Dieting: విపరీతంగా డైటింగ్ చేయడం కూడా ఓ వ్యాధే, ఈ రుగ్మతను ఏమంటారంటే...
కొంతమంది విపరీతంగా డైటింగ్ చేస్తారు. అది ఒక మానసిక సమస్య.
సన్నగా కనబడాలన్న తాపత్రయంతో డైటింగ్ చేస్తూ కావాల్సిన పోషకాలు, ఖనిజాలు శరీరానికి అందించకుండా నీరసపడిపోతుంటారు ఎంతోమంది. నిత్యం డైటింగ్ గురించే ఆలోచిస్తారు. ఏం తినాలన్నా బరువు పెరిగిపోతానేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదని, వారు ఒక ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు వైద్యులు. ఇలా ఆహారం తినకుండా సన్నబడాలన్న కోరికతో ఉండే వారికి అనోరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్ డిసార్డర్ ఉన్నట్టే. ఇది ఆహారానికి సంబంధించిన ఒక మానసిక సమస్య. ఇది ఉంటే ఆహారాన్ని తినేందుకు ఇష్టపడరు.
ఆహారాన్ని తినకుండా ఇంకా బరువు తగ్గాలన్న తాపత్రయంతో ఎంతోమంది సమస్యలను తెచ్చుకుంటున్నారు. ఇలా శరీరానికి సరిపడా ఆహారం తినకపోవడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశం ఉంది. అంటే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. రక్తపోటు తగ్గిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఈటింగ్ డిజార్డర్ బారిన పడుతూ ఉంటారు. ఇది చివరికి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టడంతో పాటు మరణానికి కారణం అవుతుంది. కాబట్టి బరువు తగ్గాలన్న కోరికతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం మంచి పద్ధతి కాదు.
సన్నగా ఉన్న వారికే ఈ ఈటింగ్ డిజార్డర్ ఉందని చెప్పలేము. సాధారణ బరువు ఉన్న వ్యక్తుల్లో కూడా ఇది ఉండవచ్చు. ఈ ఈటింగ్ డిజార్డర్ ఉన్న వారి శారీరక, మానసిక భావోద్వేగ ప్రవర్తనలు విచిత్రంగా ఉంటాయి. తాము బరువు పెరుగుతూ ఉన్నామని తీవ్రంగా భయపడుతూ ఉంటారు. నిజానికి వారు సన్నగా ఉన్నప్పటికీ తమ శరీరంలో కొవ్వు పేరుకు పోయిందని చెబుతూ ఉంటారు. విపరీతంగా డైటింగ్ చేస్తారు. వీరికి స్వీయహాని చేసుకునే అలవాటు కూడా రావచ్చు. కొంతమందిలో ఆత్మహత్యా ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి ఈ ఈటింగ్ డిజార్డర్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. తీవ్రంగా వ్యాయామం చేయడం, ఆహారం తినడం మానేయడం, ఆకలిని తగ్గించే మందులు వేసుకోవడం వంటివి మీరు చేస్తూ ఉంటారు.
ఈ ఈటింగ్ డిజార్డర్ ఎందుకు వస్తుందనేది మాత్రం ఖచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇది జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు, తోబుట్టువులకు ఈ రుగ్మత ఉంటే ఆ కుటుంబంలోని వారికి వచ్చే అవకాశం పదిరెట్లు ఎక్కువ. అలాగే జీరో సైజ్ ఉండాలన్నా, విపరీతమైన కోరికల వల్ల కూడా ఈ రుగ్మత రావచ్చు.
మీకు ఈ ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. దీనికి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. కుటుంబ సభ్యులు కూడా తమ ఇంట్లోనే వారిని గమనిస్తూ ఉండాలి. ఎవరైనా అధిక డైటింగ్ చేస్తుంటే దాన్ని ఆపడం చాలా ముఖ్యం. వారు పోషకాహారం తింటున్నారో లేదో చెక్ చేసుకోవడం కూడా మంచిది. లేకుంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది.
Also read: మా చెల్లి చేస్తున్న తప్పును నేను భరించాల్సి వస్తోంది, నాన్నకు చెప్పడం ఎలా?
Also read: గడ్డి తిను అంటారు, కానీ నిజంగానే గడ్డి ప్లేట్లలోనే ఇప్పుడు ఎంతోమంది తింటున్నారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.