Stress: అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా? జాగ్రత్త క్యాన్సర్ బారిన పడతారు
ఒత్తిడి బారిన పడడం వల్ల ప్రాణాంతకమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది.
క్యాన్సర్ పేరు చెబితేనే వణికిపోయేవారు ఎంతోమంది. ఆ రోగం బారిన పడిన వారు సాధారణ జీవితం గడపడం కష్టం. వారి జీవితకాలం కూడా తగ్గిపోతుంది. అందుకే క్యాన్సర్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొంతమందికి వారసత్వంగా క్యాన్సర్ సోకుతుంది. అలాంటప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. కానీ చెడు జీవనశైలి అధికం. ఒత్తిడి కారణంగా కూడా క్యాన్సర్ బారిన పడే వాళ్ళు ఉన్నారు. ఒత్తిడికి, క్యాన్సర్‌కు సంబంధం ఉన్నట్టు ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. మానసిక ఒత్తిడికి గురయ్యే వాళ్ళు క్యాన్సర్ బారిన పడతారని, అలాగే వారికి వచ్చే క్యాన్సర్లు త్వరగా నయం కావని, ఒకవేళ నయం అయినా కూడా తిరిగి క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
చాలామందికి అధిక ఒత్తిడికి, క్యాన్సర్‌కు ఏమిటి సంబంధం? అనే సందేహం రావచ్చు. మన జీవనశైలికి, క్యాన్సర్‌కు సంబంధం ఉంది. అంటే అధిక రక్తపోటు బారిన పడడం, అధికంగా ధూమపానం, మద్యపానం చేయడం, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, అధిక బరువు... ఇవన్నీ కూడా భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉన్నవి. అంటే వీటికి ఒత్తిడికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలాగే ఇలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడిన వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీన్నిబట్టి ఒత్తిడికి, క్యాన్సర్ కు పరోక్షంగా సంబంధం ఉన్నట్టు అర్థమవుతుంది. ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదల అవ్వడం వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగే మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటే అన్ని రకాల జబ్బుల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఊబకాయం బారిన పడిన వారిలో రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటివి అధికంగా వస్తాయి.
కేవలం మానసిక ఒత్తిడి వల్లే క్యాన్సర్ వస్తుందని నేరుగా చెప్పలేకపోవచ్చు, కానీ ఈ ఒత్తిడి వల్ల కలిగే ఇతర అనారోగ్యాలు క్యాన్సర్‌కు దారితీస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పగలం. అలాగే మానసిక ఒత్తిడితో బాధపడేవారు క్యాన్సర్ బారిన కూడా పడితే వారు త్వరగా కోలుకోవడం అసాధ్యం. ఒత్తిడి లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఇప్పటికే అధ్యయనాలు చెప్పాయి. కాబట్టి మానసిక ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నించండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ధూమపానం, మద్యపానం వంటివి మానేయండి. అధిక కొవ్వు కలిగిన పదార్థాలను తినడం మానేయండి. వ్యాయామం అధికంగా చేయండి. రోజుకు కనీసం గంట పాటు నడవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా రోజూ గంట పాటు నడిచే వాళ్ళు ఎన్నో రకాల రోగాల బారిన చాలా తక్కువ పడతారు.
Also read: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.