(Source: ECI/ABP News/ABP Majha)
Friendship Day Date: ఈ రోజు ‘ఫ్రెండ్‌షిప్ డే’ ఏంట్రా మామ? ఆగస్టు ఫస్ట్ సండే వచ్చేది ఏమిటీ?
ఈ రోజు మీ ఫ్రెండ్స్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారా? అయితే, వారిని తిట్టమాకండి. ఈ రోజు ‘ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే’.
Friendship Day 2022 Date: ఈ రోజు (జులై 30) ఎవరైనా ‘ఫ్రెండ్‌షిప్ డే’ చెబుతుంటే మీకు వెంటనే వచ్చే సందేహం ఏమిటీ? అదేంటీ, మనం ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం కదా ఫ్రెండ్‌షిప్ డే చేసుకుంటాం. డేట్‌గానీ మార్చేశారా? ఏంటి అని కదా అనుకుంటాం. వాస్తవానికి జులై 30 కూడా ‘ఫ్రెండ్‌షిప్ డే’నే. కానీ, అది ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’. ఎన్నాళ్ల నుంచో ప్రపంచమంతా జులై 30న ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటుంది. కానీ, అదంతా యాపారం. ‘ఫ్రెండ్‌షిప్’తో వ్యాపారం చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు వేసిన ఎత్తు. కానీ, స్నేహితులకు ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలనేది మాత్రం మంచి ఐడియా. అందుకే, జులై 30వ తేదీన దాదాపు అన్ని దేశాల్లో ‘ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే’ నిర్వహిస్తారు. అయితే, ఇండియాలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారం మాత్రమే నిర్వహిస్తారు. ఈ ఏడాది జులై 30 వికెండ్‌లో రావడం వల్ల కొందరు ముందుస్తుగానే ఫ్రెండ్‌షిప్ డే చేసుకుంటున్నారు.
ఈ ఏడాది మొదటి ఆదివారం ఆగస్ట్ 7న వస్తుంది. నిత్యం మనకు తోడుగా ఉండే స్నేహితుడికి ఎంతిచ్చినా, ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ, వారి బాగోగులు తెలుసుకుంటూ.. అవసరమైన సాయం చేస్తుంటే.. అంతకన్నా గొప్ప పని మరేది ఉండదు. బిజీ లైఫ్‌లో స్నేహితులను కలుసుకుని షికారుకు వెళ్లడం అంత ఈజీ కాదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల దూరం పెరుగుతుంటుంది. అందుకే, ఏడాదిలో ఒక్కసారైనా అంతా ఒక్క చోటు చేరి సెలబ్రేట్ చేసుకోవడం మంచి ఆలోచన. ఇందుకు స్నేహితుల దినోత్సవం బెస్ట్ ఆప్షన్.
చిక్కు ఏమిటంటే.. ఇప్పుడు మనం జులై 30న వచ్చే ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేట్ చేసుకోవాలా? ఆగస్టు మొదటి ఆదివారం వచ్చే స్నేహితుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలా? అయితే, ఈ ఛాయిస్ పూర్తిగా మీదే. ఎందుకంటే.. జులై 30న వచ్చే ఫ్రెండ్‌షిప్ డే ఈ రోజు శనివారం వచ్చింది. కాబట్టి, వీకెండ్ నైట్ గట్టిగానే ఎంజాయ్ చేయొచ్చు. కానీ, ఆగస్టు మొదటి ఆదివారం చిరకాల మిత్రులతో చిల్ అవ్వడానికి బాగుంటుంది. పైగా, ఇండియాలో ఎప్పటి నుంచో ఈ రోజును స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అది వదిలేసి పరాయి దేశాల ట్రెండ్ ఫాలో అవ్వడం ఎందుకు చెప్పండి?
ఎప్పటిలాగానే ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుని.. స్నేహబంధానికి గుర్తుగా రిస్ట్‌బ్యాండ్‌లు కట్టుకోండి. వీలైతే బహుమతులను ఇచ్చిపుచ్చుకోండి. జులై 30 వచ్చే ‘ఫ్రెండ్‌షిప్’ ఇప్పటిది కాదు. 1930లో హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్‌కు వచ్చిన ఐడియా ఇది. తమ వాణిజ్య అవసరాల కోసం అతడు ఆ రోజును స్నేహితుల దినోత్సవం అని ప్రచారం చేశాడు. ఇదేదో బాగుందే అని ప్రజలు కూడా ఆ గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసి.. ఘనంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇది పెద్ద వ్యాపారంగా మారడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయి.. ఆ రోజున ఫ్రెండ్‌షిప్ డే చేసుకోవడాన్ని మానేశారు. చాలాకొద్ది మాత్రమే దాన్ని పాటించేవారు.
అలాంటి సమయంలో.. మరోసారి ‘ఫ్రెండ్‌షిప్ డే’ గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది. 1958లో వివిధ సంస్కృతుల మధ్య శాంతియుత సంబంధాలను పెంపొందించడానికి వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే అంతర్జాతీయ పౌర సంస్థ జులై 30న ఫ్రెండ్‌షిప్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. దీంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 27, 2011న శాంతి, సంతోషం, ఐక్యతను పెంపొందించడానికి జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అయితే, అంతకు ముందు నుంచే మన ఇండియాలో ఆగస్టు మొదటి ఆదివారం ‘స్నేహితుల దినోత్సవం’ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందుకే, స్నేహితుల దినోత్సవంపై ఈ గందరగోళం. ఇండియాతోపాటు మలేషియా కూడా ఆగస్టు మొదటి ఆదివారమే స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఒహియోలోని ఒబెర్లిన్‌లో ప్రజలు ఏటా ఏప్రిల్ 9న నిర్వహిస్తారు.
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!