Motion Sickness: ప్రయాణంలో వాంతులు, వికారం వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
మోషన్ సిక్‌నెస్ చెప్పుకోవడానికి చిన్నసమస్యే, కానీ అది అనుభవించేవారికి తెలుస్తుంది.
చాలామందిని వేధించే ఆరోగ్య సమస్య ఇది. కారు, బస్సు, విమానం... వీటిలో ప్రయాణిస్తున్నప్పుడే కడుపులో తిప్పినట్టు, వికారంగా, వాంతులు వచ్చేలా అవుతుంది. దీన్నే ‘మోషన్ సిక్‌నెస్’అంటారు. ఈ సమస్య అందరికీ ఉండదు. కొందరు బస్సెక్కగానే హాయిగా నిద్రపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఆందోళనగా ఎప్పుడు వాంతులవుతాయో అన్న భయంతో ఉంటారు.
ఎందుకొస్తుంది?
కొందరిలోనే ఈ సమస్య ఎందుకొస్తుందో తెలియదు కానీ, మెదడు వల్లే ఇది కలుగుతుందని మాత్రం చెప్పగలం. మోషన్ సెన్సింగ్ అవయవాలైన కళ్లు, చెవులు, కండరాలు, కీళ్ల నుంచి మెదడు సిగ్నల్స్ అందుకుంటూనే ఉంటుంది. ఈ అవయవాలలో కళ్లు, చెవులు ఒకేలాంటి సమాచారాన్ని మెదడుకు పంపకుండా వైరుధ్యమైన సిగ్నల్స్ మెదడుకు పంపినప్పుడు మీరు నిశ్చలంగా ఉన్నారా లేక కదులుతున్నారో తెలియక మెదడు తికమకపడుతుంది. మీ మెదడు అయోమయ స్థితి వల్ల శరీరం అనారోగ్యంగా అనిపిస్తుంది. కడుపుతో తిప్పినట్టు, వికారంగా అయిపోతారు. కొందరిలో వాంతులు కూడా అవుతాయి.
నయం చేయగలమా?
మోషన్ సిక్‌నెస్ అనేది నయం చేయలేని ఒక ఆరోగ్యస్థితి. అది కేవలం ప్రయాణంలోనే కలిగి, కాసేపటి తరువాత పోతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా నయం చేసే మందుల్లేవు. కానీ తీవ్రతను తగ్గించే మందులు మాత్రం అందుబాటులో ఉన్నాయి.
ఏ మందులు వాడొచ్చు?
జర్నీలో మీకు మోషన్ సిక్‌నెస్ మరీ అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించవచ్చు. ప్రయాణం ప్రారంభించడానికి ముందే వేసుకోవాల్సిన కొన్ని మందులను సూచిస్తారు. సాధారణంగా వైద్యులు సైక్లిజైన్, డైమెన్ హైడ్రినేట్ అనే మందులను సూచిస్తారు.
Also read: దానిమ్మ గింజల్లోనే కాదు దాని తొక్కలో కూడా ఎన్నో సుగుణాలు, పొడి చేసి ఇలా వాడుకోండి
కొన్ని చిట్కాలు
1. మోషన్ సిక్‌నెస్ సమస్య ఉన్నవాళ్లు కారులో కూర్చునే కన్నా కారుని డ్రైవ్ చేసేందుకు (డ్రైవింగ్ వస్తే) సిద్ధమవ్వాలి. ఎందుకంటే డ్రైవ్ చేసేవారికి మోషన్ సిక్‌నెస్ కలగదు. కళ్లు, చెవులు ఒకేలాంటి సమాచారాన్ని మెదడుకు పంపుతాయి.
2. మోషన్ సిక్‌నెస్ రాకుండా ఉండాలంటే మీ ముఖాన్ని మీరు ప్రయాణిస్తున్న దిశ వైపే తిన్నగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ చూపు, చెవులు వినే శబ్ధాలకు ఉండే సంబంధం సిగ్నల్స్ ద్వారా మీ మెదకుడు చేరాలి. లేకుంటే మెదడు అయోమయంలో పడి పొట్టలో వికారం మొదలవుతుంది. కారు ముందు సీట్లో కూర్చుంటే కొంతమేరకు పరిస్థితి మెరుగవుతుంది. కారు ముందు సీట్లో కూర్చుంటే మోషన్ సిక్ నెస్ తక్కువగా కలిగి అవకాశం ఉంది.
3. ఏసీ బస్సులు, ఏసీ కారుల్లో మరీ వికారం ఎక్కువవుతుంది. కార్లలో వెళ్లే వారు వీలైతే ఏసీ ఆపేసి కిటికీలు తెరిచి తాజా గాలి వచ్చేలా చూసుకోండి.
4. ప్రయాణం మొదలుపెట్టే ముందు ఆహారం చాలా తక్కువగా తీసుకోండి. ముఖ్యంగా మసాలా ఆహారం, నూనె నిండి పదార్థాలు తినకండి. వీటి వల్ల వాంతులయ్యే అవకాశం ఉంది.
5. ప్రయాణానికి బయల్దేరే ముందు, మధ్యలో కాఫీలు, సోడాల్లాంటివి తాగకండి. నీళ్లు మాత్రమే తాగండి.
6. నిమ్మకాయను దగ్గర పెట్టుకోండి. కడుపు తిప్పినట్టు అనిపించినప్పుడల్లా దాని వాసనను పీల్చుకోండి.
7. పుస్తకం చదవడం వంటివి చేయకండి. మోషన్ సిక్‌నెస్ మరీ పెరిగిపోతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: అనుమానాస్పదంగా తిరుగుతోందని కోడిని అరెస్టు చేసిన అమెరికా పోలీసులు