Spinach: పాలకూర అతిగా తిన్నా అనర్థమే... ఈ సమస్యలు వచ్చే అవకాశం
ఆకుకూరలు తింటే ఆరోగ్యం, కానీ మితిమీరి తింటే మాత్రం అనర్ధమే.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే అందులో కచ్చితంగా ఆకుకూరలు ఉంటాయి. వాటిది ప్రత్యేక స్థానం. అధికపోషకాల ఉన్న కారణంగా వైద్యులు కూడా ఆకుకూరలు తినమని సిఫారసు చేస్తారు. అలా చెప్పారు అంటే నిత్యం అవే తినమని అర్థం కాదు, రోజులో ఒక పూట తిన్నా చాలు. మూడు పూటలా తింటూ, అధికమొత్తంలా వాటిని ఆరగించినా ప్రమాదమే. ముఖ్యంగా పాలకూర. అవసరానికి మించి ఏ ఆహారమైన ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. పాలకూర కూడా అంతే. దీన్ని కొంతమంది కూరగా చేసుకుంటారు, పప్పులో కూడా వేస్తారు, ఆమ్లెట్ కు జోడిస్తారు, సూప్ చేసుకుని తాగుతారు... ఇన్ని రూపాలలో ఒకేరోజు పాలకూరను అధికంగా తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి.
పోషకాహార లోపం
పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది మొక్కలలో ఉండే సమ్మేళనం. ఇది శరీరంలోని అధికంగా చేరినప్పుడు ఇతర ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆక్సాలిక్ ఆమ్లం జింక్, మెగ్నీషియం, కాల్షియంలను బంధిస్తుంది. దీని వల్ల పోషకాహార లోపం తలెత్తవచ్చు.
అలెర్జీ
ఆకుపచ్చని కూరలలో హిస్టామిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని కొన్ని కణాలలో కనిపించే ఒక రసాయనం. ఇది అధికంగా శరీరంలో చేరడం వల్ల అలెర్జీ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది.
టాక్సిక్ రియాక్షన్
పాలకూరను ఒకేసారి అధికంగా తీసుకోవడం లేదా ఒకరోజులో విడతల వారీగా అధికంగా తినడం వల్ల శరీరంపై విషప్రభావం పడే అవకాశం ఉంది.
ఇతర సమస్యలు
పైన చెప్పినవే కాదు ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందించి కొత్త సమస్యలు కూడా రావచ్చు. గ్యాస్, కడుపుబ్బరం, తిమ్మిరి వంటివి కలగవచ్చు. పాలకూరలో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి అధికంగా తింటే పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పాలకూరతో వీరికి కష్టమే...
1. పాలకూర అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువ చేరుతుంది. దీన్ని మన శరీరం నుంచి బయటికి పంపడం కష్టమవుతుంది. ఇది మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ రాళ్ల రూపంలో మారడం జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబ చరిత్రలో ఎవరికైనా కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే మీరు పాలకూరను సరైన మోతాదులో తినాలి. అధికంగా తీసుకోకూడదు.
2. పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లంతో పాటూ, ప్యూరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు కలిసి గౌట్ అనే ఒక రకమైన ఆర్దరైటిస్‌ను ప్రేరేపించవచ్చు. ఇప్పటికే కీళ్ల నొప్పులు, వాపులు, మంటతో బాధపడుతున్న వారికి పాలకూరను తీసుకోవడం వల్ల సమస్య మరింత ముదురుతుంది.
3. ఎవరైనా రక్తం పలుచన అయ్యేందుకు మందులు వాడితే అలాంటి వాళ్లు పాలకూరను తక్కువ తినాలి. పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్నిపలుచన చేసే మందులతో కలిసి ప్రతిస్పందించవచ్చు. రక్తం గడ్డకట్టే కారకాలను కూడా ప్రేరేపించవచ్చు.
కాబట్టి పాలకూరను రోజులో మూడు పూటలా తినకూడదు. ఏదో ఒక పూట ఒక అరకప్పు కూర తిన్నా చాలు. కావాల్సిన పోషకాలు అందుతాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.