Rusk: ఉదయం టీతో పాటు రస్కులు కూడా తింటున్నారా? అదెంత అనారోగ్యకరమో తెలుసా
ఉదయం లేవగానే టీ, రస్కుల కాంబినేషన్ తినే వారి సంఖ్య అధికంగానే ఉంది.
ఉదయం లేచాక కప్పు టీ పక్కనే రెండు మూడు రస్కులు పెట్టుకుని తినడానికి రెడీగా ఉంటారు ఎంతోమంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండింటి కాంబినేషన్ ఇష్టపడేవారి సంఖ్య అధికంగానే ఉంది. కానీ పోషకాహార నిపుణులు మాత్రం టీ, కాఫీతో రస్కులను, బిస్కెట్లను తినవద్దని చెబుతున్నారు. అలా తినడం వల్ల ఆరోగ్యం పై కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని, అందుకే ఆ కాంబినేషన్ ను దూరం పెట్టమని వివరిస్తున్నారు.
ఏదైనా ఆహార పదార్థం ఆరోగ్యానికి మేలు చేయాలన్నా, కీడు చేయాలన్నా అది తయారయ్యే విధానం పైనే అధికంగా ఆధారపడి ఉంటుంది. ముందుగా రస్కులను ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటే, అవి ఎందుకు ఆరోగ్యానికి హానికరమో అర్థం చేసుకోవచ్చు. రస్కులను బ్రెడ్ తో తయారు చేస్తారు. బ్రెడ్ ని తయారు చేశాక వాటిని మళ్లీ కాల్చి, క్రిస్పీగా మారేవరకు కాలుస్తూనే ఉంటారు. అవి బంగారు రంగులో క్రిస్పీగా మారాక రస్కులుగా రూపాంతరం చెందుతాయి. అంటే రెండుసార్లు బేకింగ్ ప్రక్రియను ఇవి ఎదుర్కొంటాయి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. బ్రెడ్ కు మరో రూపమే రస్క్. వీటిని పాలల్లో ముంచినప్పుడు మెత్తబడి సులువుగా తినేందుకు వీలుగా అవుతాయి.
రస్కుల తయారీలో అధికంగా కాల్చడమే ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇది చాలా తక్కువ పోషక విలువలను అందిస్తాయి. వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఒక్కోరస్కులో 40 నుంచి 60 కేలరీలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రెడ్ ను శుద్ధి చేసిన పిండితో తయారుచేస్తారు. అంటే రస్కులు కూడా శుద్ధి చేసిన తిండి పదార్థాలను అధికంగా కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వీటిలో డైటరీ ఫైబర్ కూడా ఉండదు. శుద్ధిచేసిన పిండితో తయారైన ఈ రస్క్ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోయి, టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం అధికంగా మారుతుంది.
టీతోపాటు వీటిని జతగా తినడం వల్ల ... టీ వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య శాతాన్ని కూడా ఇవి తగ్గించేస్తాయి. రస్కులలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకలి పెరిగిపోతుంది. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి టీతో పాటు రస్కులు తినడం మానేయాలి. అప్పుడే టీ లోని పోషకాలు శరీరానికి అందుతాయి.
Also read: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యూషన్లో ఫ్రెంచ్ ఫ్రైస్‌ను పది సెకన్లలో కనిపెట్టండి
Also read: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ హెర్బల్ టీ తాగడం అలవాటు చేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.