Breakfasts to Lose Weight : బరువు తగ్గడానికి మంచి బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఇవే.. 300 కేలరీల లోపు టిఫెన్లు
Breakfast Foods for Weight Loss : బరువు తగ్గాలనుకుంటే తక్కువ కేలరీలతో రోజంతా యాక్టివ్‌గా ఉంటూ.. హెల్తీగా బరువు తగ్గడానికి హెల్ప్ చేసే బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఇవే.

Low-Calorie Breakfasts for Weight Control : భారతదేశంలో ఊబకాయం రేటు పెరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఆహారమనే చెప్పవచ్చు. ఎందుకంటే బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల హెల్తీ ఫుడ్ తీసుకోవడమే కష్టంగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో రోజంతా మేము డైట్ బ్యాలెన్స్ చేయలేము అనుకుంటే.. మీ బ్రేక్‌ఫాస్ట్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఈ చిన్ని, స్థిరమైన అలవాటు బరువును అదుపులో ఉంచడంలో మంచి పాత్ర పోషిస్తుంది. ఫైబర్, ప్రోటీన్, మంచి కార్బోహైడ్రేట్లతో 300 కేలరీల లోపు బ్రేక్‌ఫాస్ట్ రోజంతా యాక్టివ్‌గా ఉండడంతో పాటు.. బరువును తగ్గించడంలో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ ప్రాసెస్ కోసం ఎలాంటి టిఫిన్స్ బెస్టో ఇప్పుడు చూసేద్దాం.
పోహా
పోహా ఎక్కువమందికి ఇష్టమైన అల్పాహారాలలో ఒకటి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఎంపిక. తక్కువ నూనెతో, బఠానీలు, క్యారెట్లు, బీన్స్, క్యాప్సికమ్ వంటి కూరగాయలతో తయారు చేసుకుంటే.. ఫైబర్ అధికంగా దొరుకుతుంది. కరివేపాకు, ఆవాలు, పసుపు రుచిని పెంచుతాయి. మెరుగైన జీవక్రియను కూడా ప్రోత్సహిస్తుంది. నిమ్మకాయను పిండటం వల్ల తాజాదనం వస్తుంది. విటమిన్ సి స్థాయిలు పెరుగుతాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మితంగా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
కొబ్బరి చట్నీతో ఇడ్లీ
ఇడ్లీలు చాలా తేలికగా, పోషక సమతుల్యతకు ప్రసిద్ధి చెందినవి. ఆవిరితో ఉడికిస్తారు కాబట్టి తక్కువ కొవ్వు ఉంటుంది. శక్తి కోసం కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.ఈ ఇడ్లీలతో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి చట్నీ కలిపి తింటే 300 కేలరీల లోపు ఆరోగ్యకరమైన అల్పాహారం రెడీ. ఇడ్లీ పిండి పులియబెడతారు కాబట్టి.. పేగుల ఆరోగ్యానికి మంచివి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఉబ్బరం తగ్గిస్తాయి. బరువు నిర్వహణకు మద్దతు ఇస్తాయి. చట్నీకి బదులుగా సాంబార్ వేసుకుంటే ప్రోటీన్, ఫైబర్ పెరుగుతుంది.
పెసరట్టు
ప్రోటీన్ అధికంగా పెసరట్టు అల్పాహారానికి మంచి ఎంపిక. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిలో బచ్చలికూర, ఉల్లిపాయలు, కొత్తిమీర లేదా తురిమిన క్యారెట్లు వంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఫైబర్ కంటెంట్ పెంచుతాయి. కేలరీలను పెంచకుండా కడుపు నింపుతుంది. నాన్-స్టిక్ పాన్లో తక్కువ నూనెతో తయారు చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడతాయి.
మిక్స్డ్ వెజిటెబుల్స్‌తో ఉప్మా
ఉప్మాను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ జీర్ణమయ్యే కార్బ్స్, స్థిరమైన శక్తిని అందిస్తుంది. ఉల్లిపాయలు, బఠానీలు, క్యారెట్లు, బీన్స్ వంటి కూరగాయలు వేసుకున్నప్పుడు రుచి పెరుగుతుంది. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉన్నా.. ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచుతుంది. కానీ దీనిని తక్కువగా తీసుకుంటే మంచిది.
శెనగపిండి అట్టు
శనగ పిండితో తయారు చేసే.. పోషకమైన, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహార ఎంపిక. ఇది మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది. కోరికలను తగ్గిస్తుంది. రోజంతా మెరుగైన కేలరీల నియంత్రణకు మద్దతు ఇస్తుంది. టొమాటోలు, ఉల్లిపాయలు, బచ్చలికూర, కొత్తిమీర, తురిమిన క్యారెట్లు వంటి తరిగిన కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్పైక్లను నియంత్రించడానికి, ఉదయం ఆకలిని నివారించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి, కండరాలను మరమ్మత్తు చేయడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనువైనది.
వెజిటబుల్ ఓట్స్
వెజిటబుల్ ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మిక్స్డ్ వెజిటబుల్స్ పోషకాలతో మిళితం చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి, పేగుల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపిక. క్యారెట్లు, బీన్స్, బఠానీలు, క్యాప్సికమ్, ఉల్లిపాయలతో చేసుకుంటే మంచిది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్‌లోని కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
స్ప్రౌట్స్ సలాడ్
స్ప్రౌట్స్ సలాడ్ 300 కేలరీల లోపు తేలికైనది. అత్యంత పోషకమైన అల్పాహారాలలో ఒకటి. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫోలేట్, ఫైబర్, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోజుకు శక్తినిచ్చే ప్రారంభాన్ని అందిస్తుంది. ఉల్లిపాయలు, టొమాటోలు, దోసకాయ, కొత్తిమీర, నిమ్మకాయతో కలిపి తీసుకోవచ్చు. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. జీవక్రియను పెంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. డీటాక్స్ చేసి.. బరువును తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.
ఈ అన్ని ఫుడ్స్ రోజు మొత్తం మీరు యాక్టివ్‌గా ఉండేలా చేసి.. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల ఇతర స్నాక్స్‌కి దూరంగా ఉంటారు. బరువు అదుపులో ఉంటుంది.






















