High BP: హైబీపీ వస్తుందనే భయమా... ఈ ఆహారంతో చెక్ పెట్టొచ్చు
ఆధునిక జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి అధికరక్తపోటుకు కారణం అవుతోంది. దాన్ని అడ్డుకోవాలంటే ప్రత్యేకంగా కొన్ని ఆహారాలు తీసుకోకతప్పదు.
అధిక రక్తపోటును అడ్డుకునేందుకు ఆరోగ్యమైన జీవనశైలి అవసరం. పనిఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి... ఇలా రకరకాల ఒత్తిళ్లు రక్తపోటును పెంచేస్తున్నాయి. దీనివల్ల రక్తనాళాల్లో ఒత్తిడి అధికమై గుండెజబ్బులు, డయాబెటిస్, మూత్రపిండాల వ్యాధులు ఇలా అనేక రకాల ఆరోగ్యసమస్యలు మొదలవుతున్నాయి. రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం ద్వారా అధికరక్తపోటును నియంత్రించవచ్చు.
1. అరటిపండు
సోడియం ఒంట్లో అధికంగా చేరినా అధికరక్తపోటు సమస్య పెరుగుతుంది. అందుకే రోజూ అరటి పండు తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం వల్ల కలిగే చెడు ప్రభావాలను తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటు పెరిగే అవకాశం కూడా మందగిస్తుంది.
2. ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు
లెట్యూస్, కాలే, పాలకూర, క్యాబేజీ, మెంతి కూర వంటి ఆకుకూరలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి అందుతాయి, అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా అందుతాయి. ఇవి అధిక రక్తపోటు బారిన పడకుండా కాపాడతాయి.
3. టమోటా
చవకైన కూరగాయల్లో టమోటాలు కూడా ఒకటి. వీటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అలాగే కెరోటినాయిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు పెరగకుండా చూడడమే కాకుండా, గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. టమోటాలు సూప్ , సలాడ్ , రసం... ఇలా చేసుకుని తింటే చాలా మంచిది.
4. వెల్లుల్లి
చాలా మంది వెల్లుల్లి తినరు. కానీ ఉల్లి లాగే వెల్లుల్లి చేసే మేలు కూడా ఎక్కువే. దీనిలో సహజంగానే యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికం. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చూడడంలో నైట్రిక్ ఆక్సైడ్ ముందుంటుంది.
5. పెరుగు
శరీరానికి అవసమరయ్యే ఆరోగ్యకరమైన బ్యాక్టిరియాలు పెరుగులో అధికం. ఈ బ్యాక్టిరియాలు జీర్ణక్రియకు సహకరిస్తాయి. పెరుగు తినడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడ తగ్గుతుందని చాలా అధ్యయనాలు తేల్చాయి.
6. పుచ్చకాయ, నేరేడు
ఈ పండ్లు కూడా అధికరక్తపోటు బారిన పడకుండా కాపాడతాయి. పుచ్చకాయలో లైకోపీన్, పోటాషియం, విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే హానిచేసే సోడియం, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. నేరేడులో ఫ్లేవనాయిడ్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
Also read: మనీ ప్లాంట్ లేదా కాయిన్ ప్లాంట్... రెండింటిలో ఏది పెంచితే మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి?
Also read: గర్భం రాకుండా వేయించుకునే లూప్ వల్ల సమస్యలు వస్తాయా?
Also read: వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగితే మంచిదేగా? ఆయుర్వేదం కాదంటోంది ఎందుకు?