Relationships: మా చెల్లి చేస్తున్న తప్పును నేను భరించాల్సి వస్తోంది, నాన్నకు చెప్పడం ఎలా?
తన చెల్లి తప్పు చేస్తోందని తెలిసినా, ఆ విషయం తండ్రికి చెప్పలేక ఇబ్బంది పడుతున్న ఓ అక్క ఆవేదన ఇది.
ప్రశ్న: మా నాన్న పద్ధతులు, విలువలు ఉన్న వ్యక్తి. ఆయనకు ముగ్గురుం ఆడపిల్లలమే. నేను అందరికన్నా పెద్దదాన్ని. నేను ఉద్యోగం చేస్తున్నా. చెల్లి కూడా ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరింది. రెండో చెల్లి చదువుకుంటోంది. నాకు ఇటీవలే పెళ్లయింది. ఇక చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాన్నగారు పెళ్లి చూపులకు రమ్మని ఎప్పుడు పిలిచినా ఆమె రాదు. ఒక్క పెళ్లి సంబంధానికి కూడా ఇంతవరకు ఆమె హాజరు కాలేదు. దీంతో అమ్మానాన్న చాలా బాధపడుతున్నారు. నాకు చెప్పి చాలా బాధపడ్డారు. నేను మా చెల్లితో ప్రేమగా మాట్లాడి అసలు విషయాన్ని రాబట్టాను. తన కొలీగ్‌తో ప్రేమలో ఉంది. అంతవరకు అయితే పర్వాలేదు. కానీ వారిద్దరూ గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అదే నాకు చాలా బాధనిపిస్తోంది. నాన్నగారు ఆడపిల్లలు ముగ్గురిని పద్ధతిగా పెంచానని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ నా చెల్లి... పెళ్లి కాకముందే వేరొకరితో కలిసి ఉందని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఈ విషయం నన్నే నాన్నగారికి చెప్పమని మా చెల్లి రిక్వెస్ట్ చేస్తోంది. ఆయనకు విషయం తెలిస్తే ఏమైపోతారో అని భయమేస్తోంది. ఈ విషయంలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మా చెల్లి మాత్రం అతన్ని వదిలిపెట్టనని, అతనితోనే ఉంటానని చెబుతోంది. ఈ విషయాన్ని మా నాన్నగారికి సామరస్యంగా ఎలా వివరించాలో తెలియజేయండి.
జవాబు: మీ పరిస్థితి అర్థం అవుతోంది. ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తండ్రి చాలా జాగ్రత్తగా ఉంటాడు. వారికోసం చిన్నప్పటి నుంచే ఆర్థికంగా, సామాజికంగా రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. మీ తండ్రి కూడా అలాంటి వారేనని అర్థమవుతోంది. మీరు, మీ నాన్నగారు చెప్పిన సంబంధానికే తలవంచి తాళి కట్టించుకున్నారు. కానీ మీ చెల్లి అందుకు సిద్ధంగా లేదు. కొందరు తల్లిదండ్రులకు ప్రేమ వివాహాలు నచ్చదు. అది వారి పెద్దరికాన్ని అవమానపరిచేదిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందులోనూ తన ముగ్గురు ఆడపిల్లలకు మంచి స్వేచ్ఛనివ్వడమే కాకుండా చక్కగా చదివించి ఉద్యోగస్తులను చేశారు మీ తండ్రి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా షాక్‌కు లోనవుతారు. కాబట్టి మీరు సహజీవనం చేస్తున్న సంగతి ఆయనకు తెలియక పోవడమే మంచిది.
అయితే మీ చెల్లి తన సహోద్యోగిని ప్రేమిస్తోందని, అతడినే పెళ్లి చేసుకుంటుందనే విషయాన్ని మీ నాన్నగారికి వివరించాలి. వారు పెళ్లికి ముందే కలిసి జీవిస్తున్నారని సంగతి తెలిస్తే తట్టుకోవడం కష్టమే. అందులోనూ పెద్దవారు గుండె త్వరగా పగిలి పోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ చెల్లితో, ఆమె ప్రేమించిన వ్యక్తితో మాట్లాడండి. దీన్ని ప్రేమ వివాహంగా నాన్నగారి ముందుకి ప్రపోజల్ పెడదామని చెప్పండి. సహజీవనం సంగతి మాత్రం నోరు జారనివ్వకండి. వీలైతే ఇద్దరినీ కొన్నాళ్ళు దూరంగా ఉండమని చెప్పండి. ఇద్దరినీ వేరు వేరు హాస్టల్లో చేరమనండి. ఆ తర్వాత మీరు, మీ చెల్లి ప్రేమ సంగతి నాన్నగారితో మాట్లాడండి. ముందుగా మీ చెల్లిని, అతడిని తనకి కరెక్టేనా? కాదా? అని మరొకసారి నిర్ణయించుకోమనండి. అన్నీ నిర్ధారించుకున్నాక పెళ్లి ప్రపోజల్‌ను మీ నాన్నగారి ముందుకు తీసుకువెళ్లండి. ప్రయోజకుడైన వ్యక్తిని ఏ తండ్రి కాదనడు. అతడు అన్ని విధాలా ప్రయోజకుడైతే కచ్చితంగా వారి పెళ్లి అవుతుంది. అయితే సహజీవనం సంగతి తెలిస్తే ఇన్నాళ్లు తన పెంపకం పై పెట్టుకున్న నమ్మకం, గౌరవం ఆయనకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం తెలియకుండా ఉంచమని మీ చెల్లికి, ఆమె ప్రేమికుడికి చెప్పండి. మీ తల్లికి కూడా తెలియకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఏదో ఒక బలహీన క్షణంలో ఆమె మీ నాన్నగారికి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రేమ వివాహంగా మార్చి మీరే దగ్గరుండి వారి పెళ్లి చేయడం మంచిది. అలా వారి ప్రేమను గెలిపించడమే కాదు, మీ తండ్రి ఆరోగ్యాన్ని, గౌరవాన్ని కాపాడుకున్న వారు అవుతారు.
Also read: గడ్డి తిను అంటారు, కానీ నిజంగానే గడ్డి ప్లేట్లలోనే ఇప్పుడు ఎంతోమంది తింటున్నారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.