Hangover Pills: మందుబాబులకు గుడ్ న్యూస్ - ఈ మాత్రతో హ్యాంగోవరే కాదు, క్యాలరీలూ ఖతం!
ఇంతకుముందు వరకు హ్యాంగోవర్ పిల్ కేవలం హ్యాంగోవర్ ను మాత్రమే తగ్గిస్తుందని అనుకున్నాం. కానీ తాజా అధ్యయనంలో మద్యం వల్ల వచ్చే అధిక క్యాలరీలను కూడా తగ్గిస్తుందని తేలింది.
హ్యాంగోవర్... మద్యం ప్రియులు చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అతిగా మద్యం సేవించడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి, కడుపులో ఇబ్బంది, రక్తంలో చక్కెర తగ్గడం, కడుపులో మంట, అలసట వంటివి వస్తాయి. దీనివల్ల తలనొప్పి, వాంతులు, నిద్రలేమి, కడుపునొప్పి, విరేచనాలు, కళ్లలో బరువు తగ్గడం, నోరు పొడిబారడం, యాసిడ్ పేరుకుపోవడం, తలతిరగడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలన్నింటినీ హ్యాంగోవర్ అంటారు.
హ్యాంగోవర్ ప్రభావం ఆల్కహాల్ తాగిన కొన్ని గంటల తర్వాత మొదలై ఆ తర్వాత దాదాపు 24 గంటల వరకు ఉంటుంది. మీరు హ్యాంగోవర్ ప్రభావాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటే.. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకోకండి. ఆల్కహాల్ శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. తాగిన మత్తులో చాలాసార్లు వాంతులు, విరేచనాలు రావడానికి ఇదే కారణం. ఇది కాకుండా, ఆల్కహాల్ శరీరంలోని రసాయనాల (ఎలక్ట్రోలైట్స్) సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇవి నేరుగా మెదడుతో అనుసంధానించబడి ఉంటాయి. అందువల్ల తలనొప్పి, చికాకు మొదలవుతాయి.
అయితే వీటన్నింటికీ నివారణగా ప్రస్తుతం మార్కెట్లోకి హ్యాంగోవర్ పిల్ అందుబాటులోకి వచ్చింది. స్వీడన్ కి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ దీన్ని కనుక్కుంది. ఆ మాత్ర పేరు మిర్కిల్. ప్రస్తుతం ఇది యూకేలో లభ్యమవుతోంది. త్వరలో ఇండియాలో కూడా ఇది దొరకవచ్చు. 30 పౌండ్లకు 30 మాత్రలు మాత్రమే అక్కడ దొరుకుతున్నాయి.
ఈ ట్యాబ్లెట్ ను ఒక్కటి వేసుకుంటే చాలు హ్యాంగోవర్ వల్ల కలిగే లక్షణాల నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ మాత్ర శరీరంలోని ఆల్కహాల్‌ను 70 శాతం వరకు విచ్ఛిన్నం చేస్తుంది. మద్యం సేవించిన తర్వాత హ్యాంగోవర్ ప్రభావాలను గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాదండోయ్ ఈ మాత్ర వల్ల మన శరీరంలో తాగడం వల్ల కలిగే అదనపు కేలరీలను కూడా తగ్గించుకోవచ్చని అంటున్నారు స్వీడన్ పరిశోధకులు. అయితే మద్యం సేవించిన తర్వాత కంటే తాగడానికి ముందే ఈ మాత్ర వేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలుంటాయట.
అయితే ఆల్కహాల్ తాగడం వల్ల హ్యాంగోవర్ మాత్రమే కాదు, దానిలో ఉన్న చక్కెరల వల్ల శరీరంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. దానివల్ల బరువు పెరుగుతారు. కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ కారణాల వల్ల కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు కనుక్కున్న మిర్కిల్ ఈ రెండు సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిజానికి మిర్కిల్ అనేది ఒక ప్రోబయోటిక్. ఇది శరీరంలో ఆల్కహాల్ విచ్ఛిన్నతను వేగవంతం చేసే పదార్థాలను కలిగి ఉంటుంది. తాగడానికి ముందు దీన్ని తీసుకుంటే ఒక గంటలో ఇది శరీరంలో ఆల్కాహాల్ స్థాయిని 60 నుంచి 70 శాతం వరకు తగ్గిస్తుందని ఇంతకు ముందు జరిగిన పరిశోధనల్లో తేలింది. అయితే కేవలం అది మాత్రమే కాకుండా ఒక గంటలో దాదాపు 70 శాతం వరకు కేలరీలను కూడా బర్న్ చేస్తుందని తాజా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
ఈ విషయం పై దీన్ని రూపొందించిన ఫ్రెడరిక్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేవలం హ్యాంగోవర్ ను మాత్రమే తగ్గిస్తుందని ప్రాథమిక పరిశోధనల్లో అనుకున్నాం. కానీ అది కాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే అధిక కొవ్వును కూడా ఇది కరిగిస్తుందని ఇప్పటి పరిశోధనల్లో తేలింది. ఇలా రెండింటికీ ఉపయోగపడే ఇలాంటి మాత్ర ప్రస్తుతం మార్కెట్లో ఇదొక్కటే ఉందని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ మద్యం తాగడం అనేది శరీరానికి చాలా హానికరం. మందులు అందుబాటులోకి వచ్చినా అవి వందశాతం ఫలితాలను చూపించలేదు. స్వీయ నియంత్రణే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందనడంలో సందేహమేమీ లేదు.
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!