Foods To Avoid Before Sleeping: డిన్నర్లో ఆ హెల్తీ ఫుడ్స్ తీసుకున్నా.. మీకు నిద్ర దూరమవుతుంది
Unhealthy Habits : మీకు నిద్ర సమస్య ఉందా? అయితే రాత్రుళ్లు పడుకునే ముందు కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి మీకు నిద్రను మరింత దూరం చేస్తాయి.
Lack of Sleep : రోజంతా కష్టపడితే రాత్రుళ్లు సుఖంగా నిద్ర పడుతుంది అంటారు. అయితే కొన్ని కారణాల వల్ల నిద్ర దూరం అవుతూ ఉంటుంది. మానసిక, శారీరక రుగ్మతలు నిద్రను దూరం చేస్తాయి. అయితే మీకు తెలుసా? కొన్ని ఫుడ్స్ కూడా రాత్రుళ్లు నిద్ర రాకుండా చేస్తాయట. అందుకే పడుకునే ముందు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అవి ఆరోగ్యానికి మంచివే అయినా రాత్రి సమయంలో తీసుకోవడం ఉత్తమం కాదు అంటున్నారు. ఇంతకీ ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.. వాటివల్ల నిద్రకు కలిగే భంగం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రుళ్లు మంచినిద్ర కావాలంటే.. మీరు తినే భోజనంపై కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణం కానీ, చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండేవాటిని.. మసాలాతో కూడిన వంటకాలకు దూరంగా ఉండాలి. గుండెల్లో మంటను పెంచే వాటిని తగ్గించాలి. వీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్, డ్రింక్స్‌ను కూడా దూరం చేయాలి అంటున్నారు. అవేంటంటే..
ఆల్కహాల్
మందు తాగితే మంచి నిద్ర వస్తుందనే అపోహా మీలో ఉందా? అయితే మీరు అనుకున్నది పొరపాటు. ఆల్కహాల్ మీకు నిద్రమత్తును కలిగిస్తుంది. కానీ.. రాత్రి సమయంలో మీకు వచ్చే సహజమైన నిద్రను అది దూరం చేస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాను, గురకను పెంచుతుంది. అంతేకాకుండా కడుపులో యాసిడ్ ప్రభావాన్ని పెంచుతుంది.
హెవీ ఫుడ్స్
రాత్రుళ్లు కడుపు హెవీగా ఫీల్ అయ్యే ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది. లేదంటే అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొవ్వు, చీజ్, ఫ్రై చేసిన ఫుడ్స్ అజీర్ణానికి దారితీస్తాయి. ఇవి రాత్రుళ్లు నిద్రపోకుండా చేస్తాయి.
వాటర్ కంటెంట్ ఫుడ్స్
అధిక నీటిని కలిగిన ఫుడ్ ఆరోగ్యానికి మంచివి. కానీ రాత్రుళ్లు వాటిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు బాత్రూమ్కి ఎక్కువ లేవాల్సి వస్తుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. పుచ్చకాయ, కీరదోస వంటి వాటిని రాత్రుళ్లు తీసుకోకపోవడమే మంచిది.
కెఫిన్
కెఫిన్ ఫుడ్స్ పగలు తీసుకోవడం కూడా మంచిది కాదు. అలాంటి రాత్రి అంటే మీ ఆరోగ్యాన్ని మీరే చేజేతులారా పాడు చేసుకున్నట్లు. ఇవే కాకుండా సోడా, స్వీట్స్, ఐస్ క్రీమ్‌లు వంటివి తీసుకోకపోవడమే మంచిది. ఇవి మీకు రాత్రుళ్లు తినడం ఆహ్లాదాన్ని కలిగించినా.. క్రమంగా నిద్రను మాత్రం దూరం చేస్తాయి.
స్పైసీ ఫుడ్స్
మసాలా వంటకాలు రాత్రిపూట తీసుకుంటే అవి గుండెల్లో మంటను పెంచుతాయి. అయితే ఇవి కేవలం గుండె సమస్యలనే కాకుండా నిద్రను కూడా బాగా ప్రభావితం చేస్తుంది. మసాలా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల మీకు త్వరగా నిద్రపట్టదు. కాబట్టి రాత్రి భోజనానికి బదులుగా అల్పాహారం తీసుకోవచ్చు.
ఇవే కాకుండా టొమాటోలు, సోయా సాస్, వంకాయ, రెడ్ వైన్, చీజ్ వంటి ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మంచిది. సిట్రస్ జ్యూస్, పచ్చి ఉల్లిపాయలు వంటివి గుండెల్లో మంటను పెంచి నిద్రకు భంగం కలిగిస్తాయి. డ్రై ఫ్రూట్స్, బీన్స్, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి ఒత్తిడి పెంచుతాయి. ఫైబర్ కలిగిన పండ్లు, కూరగాయలు శరీరానికి మంచివి కానీ.. రాత్రి నిద్రకు మంచివి కాదు.