Best Food Combinations: ఈ ఆహార కాంబినేషన్లను తింటే పిల్లల్లో పోషకాహారలోపమే రాదు
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అలాగే కొన్ని రకాల ఫుడ్ కాంబోస్ కూడా తినాల్సిందే.
శరీరం పోషకాహార లోపం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినాలి. ఆ ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను పొందాలి. కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లను పిల్లలు, పెద్దలు తినాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు శరీరానికి చెడు చేసే ఫుడ్ కాంబినేషన్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శరీరానికి మేలు చేసే ఆహార కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల శరీరం విటమిన్లను, ఖనిజాలను, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలను పుష్కలంగా శోషించుకుంటుంది. దీనివల్ల పోషకాహార లోపం రాదు.
అరటిపండు - పెరుగు
అల్పాహారంలో భాగంగా కప్పు పెరుగులో అరటిపండు ముక్కలను వేసుకొని తినడం అలవాటు చేసుకోవాలి. అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది పెరుగు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలతో కలవడం వల్ల శరీరంలోని కండరాలకు మంచి జరుగుతుంది. అరటి పండులో ఇన్యులిన్ అధికంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రోబయోటిక్. పొట్ట ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. పెరుగులో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవన్నీ పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. పెరుగులో ఉండే కాల్షియన్ని శరీరం గ్రహించేలా చేస్తుంది.
పుట్టగొడుగులు - నువ్వుల గింజలు
ఇది విటమిన్, మినరల్ కాంబో అని చెప్పుకోవచ్చు. ఎముకలను దృఢంగా మార్చడంలో ఈ ఫుడ్ కాంబినేషన్ సహాయపడుతుంది. క్యాల్షియం, విటమిన్ డి... ఈ రెండు పుట్టగొడుగులు, నువ్వుల గింజల ద్వారా అందుతాయి. విటమిన్ డి ఆహారంలోని క్యాల్షియాన్ని పేగులు శోషించుకునేలా చేస్తుంది. అందుకే ఈ రెండు కలిపి తినడం వల్ల విటమిన్ డి లోపం రాదు. క్యాల్షియం లోపం కూడా రాదు.
నిమ్మకాయ - ఆకుకూరలు
ఈ రెండిండి కాంబినేషన్ వినడానికి కాస్త వింతగా ఉన్నా... ఆ రెండింటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇక ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి, శరీరం ఇనుమును సులభంగా గ్రహించేలా చేస్తుంది.
ఆలివ్ నూనె - పాలకూర
పాలకూరను వండుకోవడం అధికమే, కానీ ఆలివ్ నూనెను వాడరు. దీని ఖరీదు ఎక్కువ. కాబట్టి సాధారణ నూనెలతోనే వండుకుంటారు. రోజుకో స్పూన్ ఆలివ్ నూనె తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర వండినప్పుడు నూనెతో వండితే మంచిది. రెండింట్లోనూ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి.
బాదంపప్పు - నారింజ పండ్లు
ఈ రెండూ కూడా రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం. ఈ రెండింటిలో విటమిన్ సి, విటమిన్ Eలు అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడేందుకు కృషి చేస్తాయి. చర్మానికి రెట్టింపు అందాన్ని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్ సి గాయాలను త్వరగా నయం అయ్యేలా చేస్తుంది.
Also read: నా భార్య కొడుతోంది, ఈ సమస్య ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.