Kids Height: పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
సమాజంలో ఎత్తుకు ప్రాధాన్యత ఎక్కువే. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎత్తును అర్హతగా అడుగుతున్నాయి.
పిల్లలు ఎత్తు పెరగాలని ప్రతి తల్లితండ్రీ కోరుకుంటారు. బిడ్డ తగినంత ఎత్తు ఎదగకపోతే వారి బాధ ఇంతా అంతా కాదు. వారి ఎత్తు వారసత్వంగా వచ్చే జన్యువులపై ఆధారపడి ఉంటుందనేది నిజమే. చిన్నప్పట్నించి వారికిచ్చే ఆహారం కూడా వారి ఎత్తును నిర్ణయిస్తుంది. అందుకే పిల్లలకి చిన్నప్పట్నించి ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సాధారణంగా ఏడాది వయసు నుంచి యుక్త వయసు వరకు ఎత్తు స్థిరంగా పెరుగుతూనే ఉంటారు. ఆ సమయంలో వారికిచ్చే ఆహారం చాలా ముఖ్యం.
1. పిల్లలకు రోజూ పాల ఉత్పత్తులను తప్పకుండా ఇవ్వాలి. ఉదయం గ్లాసుడు పాలతో రోజును మొదలుపెట్టాలి. మధ్యాహ్నం కచ్చితంగా పెరుగు అన్నం తినేలా చూడాలి. ఎందుకంటే పాల ఉత్పత్తులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు ఎదగడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పనీర్, చీజ్ వంటి వాటిలో కూడా కాల్షియం లభిస్తుంది.
2. టీలు, కాఫీలను పిల్లలకు దూరంగా ఉంచాలి. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటివి కూడా అలవాటు చేయద్దు.
3. రోజూ పుష్కలంగా నీరుతాగేలా చూడండి. నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. జీర్ణక్రియ రేటు కూడా పెరుగుతుంది. నీళ్లు తరచూ తాగడం వల్ల యూరిన్ ద్వారా టాక్సిన్స్ కూడా బయటికి పోతాయి. కాబట్టి వారి పేగుల ఆరోగ్యం బాగుండడం వల్ల ఎత్తు కూడా చక్కగా పెరిగే అవకాశం ఉంది.
4. పిల్లల ఎదుగుదలకు నిద్ర కూడా అత్యవసరం. తగినంత నిద్ర లేకపోవడం కూడా వారి ఎత్తుపై ప్రభావం చూపిస్తుంది. కణజాలానికి ఆహారంతో పాటూ తగినంత విశ్రాంతి కూడా అందినప్పుడే వాటిలో పెరుగుదల బావుంటుంది.
5. పిల్లల్ని ఇంట్లోనే బందీగా చేయద్దు. టీవీలకు అలవాటు చేసి బయట ఆడే ఆటల్ని బహిష్కరించకండి. వ్యాయామం చాలా అవసరం. అందుకే వారు శారీరకంగా ఆడే ఆటలు రోజూ కనీసం గంటసేపైనా ఆడేలా చూసుకోండి. అవి శరీరం సాగుదలకు సాయపడుతుంది. దీనివల్ల ఎత్తు పెరిగే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా ఫుట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, రన్నింగ్ వంటి ఆటల వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది.
6. రోజూ పిల్లలు రెండు మూడు రకాల పండ్లు తినేలా చూడండి. దీనివల్ల మల్టీవిటమిన్లు వారికి అందే అవకాశం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి.
7. సోయాతో చేసిన ఆహారపదార్థాల్ని రెండేళ్ల వయసు నుంచే తినిపించడం అలవాటు చేయాలి. సోయా మిల్క్, సోయా చంక్స్ తో చేసిన వంటలు తినిపిస్తూ ఉండాలి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?