చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు? అసలు కారణం తెలుసుకున్న పరిశోధకులు, నివారణ సాధ్యమేనా?
పూర్తిగా టీనేజ్ రాకముందే జుట్టు నెరిసే సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు కనిపెట్టామని పరిశోధకులు ప్రకటించారు.
వయసుపెరిగే కొద్దీ వయసు మళ్లుతున్న ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే అన్నింటి కంటే ముందు వయసు పెరిగేది చాలా మందిలో జుట్టుకే. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. పట్టుమని పదహారు లేకుండానే జుట్టు నెరిసిపోయే వారు పూర్తి జనాభాలో ఇంచుమించు సగం మంది ఉంటున్నారు. 20ల్లోకి వచ్చేసరికి రంగేసుకోవాల్సి వస్తోంది. ఒకసారి జుట్టు నెరిస్తే ఇక మరోదారి లేదు. అది నాచురల్ రంగో, కెమికల్ రంగో ఏదో రంగు పడాల్సిందే తప్ప మార్గం లేదు. ఇలా జుట్టు నెరిసేందుకు కారణాలేమిటో తెలుసుకున్నామని పరిశోధకులు అంటున్నారు. ఈ కారణాల ఆధారంగా భవిష్యత్తులో జుట్టు తెల్లబడకుండా నివారణ మార్గాలను కనుగొనడం సాధ్యమవుతుందని వెల్లడించడం విశేషం.
కొంత మందికి ఇలా ఎందుకు వయసు పెరగకపోయినా జుట్టు నెరిసిపోతుందో తెలుసుకోవడానికి జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలను తెలుసుకున్నారట. జుట్టు రంగుకి మెలనోసైట్ స్టెమ్ సెల్స్ ఎలా పనిచేస్తాయో అర్థమైందని న్యూయార్క్ యూనివర్సిటికి చెందిన డా క్వీసన్ అంటున్నారు. కొత్తగా తెలుసుకున్న విషయాలు మెలనోసైట్ మెకానిజంలో మార్పు రాకుండా ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకునేందుకు ఉపయోగపడొచ్చట.
సాధారణంగా 35 సంవత్సరాల వయసు నుంచి జుట్టు నెరిసిపోవడం స్టార్ట్ అవుతుంది. కొంత మందిలో ఇంకా ముందే ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. జుట్టు ఫాలికిల్ దగ్గర జుట్టు రంగు ఉత్పత్తి అవుతుంది. హెయిర్ రూట్ దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంటుంది. జుట్టు పెరగడం మొదలైన తర్వాత అది రంగు మారడం జరగదు. పెరగడానికి ముందే రంగు సంతరించుకుని తర్వాత పెరుగుదల ప్రారంభమవుతుంది. వయసు పెరిగేకొద్ది ఫాలికిల్ దగ్గర వర్ణద్రవ్యం ఉత్పత్తి తగ్గిపోతుంది. జుట్టు ఊడిపోయి అదే ఫాలికిల్ దగ్గర కొత్త జుట్టు వస్తున్నపుడు ఇక దానికి నలుపు రంగు రాదు.
ఈ ప్రక్రియను నివారించేందుకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవు. జుట్టుకు రంగేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. దీని కోసం అందరూ సింథటిక్ హెయిర్ డైలను వాడుతుంటారు. రంగు ఉత్పత్తి చేసే ఫోలికిల్స్ సామర్థ్యాన్ని మూలకణాలు ప్రభావితం చెయ్యగలవని తాజా అధ్యయనం వెల్లడి చేస్తోంది.
ప్రయోగంలో భాగంగా ఎలుకల చర్మంలోని కణాలను పరీక్షించి చూశారు. ఎలుకల్లో ఉన్న మెలనోసైట్ స్టెమ్ సెల్స్ లేదా McSC అనే స్టెమ్ సెల్స్ మనుషుల్లో కూడా ఉన్నట్లు కనుగొన్నారు. వెంట్రుకలు పెరుగుతున్న సమయంలో హెయిర్ ఫోలికిల్ కంపార్ట్మెంట్ల మధ్య ఈ కణాలు నిరంతరంగా ముందు వెనుకకు కదులుతుంటాయి. వయసు పెరిగే కొద్ది McSCల సంఖ్య హెయిర్ ఫాలికిల్ బల్జ్ అనే స్టెమ్ సెల్ కంపార్ట్మెంట్లో చిక్కుకుపోయి జుట్టుకు రంగు అందకుండా చేస్తుంది. బెలనోసైట్ స్టెమ్ సెల్ ఈ సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల జుట్టు రంగు కోల్పోతుందని ఈ పరిశోధనలో తెలిసిందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రంగుకు మెలనోసైట్ స్టెమ్ సెల్ మొటాలిటి, రివర్సబుల్ డిఫరెన్సియేషన్ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు, రంగు కోల్పోకుండా ఉండేందుకు కీలకమని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. దీని ఆధారంగా త్వరలోనే జుట్టు తెల్లబడే సమస్యకు ట్రీట్మెంట్‌ను కనుగోవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.