Dry Fruits Recipe: డ్రైఫ్రూట్స్ హల్వా... నిండుగా పోషకాలు, తింటే ఎంతో బలం
ఏది తిన్నా శరీరానికి శక్తి అందేలా, పోషకాలు అందేలా ఉండాలి.
ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఎండు అంజీర్, కిస్‌మిస్ , బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్ వీటన్నింటినీ డ్రైఫ్రూట్స్ ప్యాక్‌గా పిలుస్తారు. వీటిని తింటే శరీరానికి కావల్సిన రోగనిరోధక శక్త అందుతుంది. ఎన్నో కీలక పోషకాలు వీటి ద్వారా అందుతాయి. ఓ గుప్పెడు ఎండు ఫలాలు తిన్నా చాలు శరీరానికి వ్యాధులు నుంచి తట్టుకునే శక్తి వస్తుంది. కరోనా రెచ్చిపోతున్న వేళ రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం. వీటిలో వాల్ నట్స్ తినడం మెదడుకు మేలు కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు కూడా రావు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుప్పెడు డ్రైఫ్రూట్ తినే బదులు ఇలా హల్వా చేసుకుని ఇంకా టేస్టీగా ఉంటుంది. గుప్పెడు ఎండు ఫలాలు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా శరీరానికి అందుతాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు ఎదగకుండా ఇవి అడ్డుకుంటాయి. కాల్షియం, ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. పిల్లలు చాలా మంది ఎండు ఫలాలు తినేందుకు ఇష్టపడరు. వాటిలో హల్వా చేసి పెడితే ఇష్టం తినే అవకాశం ఉంది.
డ్రై ప్రూట్స్ హల్వా ఎలా చేయాలంటే...
కావాల్సిన పదార్థాలు
ఖర్జూరాలు - ఒక కప్పు
ఎండు అంజీర్ పండ్లు - ఒక కప్పు
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ - ఒక కప్పు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
పాలు - ఒక టేబుల్ స్పూను
ఇలా చేయండి...
ఖర్జూరాల్లోని పిక్కలను తీసి పడేసి చాలా సన్నగా తురమాలి. అలాగే అంజీర్, పిస్తా, జీడిపప్పు, బాదం పలుకులు, వాల్‌నట్స్ కూడా తురుముకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పాలు, కాస్త నెయ్యి వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలి. నెయ్యి వేసి అది వేడెక్కాక మిక్సీ చేసుకున్న ఎండు ఫలాల మిశ్రమాన్ని వేయాలి. ఓ మూడు నిమిషాల పాటూ వేయించాలి. వేయించినంతసేపు కలుపుతూనే ఉండాలి. మంట చాలా చిన్నగా పెట్టుకోవాలి. లేకుండా మాడిపోయే అవకాశం ఉంది. స్టవ్ కట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే చలికాలంలో చాలా హాయిగా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది. బావుంది కదా అని అతిగా తినకూడదు. అవన్నీ చాలా శక్తిమంతమైనవి. అధికమోతాదులో తినడం వల్ల అరుగుదల సమస్య రావచ్చు.
Also read: కదలకుండా గంటలుగంటలు టీవీ చూసే వారికి హెచ్చరిక... ఆ సైలెంట్ కిల్లర్ చంపేయచ్చు
Also read: వంటగదిలో ఈ తప్పులు మీరు చేస్తున్నారా... ఆరోగ్యానికి ముప్పు తప్పదు