Why Do We Kiss: ముద్దు పెట్టుకునే సంస్కృతి ఏ కాలంలో మొదలైంది? ముద్దుకు అంత ప్రాధాన్యత ఎందుకు?
ముద్దుకు జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముద్దు అనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
ముద్దు పేరు చెబితే ముడుచుకుపోతారు చాలా మంది, అదేదో పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తారు. నిజానికి ముద్దుకు మానసిక ఆనందానికి, ప్రశాంతతకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మనసులోని ప్రేమను, ఆపేక్షను ఎదుటివారికి పంచే ఓ రియాక్షన్ గా ముద్దును వర్ణిస్తారు. ముద్దు అంటే రెండు బంధాలను మరింత దగ్గర చేసే చక్కటి స్పర్శ. ఆ బంధం... తల్లీబిడ్డలు కావచ్చు, తండ్రికూతుళ్లు కావచ్చు, అక్కా చెల్లెళ్లు కావచ్చు,భార్యా భర్తలు, ప్రేమికులు... ఇలా ఎవరైనా కావచ్చు. ముద్దు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అలెగ్జాండర్ గుర్తొస్తారు ఎక్కువ మందికి. దానికి కారణం అలెగ్జాండర్ తన దండయాత్రలో భాగంగా అన్ని రాజ్యాలు తిరుగుతూ పాశ్చాత్య ముద్దులను విశ్వవ్యాప్తం చేశారని చెప్పుకుంటారు. ముద్దు ప్రస్తావన మహాభారతంలో కూడా ఉందని అంటారు చరిత్రకారులు.
ముద్దు ఇలానే పుట్టిందా?
ముద్దు ఏదో చేయకూడని పనిలా చూడొద్దని చెబుతారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఒక సాధారణ ముద్దు ప్రేమ, సంరక్షణ, ప్రశంసల భావోద్వేగాలను చూపించే ఉత్తమ మార్గమని వివరిస్తున్నారు. పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం ముద్దు చరిత్ర ఈనాటిది కాదు, మిలియన్ ఏళ్ల క్రితమే మొదలైంది. నోటితో నోటికి ఆహారాన్ని తినిపించే క్రమంలో ఇది మొదలై ఉంటుందని భావిస్తున్నారు. పూర్వం తల్లులు ఆహారాన్ని నమిలి మెత్తగా అయ్యేలా చేసి పిల్లల నోటికి, తమ నోటితోనే అందించే వారని, పెదవులకు పెదవులు తగిలి వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం పొంగేదని, అప్పట్నించే తల్లి తన బిడ్డను ముద్దాడడం మొదలై ఉంటుందని భావిస్తున్నారు చరిత్రకారులు.
వేద సంస్కృత సాహిత్యంలోని ప్రధాన గ్రంథాల్లోనూ ముద్దుల ప్రస్తావన ఉంది. 1500 BC కాలంలో వారు ముక్కును ముక్కుతో రుద్దడం ద్వారా తమ ప్రేమను పంచుకునేవారని, అలా పెదవులపైకి ముద్దు జారి ఉండొచ్చని కూడా టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన మానవ శాస్త్రవేత్త వాన్ బ్రయంట్ భావిస్తున్నారు. ముద్దు సంస్కృతి మొదలైంది ఎక్కడా? అని అడిగితే ఎక్కువ మంది రోమ్ వైపే చూస్తారు. వేల ఏళ్ల క్రితం అక్కడ ముద్దు ప్రభంజనం మొదలైందని అంటారు.
ఆనందం రెట్టింపు
ముద్దు పెట్టుకునే సమయంలో పెదవుల నుంచి పుట్టే ప్రేరణ మన మెదడుకు అనేక సానుకూల తరంగాలను పంపుతుంది. ఆ తరంగాలు ప్రేమ, సురక్షితంగా ఉన్నామన్నా భావనలను పెంచుతాయి. ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలవుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి పోతుంది. రక్తపోటు సమస్థాయిలో ఉంటుంది. సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోషాన్ని పెంచే రసాయనాలు విడుదలవుతాయి. పిల్లలకు తల్లిదండ్రులు పెట్టే ముద్దు వారిలో వెయ్యి ఏనుగుల బలాన్ని పెంచుతుంది.
Also read: తనను తానే పెళ్లి చేసుకుని కొత్త ట్రెండ్ సెట్ చేసిన యువతి, అందుకు కారణాలు ఇలా చెబుతోంది
Also read: మాంసాహారం తినేవారికి షాకింగ్ న్యూస్, అలా తింటే చూపు మసకబారే అవకాశం, చెబుతున్న అంతర్జాతీయ అధ్యయనం