Urine: యూరిన్ ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా, అది ఎంత ప్రమాదమో తెలుసా?
చాలా మంది ఎక్కువ కాలం పాటూ యూరిన్ ఆపుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదం.
మన శరీరంలోని ప్రతి అవయవం కొన్ని నిర్ధిష్ట విధులను నిర్వహిస్తుంది. ఆహారం జీర్ణం చేయడం జీర్ణ వ్యవస్థ పని అయితే, అందులోని వ్యర్థాలను వడపోసి బయటికి పంపించడం కిడ్నీల పని. వాటి పనికి ఆటంకం కలిగిస్తే మనకే చాలా ప్రమాదం. చాలా మంది మూత్రాశయం నిండినా కూడా విసర్జన చేయకుండా అలా అదిమిపట్టి ఉంచుతారు. మన మూత్రాశయం కేవలం రెండు కప్పుల మూత్రాన్ని మాత్రమే నిల్వ చేయగలదు. ప్రతి మూడు గంటలకోసారి కచ్చితంగా విసర్జన చేయాల్సిందే.మెదడు మూత్ర విసర్జన చేయమని సిగ్నల్స్ పంపిస్తున్నా లెక్క చేయరు. అలా తరచూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
మూత్రాశయం బలహీనపడుతుంది
అధిక సమయం పాటూ మూత్రాన్ని అదిమి పట్టి ఉంచడం వల్ల మూత్రాశయంలో సాగినట్టు అవుతుంది. బ్లాడర్ నిండుతున్న కొద్దీ అది పొంగినట్టు తయారవుతుంది. ఇది మూత్రవిసర్జన ప్రక్రియలో ముఖ్యమైన సంకోచం, వ్యాకోచం వంటి పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. సహజ పనితీరుకు భంగం కలిగించడం శరీరంపై ప్రభావం చూపిస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్లు
మూత్రవిసర్జన చేయకుండా ఆపుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఎక్కువ. మూత్రం ఎక్కువ కాలం పాటూ బ్లాడర్లో ఉండడం వల్ల బ్యాక్టిరియా చేరుతుంది. బ్యాక్టిరియా పెరిగేకొద్దీ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. ఇది భరించలేని నొప్పికి కారణమవుతుంది.
కండరాల నొప్పి
మూత్రం ఆపుకోవడం వల్ల పొట్ట నొప్పి కలుగుతుంది. కండరాలు కూడా తమ శక్తిని కోల్పోతాయి. మూత్రాశయం అసాధారణంగా పనిచేయడం మొదలవుతుంది.
నియంత్రణ ఉండదు
తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమో, తరచుగా మూత్రం విసర్జించడం కూడా అంతే ప్రధానం. ఇలా ఆపుకోవడం తరచూ చేస్తుంటే మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది.అలా జరిగితే పొత్తి కడుపుతో మూత్రంతో నిండిపోతుంది. సమస్య పెరిగితే మూత్రాశయానికి శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి ఆపుకోకుండా ఎప్పటికప్పుడు పని కానిస్తే మంచిది.
కిడ్నీలో రాళ్లు
కిడ్నీలో ఖనిజాలు, కెమికల్స్ పేరుకుపోవడం వల్ల రాళ్లు ఏర్పడతాయి. రాళ్ల పరిమాణం చిన్నగా ఉంటే తొలగించడం సులువవుతుంది. సైజు పెరిగితే మాత్రం నొప్పి అధికమవుతుంది. మూత్రాన్ని నియంత్రించడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.మూత్రాన్ని ఆపుకుని సమస్యలు తెచ్చుకోవడం కన్నా ప్రతి మూడు గంటలకోసారి విసర్జనకు వెళితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
Also read: గుండె నీరసపడుతోంది, ఉక్కులా మారాలంటే ఈ ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
Also read: పొట్టలో టీ గ్లాసు, ఎలా మింగేశావయ్య బాబూ అంటూ తల పట్టుకున్న వైద్యులు