Water: నీళ్లు తక్కువ తాగితేనే కాదు, అధికంగా తాగినా ఈ సమస్యలు తప్పవు
శరీరానికి అత్యవసరమైన వాటిలో నీళ్లు ఒకటి. కానీ చాలా మందికి ఎంత నీళ్లు తాగాలో కూడా తెలియవు.
నీళ్లు తగినంత తాగకపోతే ఎన్నో ఆరోగ్యసమస్యలు చుట్టుముడతాయి. వెంటనే డీ హైడ్రేషన్ బారిన పడతాం. తలనొప్పి వచ్చేస్తుంది. అవయవాల పనితీరు మారిపోతుంది. ఊరికే అలిసిపోతాం. ఏ పని చేయలేం. అందుకే రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగమని సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే కొంతమంది అతిగా నీళ్లు తాగడం కూడా చేస్తారు. చర్మం మెరిసిపోతుందనే నమ్మకం వారిది. నీళ్లు చర్మాన్ని శుధ్ది చేసి మెరుపును సంతరించుకునేలా చేస్తుందన్నది నిజమే, కానీ అతిగా తాగడం వల్ల మాత్రం అనర్థమే తప్ప, లాభం లేదు. నీళ్లు అతిగా తాగడం వల్ల శరీరం ఓవర్‌హైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలా జరగడం వల్ల కూడా శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.
జరిగే అనర్థాలివే
అతిగా నీళ్లు తాగడం వల్ల వాటిని వడపోయలేక కిడ్నీలు అలిసిపోతాయి. అంత నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కిడ్నీలకు ఉండదు. దీంతో ఆ నీరంతా రక్తంలో కలిసిపోతుంది. దీంతో రక్తం పలుచబడే అవకాశం ఉంది. అలాగే రక్తంలో ఉండే సోడియం, ఎలక్ట్రోలైట్లు పలుచబడిపోతాయి. అవి సమర్థవంతంగా పనిచేయలేవు. సోడియం పలుబచడడం వల్ల రక్త కణాల్లోకి నీరు చేరి ఉబ్బిపోతాయి. దీంతో రక్తపోటు పెరిగిపోతుంది. ఇది మరీ డేంజర్. హఠాత్తుగా తల తిరగడం, గుండెలో ఇబ్బందిగా అనిపించడం, డయేరియా వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. ఒత్తిడి అధికం పడుతుంది. చురుగ్గా ఉండకుండా నిత్యం మగతగా ఉంటారు. మోతాదుకు మించి తీసుకునే నీటి వల్ల మెదడు పనితీరు కూడా మారిపోతుంది. ఒక్కోసారి కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు.
నీరు సరిపడినంత తాగితే...
నీరు తక్కువ కాకుండా, ఎక్కువ కాకుండా తాగితే శరీరంలో చక్కగా పనిచేస్తుంది. శరీరంలోని వేడిని బయటికి పంపించే పని నీటిదే. తగినంత నీరు తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిళ్లు త్వరగా పోతాయి. మానసిక ఆందోళనలు తగ్గుతాయి. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా పనిచేస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉండదు. రక్తపోటు కంట్రోల్‌లోనే ఉంటుంది. మంచినీళ్లు తగినన్ని తాగడం వల్ల ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దాహం వేసే వరకు వేచి ఉండకుండా నీళ్లు తాగి గంటన్నర దాటగానే గ్లాసుడు నీళ్లు తాగేయండి. లేదా గంటకోసారి అరగ్లాసు నీళ్లు తాగుతూ ఉన్నా ఫర్వాలేదు.
Also read: పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌గా బీట్‌రూట్ ఇడ్లీ, ఇన్‌స్టెంట్ రెసిపీ ఇదిగో
Also read: ముద్దు పెట్టుకునే సంస్కృతి ఏ కాలంలో మొదలైంది? ముద్దుకు అంత ప్రాధాన్యత ఎందుకు?