Dry Fruit Fried Modak : వినాయక చవితి 2025 స్పెషల్ టేస్టీ మోదకాలు.. డ్రై ఫ్రూట్స్‌తో క్రంచీగా ఎలా చేసుకోవాలో తెలుసా?
Dry Fruit Fried Modak Recipe : వినాయక చవితి సమయంలో గణేశుడికి ఇష్టమైన వంటకాలు చేస్తారు. వాటిలో భాగంగా మోదకాలు చేయాలనుకుంటే క్రంచీగా, డ్రై ఫ్రూట్స్‌తో చేసే మోదకాలు చేసి పెట్టవచ్చు.

Vinayaka Chavithi Special Modak Recipe : మోదకాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టమని చెప్తారు. మరి ఈ గణేశ్ చతుర్థికి మీరు వినాయకుడికి మోదకాలు పెట్టాలనుకుంటే ఇక్కడ ఓ స్పెషల్, ఇంట్రెస్టింగ్ రెసిపీ ఉంది. డ్రై ఫ్రూట్స్‌తో క్రంచీగా, టేస్టీగా చేసుకోగలిగే మోదకాలు ఏంటో.. వాటిని ఏవిధంగా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చేసుకుంటే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
పిండి కోసం
గోధుమ పిండి - 2 కప్పులు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - ½ టీస్పూన్
అవసరమైనంత నీరు
స్టఫింగ్ కోసం
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు ముక్కలు -1 టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష - 1 టేబుల్ స్పూన్
బాదం ముక్కలు - 1 టేబుల్ స్పూన్
గసగసాలు - ½ టేబుల్ స్పూన్
తురిమిన తాజా కొబ్బరి - 2 కప్పులు
బెల్లం - ½ కప్పు
నూనె - వేయించేందుకు సరిపడేంత
తయారీ విధానం
ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో గోధుమ పిండి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం దానిలో నెయ్యి వేసి కలపాలి. పిండిని మెత్తగా తయారు చేసేందుకు నీటిని వేసి కలపండి. ఉండలు లేకుండా మెత్తగా కలిపిన తర్వాత దానిని తడి గుడ్డతో కప్పి పక్కన పెట్టండి. 5 నుంచి 10 నిమిషాలు ఉంచితే చాలు. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక పాన్ స్టౌవ్ పెట్టి వేడి చేయాలి. దానిలో నెయ్యి వేసి కాగిన తర్వాత దానిలో జీడిపప్పు ముక్కలు, ఎండుద్రాక్ష, బాదం ముక్కలు వేయించుకోవాలి. కాస్త వేసిన తర్వాత గసగసాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాజాగా తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి.
కొబ్బరి కాస్త వేగి మంచి సువాసన వస్తోన్నప్పుడు దానిలో తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగేవరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగి.. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్ని దగ్గరగా అవుతున్నప్పుడు స్టౌవ్ ఆపేయాలి. గట్టి పాకంగా కాకుండా.. ఉండలుగా చుట్టుకోగలిగేంత దగ్గరగా ఉంటే చాలు. ఇప్పుడు మోదకాల కోసం స్టఫ్ రెడీ అయిపోంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసి మరోసారి బాగా కలిపి.. చిన్న భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దానిని చిన్న చపాతీగా ఒత్తుకోవాలి. అనంతరం దానిని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ స్టఫ్ పెట్టాలి.
మీ దగ్గర మోదక్స్ చేసుకునే పరికరం ఉంటే ఓకే. లేదంటే మీరే వాటిని చేతులతో మోదకాల మాదిరిగా చుట్టుకోండి. స్టఫ్ బయటకి రాకుండా వాటిని మోదకాలుగా చేసుకోవాలి. అలాగే చపాతీని చేసుకునేప్పుడు మరీ పలుచగా చేసుకోకూడదు. అలా చేసుకుంటే స్టఫ్ బయటకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం పిండితో మోదకాలు చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేసి తర్వాత వీటిని వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని దించేయాలి. అంతే టేస్టీ, క్రంచీ డ్రై ఫ్రూట్స్ మోదకాలు రెడీ. వీటిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టేందుకు, అలాగే ఇంట్లో అందరూ తినేందుకు కూడా బెస్ట్‌గా ఉంటాయి.






















