Relationships: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా?
ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చే భర తన పిల్లలతో గడపడం లేదని బాధపడుతున్న ఒక భార్య కథ ఇది.
![Relationships: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా? He comes late from the office and immediately gets down to work, how to change him? Relationships: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/22ac17c0c4931c6ef0a7351d148e530d1685420748041248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రశ్న: మాది పెద్దల కుదర్చిన వివాహం. పెళ్లయి 8 ఏళ్లు అవుతోంది. నా భర్త ఆఫీస్ నుంచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు. వచ్చాక దుస్తులు మార్చుకొని వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోతారు. నేను భోజనానికి పిలిచే వరకు బాత్రూంలోనే ఉంటారు. తనతో పాటు ఫోను, ఇయర్ ఫోన్స్ కూడా లోపలికి తీసుకెళ్తారు. రోజూ అతను చేసే పని ఇది .నేను కూడా ఉద్యోగం చేస్తాను. నా భర్త వచ్చే సమయానికి ఒక గంట ముందు మాత్రమే ఇంటికి వస్తాను. అయినా పిల్లలతో సమయం గడుపుతున్నాను. వంట చేస్తున్నాను. నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. ఆయన మాత్రం ఆఫీసు నుంచి రాగానే బాత్రూంలో గడపడం అలవాటు చేసుకున్నారు. పిలవకపోతే రెండు గంటలు బాత్రూంలోనే కూర్చుంటారు. అడిగితే అది నా ప్రైవసీ అంటారు. తనకంటూ ఒక సమయం ఉండాలని అంటారు. పిల్లలు కూడా తండ్రిని మిస్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలతో కాసేపు గడపమని చెబుతున్నా అర్థం కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
జవాబు: మీ భర్త తనకంటూ ప్రైవేట్ స్పేస్ అంటే వ్యక్తిగత సమయాన్ని మిస్ అవుతున్నారని మాకు అనిపిస్తోంది. కొందరికి తమకంటూ ప్రత్యేక సమయం ఉండాలని కోరుకోరు, కానీ కొందరు మాత్రం రోజులో కాసేపైనా తమకు ఇష్టమైన పని చేసుకోవడానికి కాస్త సమయాన్ని కోరుకుంటారు. దీన్నే ఇంగ్లీషులో ‘Me Time’ అంటారు. అతను అలా రోజులో గంట నుంచి రెండు గంటలు ప్రత్యేక సమయాన్ని కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. కాకపోతే ఉద్యోగం రీత్యా ఆయన చాలా బిజీగా ఉండడంవల్ల, రాత్రి అయితే కానీ ఆయనకు సమయం దొరకడం లేదు. అయితే మీరు చెప్పిన విషయం కూడా సమంజసమే. అతనికి తన వ్యక్తిగత సమయం ఎంత అవసరమో, పిల్లలకు తండ్రితో గడిపే సమయం కూడా అంతే అత్యవసరం. గదిలో ఉంటే పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తారని, ఆయన బాత్రూమ్నే తన ప్రైవేటు స్పేస్ గా మార్చుకున్నాడు. తనకు నచ్చిన వీడియోలను బాత్రూంలోనే చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం వంటివి చేస్తూ ఉండవచ్చు. దానివల్లే మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
ఇది మాట్లాడితే తీరిపోయే సమస్య. ముందుగా మీ ఇద్దరూ మీ ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకోండి. మీ భర్తతో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకు బాత్రూంలో అంత సమయం గడపాల్సి వస్తుంది అని అడగండి. ఆయన చెప్పింది వినండి. రోజులో ఆయనకు కనీసం గంట ప్రైవేట్ సమయాన్ని అందించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మీరు కూడా ఒక గంట ‘Me time’ తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలను కొంత సమయం పెద్దలకు అప్పచెప్పి మీరిద్దరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునే సమయం కూడా ఉండాలి. సొంత ఇంట్లో బాత్రూంలో కూర్చోవాల్సిన అవసరం ఆయనకు లేదని తెలపండి. ఆఫీస్ నుంచి వచ్చాక ఒక గంట పాటు ఆయన్ని వదిలేయండి. బెడ్ రూమ్ లోనే ఆయనకు నచ్చిన పని చేసుకోమనండి. ఆ తర్వాతే పిల్లల్ని ఆయన దగ్గరకు పంపండి. దీనివల్ల మీ సమస్యా, ఆయన సమస్యా కూడా తీరిపోతుంది.
Also read: ఈ మానసిక రోగాల గురించి ఇంతకుముందు మీరు విని ఉండరు, ఇవి చాలా అరుదైనవి
Also read: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)