వేడి నీళ్లతో స్నానం ప్రమాదకరమా? ఈ సమస్యలు వస్తాయ్, జాగ్రత్త!
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం సాధారణమే. కానీ, అదే పనిగా బాగా మరిగిన నీళ్లలో స్నానం చేస్తుంటే మాత్రం తప్పకుండా ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.
చలికాలం ఉదయాన్నే స్నానం చేయాలంటే ఎంత బద్దకంగా ఉంటుందో మీకో తెలిసిందే. పైగా చల్లచల్లని నీళ్లతో స్నానం చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. అందుకే చాలామంది వేడి నీళ్లతో స్నానం చెయ్యడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వేడి నీటి స్నానం బద్దకాన్ని వదిలిస్తుంది. కొంచెం ఉత్సాహాన్ని కూడా తెస్తుంది. కానీ, కొందరు వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరు. బాగా మరిగిన నీళ్లతో స్నానం చేస్తారు. సీజన్‌తో సంబంధం లేకుండా మరిగిన వేడి నీళ్ల స్నానం చేయడం వారికి అలవాటు. మరి, అది ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఆ అలవాటు మీకు కూడా ఉందా? అయితే, ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే. బాగా మరిగిన నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బాగా వేడెక్కిన నీళ్లతో కాకుండా గోరు వెచ్చని నీటితోనైనా స్నానం చేయాలని తెలుపుతున్నారు. వేడి నీటి స్నానం వల్ల ఈ కింది సమస్యలు తప్పవని అంటున్నారు. అవేంటో చూడండి.
మొటిమలు
వేడి నీళ్ల వల్ల చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది. చర్మం మీద ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. అది కూడా వేడికి నశించిపోతుంది. మొటిమల సమస్య ఉన్న వారిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చర్మం మీద ఉండే మంచి బ్యాక్టీరియా చర్మాన్ని తేమగా ఉంచడంలో తోడ్పడుతుంది. చర్మంలోపల ఉన్న మురికిని కూడా తొలగిస్తుంది. అది లేకపోతే చర్మ కణాలు తేమ లేకపోవడం వల్ల పెళుసుబారి విరిగిపోతాయి.
పొడి బారి చర్మం సెన్సిటివ్ గా మారుతుంది
స్నానానికి ఎక్కువ సమయం తీసుకున్నా లేక ఎక్కువ వేడి నీటితో స్నానం చేసినా చర్మం పొడి బారి సున్నితంగా తయారవుతుంది. ఇలాంటి సందర్భాల్లో చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడొచ్చు. స్నానం తర్వాత తప్పనిసరిగా అక్వా బేస్డ్ క్రీములు ఉపయోగించాలని ఫార్మసిస్ట్ అబ్బాస్ సలహా ఇస్తున్నారు.
జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది
హాట్ షవర్ వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయట. వేడినీటి స్నానం వల్ల తలమీది చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. జుట్టు పెరుగుదలకు ఇది అతి పెద్ద ఆటంకం. వేడి నీటి ఆవిరి వల్ల జుట్టు పెళుసుగా తయారై తెగిపోతుందని ఇది జుట్టు రాలడాకి ఒక కారణం అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. తల మీద వేడి నీరు ఉన్నపుడు అది చర్మ రంధ్రాలను తెరుస్తుంది. ఫలితంగా హెయిర్ రూట్స్ వదులుగా తయారవుతాయి. ఫలితంగా జట్టు సులభంగా రాలిపోతుంది.
తామర నుంచి గుండెపోటు వరకు.. ఎన్నో సమస్యలు
వేడి నీటి స్నానం సౌకర్యంగా, రిలాక్సింగ్ గా ఉంటుంది. కానీ చర్మ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. తామర వంటి చర్మ ససమ్యలను మరింత తీవ్రం చేస్తాయి. అంతేకాదు వేడి నీటి స్నానం వల్ల బీపీ కూడా పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం కావచ్చు. గుండె పోటుకు దారితీయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు చన్నీటి స్నానం లేదా గోరువెచ్చని నీటి స్నానమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కనుక ఎంత చలిగా ఉన్నప్పటికీ వేడివేడి నీటి స్నానం మాత్రం అంత మంచిదికాదు. కనుక చలి మరీ భరించలేకపోతే మాత్రం తప్పనిసరిగా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చెయ్యాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.