Excessive Screen Time : మొబైల్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీ కళ్లకు ఆ సమస్యలు తప్పవు
ప్రస్తుతం వస్తున్న కంటి సమస్యలకు ఎక్కువగా స్క్రీన్ సమయమే ప్రధానకారణం అంటున్నారు.
Excessive Screen Time : కుర్రాళ్లం కదా అంకుల్. మాకు అంత తొందరగా నిద్ర రాదు అని ఓ సినిమాలో హీరో చెప్తాడు. కానీ ఇప్పుడు కుర్రాళ్లకే కాదు.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి నిద్రరావట్లేదు. దీనివల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కంటి సంబంధించి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అధిక సమయం స్క్రీన్ చూసేందుకు వెచ్చించేవారి కళ్లు త్వరగా పొడిబారడానికి కారణమవుతున్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.
కళ్లు తగినంత నీటిని ఉత్పత్తి చేయక పొడి కళ్లకు దారి తీస్తుంది. దీనివల్ల మీ కంటిలో అసౌకర్యంగా ఉండి దృష్టి సమస్యలు ఏర్పడవచ్చు. దీనివల్ల కళ్లలో నొప్పి, మంట, దురద వంటి అనేక సమస్యలు వస్తాయి. స్క్రీన్ ఎక్కువ సమయం చూడడం వల్ల కళ్లు పొడిబారుతున్న వారి సంఖ్య రోజు రోజూకు పెరుగుతుంది. అయితే పొడి కంటి వ్యాధి చాలా సాధారణమైనదేనని 2030 నాటికి దీని ప్రాబల్యం దాదాపు 40 శాతం ఎక్కువగా ఉంటుందని 2019లో ఓ జర్నల్ ప్రచురించింది. అయితే వయసుతో పాటు వచ్చే ఈ సమస్య ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతీ యువకులు బాధితులవుతున్నారు.
కళ్లు పొడిబారడానికి కారణాలు
కళ్లు పొడిబారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. తక్కువ నీరు తాగడం, మొబైల్ లేదా టీవీ స్క్రీన్ ఎక్కువగా చూడడం, సరైన హెల్తీ లైఫ్ స్టైల్ పాటించకపోవడం, చాలాసేపు ఏసీలో కూర్చోవడం వంటి కారణాల వల్ల కూడా కళ్లు పొడిబారతాయి. కాబట్టి మొబైల్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల ముందు తక్కువ సమయం గడపండి. పుస్తకాలు చదివేటప్పుడు విరామం తీసుకోండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి వైద్య సమస్యలు కూడా కళ్లు పొడిబారేలా చేస్తాయి. డ్రగ్స్, యాంటిడిప్రెసెంట్స్ కూడా కళ్లు పొడిబారడానికి కారణమవుతాయి.
కళ్లు పొడిబారడం వల్ల కలిగే లక్షణాలు
చికాకు ఎక్కువగా ఉంటుంది. కంటిలో ఏదైన గీత, డస్ట్ ఉన్న అనుభూతి ఉంటుంది. ఇది దురదను కలిగిస్తుంది. కళ్లు ఎర్రగా మారిపోతాయి. చికాకు, వాపు వల్ల కళ్లు ఎర్రగా మారుతాయి. ఇది కళ్ల మంటలకు దారితీస్తుంది. కళ్లు పొడిగా ఉన్నప్పుడు కంటి నుంచి నీరు ఎక్కువగా కారుతుంటుంది. కంటి నుంచి నీరు రాకపోవడం వల్ల ఈ సమస్య వస్తే.. ఈ సమస్య వల్ల కంటినుంచి నీరు కారుతూ ఉంటుంది. దృష్టి అస్పష్టంగా మారుతుంది. ప్రత్యేకించి స్క్రీన్ ఎక్కువగా చూసేవారికి, ఎక్కువ చదివే వారిలో ఈ సమస్య ఉంటుంది.
దీనికి చికిత్స ఉందా?
పొడిబారిన కళ్లను యథాస్థికి తీసుకురావడానికి కంటిలో డ్రాప్స్ వేస్తారు. ఇది మీకు ఉపశమనం అందించి కంటిలోని సహజమైన కన్నీళ్లు వచ్చేలా ప్రోత్సాహిస్తుంది. వైద్యుడు సూచించిన మందులు మీకు మంచి ఫలితాన్నిస్తాయి. అయితే ఎన్ని మెడిసిన్స్ వాడినా జీవనశైలిలో కొన్ని మార్పులు కచ్చితంగా చేయాలి. స్క్రీన్ని ఉపయోగిస్తున్నప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోండి. స్క్రీన్ ఉపయోగించేటప్పుడు యాంటిక్ లేయర్ కలిగిన కళ్లజోడు వినియోగిస్తే మంచిది.
దుమ్ము, గాలి నుంచి మీ కళ్లను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. మీ కళ్లను మీరు కాపాడుకున్నావారు అవుతారు. కంటికి సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉండడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కనురెప్పలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి మూసుకుపోయిన కన్నీటి గ్రంథులను నివారించడంలో సహాయం చేస్తుంది.
Also Read : వేన్నీళ్లు తాగుతున్నారా? ఈ ప్రమాదం తప్పదట, జాగ్రత్త!