Plastic: మీరు తినే ఆహారంలో ప్లాస్టిక్ కలుస్తోంది గమనించారా? ఎలా అంటే ఇదిగో ఇలా
భూమిపై ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతోంది.
పర్యావరణంపై ప్లాస్టిక్ చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ ప్రభావం పరోక్షంగా మనిషిని తాకితే ఎన్నో రోగాల బారిన పడుతున్నాం. ఇక మనకు తెలియకుండా ప్లాస్టిక్ లను తింటే? మేమెప్పుడు తిన్నాం అనుకుంటున్నారా? ఇప్పటి చాలా తినే ఉంటారు. ప్లాస్టిక్ అనగానే కంటికి కనిపించే వస్తువులే కాదు, సూక్ష్మరూపంలో ఉండు మైక్రో ప్లాస్టిక్ కూడా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, గిన్నెలు కాలం గడిచేకొద్దీ సూక్ష్మపరిమాణంలో తనలోని ప్లాస్టిక్ అణువులను విడిచిపెడుతూ ఉంటాయి. అవి మన కంటికి కూడా కనిపించవు. వాటిని మనకి తెలియకుండానే తినేస్తున్నాం.
అయిదు సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ ముక్కలన్నీ మైక్రో ప్లాస్టిక్ కిందకే వస్తాయి. పాలిథిన్, డయాక్షిన్, థాలేట్, పాలీఫ్రొఫైలిన్, బిస్ఫినాల్ A (BPA) వంటివి మైక్రోప్లాస్టిక్ కోవకు చెందినవే. వీటి సూక్ష్మ రూపాలు మనం తినే ఆహఆరం, తాగే నీళ్లు, ధరించే బట్టల ద్వారా మన శరీరంలోకి చేరుకుంటాయి. అనారోగ్యాన్ని కలిగించడంలో ఇవి ముందుంటాయి.
ఎలాంటి హాని కలుగుతుంది?
శరీరంలో చేరిన సూక్ష్మ ప్లాస్టిక్ వల్ల అనేక రకాల మార్పులు కలిగే అవకాశం ఉంది.
1. ముఖ్యమైన హార్మోన్లయిన ఈస్ట్రోజెన్, ఇన్సులిన్, టెస్టోస్టిరాన్ వంటి వాటిలో అసమతుల్యత కలిగేలా చేస్తాయి.
2. పిల్లలు, పెద్దల్లో ఆలోచనా తీరుపై తీవ్ర ప్రభావం కలిగిస్తాయి.
3. ఇవి స్త్రీ పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది.
4. హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం మొదలైన దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.
5. పొట్టలోని మంచి బ్యాక్టిరియాలో సమతుల్యతను దెబ్బతీస్తాయి.
6. రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1. ప్లాస్టిక్ గిన్నెలు వాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. పగుళ్లు వచ్చినవి, పాతవి వాడకపోవడమే ఉత్తమం. వాటిని మాని స్టీల్ గిన్నెలు, గాజు వస్తువులు వాడుకోవాలి.
2. కిచెన్లో ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ వాడుతున్నారా? వాటి స్థానంలో గాజు సీసాలు, స్టీలు డబ్బాలు పెట్టుకోండి. ఏళ్ల తరబడి వాడుతున్న ప్లాస్టిక్ డబ్బాలను బయట పడేయండి.
3. చేపలు వంటి సముద్రపు, నదుల ఆహారాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా శుభ్రం చేశాకే తినాలి. అవి మైక్రోప్లాస్టిక్ లను అధికంగా కలిగిఉంటాయి.
4. ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో కూడా ఇవి ఉంటాయి. ప్యాకేజింగ్ వల్ల థాలేట్ అనే మైక్రోప్టాస్టిక్‌లు అందులో కలుస్తాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: కోవిడ్ తగ్గాక రెండేళ్ల బాబుకి కార్డియాక్ అరెస్టు, పోస్టు కోవిడ్ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు
Also read: ఉదయాన ఈ పనులు చేసే చెడు అలవాటు మీకుందా? వెంటనే వదిలేయండి