Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ
ఉచితంగా వీర్యాన్ని దానం చేస్తూ ఎంతో మంది మహిళలకు అమ్మతనాన్ని అందిస్తున్నారు ఒక వ్యక్తి.
ఈయన వీర్యం దానం చేశాడంటే పిల్లలు పుట్టి తీరుతారు. ‘ప్రపంచంలోనే అత్యంత ఫలవంతమైన స్పెర్మ్ డోనర్’గా పేరు సంపాదించాడు. అలాగని నవ యువకుడు కాదు, సీనియర్ సిటిజనే. పేరు క్లైవ్ జోన్స్. ఆయన తొమ్మిదేళ్లుగా ఇదే పనిలో ఉన్నాడు. 58 ఏళ్ల వయసులో మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని వయసు 67. స్పెర్మ్ ను తల్లితనం కోసం తహతహలాడుతున్న వారికి దానంగా ఇస్తున్నాడు. ఇతను ఇచ్చిన వీర్యంతో ఇప్పటివరకు 129 మంది పిల్లలు పుట్టారు. మరో 9 మంది పుట్టబోతున్నారు. ఫేస్ బుక్ ద్వారా ఆయన ఈ వినూత్న సేవ చేస్తున్నట్టు చెప్పారు. తాను చేసే పనివల్ల ఎన్నో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నట్టు చెప్పారాయన. ఇతను నివసిస్తున్నది బ్రిటన్లో.
ఫేస్‌బుక్‌లోనే ఎందుకు?
150 పిల్లలకు జన్మకు కారణమయ్యాక తాను ఈ పనిని ఆపేస్తానని చెబుతున్నారాయన. అధికసంఖ్య క్లినిక్ లు, స్పెర్మ్ బ్యాంకులు ఉన్నాయని, అవి వీర్యాన్ని అమ్ముతున్నాయని అది తనకు నచ్చలేదని అంటున్నారు క్లైవ్ జోన్స్. ఫేస్ బుక్లో తన ఖాతాకు చాలా సందేశాలు, రిక్వెస్ట్‌లు వస్తాయని వాటి నుంచి తాను ఎవరికీ సాయం చేయాలో ఎంపిక చేసుకుంటానని తెలిపారు. వారి దగ్గర నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయనని అప్పుడప్పుడు మాత్రం వారు చెప్పిన క్లినిక్ కు వెళ్లేందుకు పెట్రోలు డబ్బులు మాత్రం అడుగుతానని తెలిపారు. డబ్బులకు వీర్యాన్ని అమ్మడం చట్ట విరుద్ధమని అభిప్రాయపడ్డారు. తన వల్ల పుట్టిన 129 పిల్లల్లో 20 మందిని తాను నేరుగా కలిశానని చెప్పారాయన. ఒక అమ్మమ్మ తనకు మనవరాలిని ఇచ్చినందుకు సంతోషంతో పెద్ద సందేశం పంపిందని, అప్పుడు చాలా సంతోషం వేసిందని చెప్పుకొచ్చారు జోన్స్.
ఎక్కువ మంది వీళ్లే...
ఎంత ప్రయత్నించినా పిల్లలు కలగని వాళ్లు, స్వలింగ సంపర్కులు అధికంగా తనను కాంటాక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు జోన్స్. కొందరికి తన ఐడెంటిటీ తెలుసని, మరికొందరికి తెలియడం ఇష్టం లేక వారి బంధువుల ద్వారా తనకు మెసేజ్ పెడతారని తెలిపారు.
యూకే సంతానోత్పత్తి పరిశోధనా రెగ్యలేటరీ ప్రకారం వీర్యాన్ని దానం చేయకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. వీర్య గ్రహీతలు అవసరమైన సమాచారం కోసం, సలహాల కోసం మాత్రం వారిని సంప్రదించవచ్చు. అయితే బ్రిటన్లో లైసెన్స్ పొందిన క్లినిక్ లో మాత్రమే వీర్యాదానం చేయడం, గ్రహించడం వంటివి చేయమని మాత్రం వారు సూచిస్తున్నారు. దీని వల్ల ఏ సమస్య వచ్చిన ప్రభుత్వ సాయం అందుతుంది. కానీ ఎక్కువ మంది ఈ నిబంధనలు పాటించడం లేదు.
Also read: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం
Also read: పాలకూర అతిగా తిన్నా అనర్థమే... ఈ సమస్యలు వచ్చే అవకాశం