటే స్లీప్ అప్నియా వంటి సమస్యలను వైద్యులు సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే
ఎక్కువ కాలం ఒంటరిగా ఉంటే..
మనుషులతో మాట్లాడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, స్నేహితులను కలవడం వంటివి మనసుకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మెదడుకు కూడా మానసికంగా రిలాక్సేషన్ అందిస్తాయి. అయితే ఎక్కువ కాలం సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం, ఒంటరితనం వంటివి కాగ్నిటివ్ ఆరోగ్యం క్షీణించడంతో సంబంధం కలిగి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
సామాజికంగా యాక్టివ్‌గా ఉండటం వల్ల మనం తరచూ మాట్లాడటం, వినడం, ఆలోచించడం, విషయాలను గుర్తు చేసుకోవడం వంటి మానసిక కార్యకలాపాల్లో పాల్గొంటాం. అందుకే వయసు పెరిగిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలను కొనసాగించడం, సాధ్యమైనంత వరకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఉపయోగకరంగా ఉంటుంది.
చివరిగా..
వినికిడి తగ్గుతున్నట్లు అనిపిస్తే హియరింగ్ చెకప్ చేయించుకోవాలి. నిద్ర సమస్యలు తరచూ వస్తుంటే వాటికి కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. అలాగే వయసు పెరిగిన కొద్దీ పూర్తిగా ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. అయితే ఇవి కేవలం కాగ్నిటివ్ డిక్లైన్‌తో సంబంధం మాత్రమే కలిగి ఉన్నాయి. ఇవి ఉంటే కచ్చితంగా డిమెన్షియా వస్తుంది అనుకోకూడదు.
Also Read : చనిపోయాక గుండె ఆగిపోయినా కూడా బ్రెయిన్ పని చేస్తుందా? కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























